Begin typing your search above and press return to search.

కరేబియన్‌ సముద్రంలో భగ్గుమన్న ఉద్రిక్తతలు.. వెనెజువెలా పడవపై అమెరికా దాడి

కరేబియన్‌ సముద్రంలో అమెరికా – వెనెజువెలా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.

By:  A.N.Kumar   |   17 Sept 2025 3:00 AM IST
కరేబియన్‌ సముద్రంలో భగ్గుమన్న ఉద్రిక్తతలు.. వెనెజువెలా పడవపై అమెరికా దాడి
X

కరేబియన్‌ సముద్రంలో అమెరికా – వెనెజువెలా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. మాదక ద్రవ్యాలను తరలిస్తోందన్న ఆరోపణలపై అమెరికా నేవీ దళాలు వెనెజువెలాకు చెందిన ఓ పడవను ముంచివేశాయి. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది.

అమెరికా సైన్యం ప్రకారం.. ఆ పడవలో భారీగా డ్రగ్స్‌ ఉన్నట్లు ధృవీకరించిన తర్వాతే దాడి జరిపారు. అంతర్జాతీయ జలాల్లో ఈ ముఠాలు అమెరికా వైపు మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా తాము అడ్డుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో తెలిపారు. “క్రూరమైన డ్రగ్స్‌ ముఠాలు అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి, దేశ ప్రయోజనాలకు ముప్పు’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రెండు వారాల క్రితం కూడా అమెరికా దళాలు డ్రగ్స్‌ తరలిస్తున్న మరో స్పీడ్‌బోట్‌పై దాడి చేసి 11 మందిని హతమార్చిన విషయం తెలిసిందే. తాజాగా పడవపై దాడి దృశ్యాలను తాను పరిశీలించానని ట్రంప్‌ వెల్లడించారు. “మా దాడులు మొదలైన తర్వాత కరేబియన్‌లో పడవల రాకపోకలు తగ్గినా, డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ ఇంకా యాక్టివ్‌గానే ఉన్నట్లు అనుమానం’’ అని ఆయన చెప్పారు.

ఇక అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో స్పందిస్తూ “మా ఖండంలోకి చొరబడే ముఠాలను గుర్తించి వారి నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తాం. ఎప్పుడు, ఎక్కడ అనేది మేమే నిర్ణయిస్తాం’’ అని హెచ్చరించారు.

డ్రగ్స్‌ ముఠాలను అణచివేయడానికి అమెరికా యుద్ధస్థాయిలో సన్నద్ధమైంది. ఇప్పటికే 8 యుద్ధ నౌకలను కరేబియన్‌ సముద్రానికి పంపించింది. వీటిలో యూఎస్‌ఎస్‌ శాన్‌ ఆంటోనియో, యూఎస్‌ఎస్‌ ఇవో జిమా, యూఎస్‌ఎస్‌ ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ వంటి నౌకలు ఉన్నాయి. ఈ నౌకల్లో సుమారు 4,500 మంది సైనికులు, 22వ మెరైన్‌ యూనిట్‌కు చెందిన 2,200 మంది కమాండోలు ఉన్నారు.

దీంతో కరేబియన్‌ సముద్రం ప్రస్తుతం అమెరికా – వెనెజువెలా మధ్య శక్తిపరీక్ష వేదికగా మారింది. మాదక ద్రవ్యాల ముఠాలపై యుద్ధం పేరుతో అమెరికా బలగాల మోహరింపు, భవిష్యత్తులో మరింత రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.