Begin typing your search above and press return to search.

మానవత్వాన్ని మర్చిపోయిన జైళ్లు.. అమెరికా నిర్బంధ కేంద్రాలు

ఈ కేంద్రాల్లో ఇరుకైన గదుల్లో వందలాది మంది ఒకే ప్రదేశంలో కిక్కిరిసి పడుకోవాల్సి వస్తోంది.

By:  A.N.Kumar   |   9 Sept 2025 11:17 AM IST
మానవత్వాన్ని మర్చిపోయిన జైళ్లు.. అమెరికా నిర్బంధ కేంద్రాలు
X

అమెరికాలో అక్రమ వలసదారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వలస చట్టాలను ఉల్లంఘించిన వారికి తాత్కాలిక నిర్బంధం కల్పించే కేంద్రాలు ఇప్పుడు నిజంగా “నిత్య నరకం”గా మారిపోయాయి. మియామీలోని క్రోమ్‌ నిర్బంధ కేంద్రం నుంచి బయటకు వచ్చిన వీడియో ఈ కేంద్రాల అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించింది.

కిక్కిరిసిన గదులు.. మానవ హక్కుల ఉల్లంఘన

ఈ కేంద్రాల్లో ఇరుకైన గదుల్లో వందలాది మంది ఒకే ప్రదేశంలో కిక్కిరిసి పడుకోవాల్సి వస్తోంది. నేలమీద కార్డుబోర్డు పెట్టుకొని పరుపుల్లా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ట్యూబ్‌ లైట్ల కాంతి కళ్లపై పడకుండా మాస్కులు వేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఒకరి కాళ్లు మరొకరి ముఖానికి తగలడం, శ్వాస తీసుకోవడమే కష్టంగా మారుతోంది.

* ఆహారం, నీరు, సదుపాయాల కొరత

ఐసీఈ (ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ) నియమాల ప్రకారం వలసదారులను 12 గంటలకు మించి ఉంచరాదు. కానీ వాస్తవానికి 3–4 రోజుల వరకు నిర్బంధిస్తున్నారు. ఈ కాలంలో సరైన ఆహారం, నీరు అందడం లేదు. దిండ్లు, దుప్పట్లు ఇవ్వడం లేదు. ఏసీలు పనిచేయక గదులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇటీవలే 3 రోజులకు పైగా నిర్బంధంలో ఉన్న ఒక వ్యక్తి మరణించడం పరిస్థితుల తీవ్రతను చాటిచెప్పింది.

* ట్రంప్ పాలనలో నిర్బంధాల విస్తరణ

డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక వలసదారులపై నిర్బంధం మరింత కఠినమైంది. నిర్బంధ కేంద్రాల్లో 81 శాతం సీట్లు నిండిపోయాయి. గతంలో పది మందికి మించి లేని కేంద్రాల్లో ఇప్పుడు వందల మంది ఉంటున్నారు. మయామీ క్రోమ్‌ కేంద్రంలో ప్రస్తుతం 600 మందికి పైగా నిర్బంధంలో ఉన్నారు. తాజాగా ట్రంప్‌ ఆమోదించిన ఫైలుతో అదనంగా 80,000 బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

* మానవత్వం ఎక్కడ?

ఐసీఈ కేంద్రాలపై వచ్చిన అంతర్గత ఆడిట్లలోనూ అనేక లోపాలు బయటపడ్డాయి. వలసదారుల పట్ల కనీస మానవతా దృక్పథం లేకుండా ప్రవర్తించడం అంతర్జాతీయంగా విమర్శలకు గురవుతోంది. మానవ హక్కుల సంఘాలు ఈ కేంద్రాలను “మానవత్వాన్ని మర్చిపోయిన జైళ్లు”గా అభివర్ణిస్తున్నాయి.

అమెరికా కలల కోసం వచ్చిన వలసదారులు చివరకు నిర్బంధ కేంద్రాల “నరకం”లో ఇరుక్కుపోతుండటం అమెరికా ప్రజాస్వామ్యంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.