Begin typing your search above and press return to search.

ఇరాన్ యుద్ధానికి ముందే అమెరికా సైనిక కదలికలు బహిర్గతం.. చైనా ఉపగ్రహాల సంచలనం!

ఫిబ్రవరి 20 ప్రాంతంలో సోషల్ మీడియాలో కొన్ని ఉపగ్రహ చిత్రాలు నిశ్శబ్దంగా వైరల్ అయ్యాయి.

By:  A.N.Kumar   |   11 March 2026 3:32 PM IST
ఇరాన్ యుద్ధానికి ముందే అమెరికా సైనిక కదలికలు బహిర్గతం.. చైనా ఉపగ్రహాల సంచలనం!
X

ఆధునిక యుద్ధతంత్రం మారుతోంది. ఇప్పుడు యుద్ధం కేవలం యుద్ధక్షేత్రంలోనే కాదు.. అంతరిక్షంలో డిజిటల్ డేటా విశ్లేషణలో కూడా జరుగుతోంది. దీనికి నిదర్శనంగా ఇటీవల మధ్యప్రాచ్యంలో జరిగిన పరిణామాలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేశాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ"ని ప్రారంభించకముందే ఆ దేశాల సైనిక కదలికలను చైనాకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ ముందే పసిగట్టి బయటపెట్టిన వైనం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది.

ఫిబ్రవరి 20 ప్రాంతంలో సోషల్ మీడియాలో కొన్ని ఉపగ్రహ చిత్రాలు నిశ్శబ్దంగా వైరల్ అయ్యాయి. ఆ చిత్రాల్లో ఇజ్రాయెల్‌లోని ఓవ్డా ఎయిర్ బేస్‌లో ఉన్న అత్యాధునిక అమెరికన్ ఎఫ్-22 స్టెల్త్ ఫైటర్ జెట్‌ల నుండి, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాల వరకు అన్నీ అత్యంత స్పష్టంగా కనిపించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రాలపై ఉన్న వివరాలన్నీ చైనా భాష (మాండరిన్)లో ఉన్నాయి. విమానాల రకాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, సైనికుల సమీకరణ స్థలాలు.. ఇలా ప్రతి ఒక్కటీ ఖచ్చితమైన భౌగోళిక వివరాలతో సహా బయటకు వచ్చాయి.

ఈ విశ్లేషణను విడుదల చేసింది షాంఘైకి చెందిన 'మిజార్ విజన్' అనే చిన్న సంస్థ. వీరు సొంతంగా ఉపగ్రహాలను కలిగి లేకపోయినా అందుబాటులో ఉన్న కమర్షియల్ శాటిలైట్ డేటా, ఫ్లైట్ ట్రాకింగ్ , షిప్ ట్రాకింగ్ సమాచారాన్ని కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. ఈ సమాచారం చైనాకు చెందిన శక్తివంతమైన 'జిలిన్-1' ఉపగ్రహ వ్యవస్థ నుండి సేకరించి ఉండవచ్చని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

యుద్ధ వ్యూహాలపై ప్రభావం

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన సమయానికి, మిజార్ విజన్ నుండి వరుసగా మరిన్ని చిత్రాలు విడుదలయ్యాయి. ఇరాన్ ఈ సమాచారాన్ని నేరుగా దాడులకు ఉపయోగించిందా అన్నదానిపై ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా మిజార్ విజన్ గుర్తించిన ఖతార్‌లోని అల్-ఉదైద్ ఎయిర్ బేస్, జోర్డాన్‌లోని అమెరికా రక్షణ వ్యవస్థలపై తర్వాత దాడులు జరగడం గమనార్హం.

ఈ సంఘటన ఒక కఠిన వాస్తవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఆధునిక యుద్ధ రంగంలో రహస్యాల నిర్వహణ ఎంత కష్టమో ఇది రుజువు చేస్తోంది. వంద మందికి తక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఒక చిన్న సంస్థ కూడా తన డేటా అనలిటిక్స్ సామర్థ్యంతో ప్రపంచ అగ్రరాజ్యాల సైనిక వ్యూహాలను ప్రభావితం చేయగలదని భవిష్యత్ యుద్ధాల్లో డేటా, ఏఐ ఎంత కీలకమో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ఇది అమెరికా రక్షణ విభాగం యొక్క "సెక్యూరిటీ ప్రోటోకాల్స్" పై భారీ ప్రశ్నలను లేవనెత్తుతోంది.