ఒకే నంబర్‌తో రెండు విమానాలు గాల్లో ఢీకొట్టే సమయంలో మిరాకిల్.. ప్రయాణీకులు సేఫ్!
అమెరికాలో శుక్రవారం అర్థరాత్రి ఒకే ఫ్లైట్ నంబర్‌తో ప్రయాణిస్తున్న రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చే ప్రమాదం తృటిలో తప్పిపోయి, భారీ విమాన ప్రమాదాన్ని ఆపగలిగారు.
By: Sivaji Kontham | 16 Aug 2026 3:00 PM ISTఅమెరికాలో శుక్రవారం అర్థరాత్రి ఒకే ఫ్లైట్ నంబర్‌తో ప్రయాణిస్తున్న రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చే ప్రమాదం తృటిలో తప్పిపోయి, భారీ విమాన ప్రమాదాన్ని ఆపగలిగారు. ఆకాశంలో ఒకే నంబర్‌తో ప్రయాణిస్తున్న రెండు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాలను ఫీనిక్స్ విమానాశ్రయానికి చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) సమయస్ఫూర్తితో గమనించి... తగిన సూచనలు ఇవ్వడం ద్వారా ప్రమాదాన్ని ఆపారు. అసోసియేటెడ్ ప్రెస్ (ఏ.పి) నివేదికల ప్రకారం.. అధికారుల వేగం తెలివితేటల కారణంగా ఆ రెండు విమానాల్లోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
సాధారణంగా అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ నంబర్ 2482 షికాగో- ఫీనిక్స్ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తుంటుంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల షికాగో నుంచి రావాల్సిన విమానం ఆలస్యమైంది. దీనితో ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఫీనిక్స్ నుంచి సమయానికి బయలుదేరడానికి మరొక విమానాన్ని కేటాయించింది. సరిగ్గా అదే సమయంలో షికాగో విమానం ఫీనిక్స్ చేరుకోవడం.. ఫీనిక్స్ విమానం టేకాఫ్ అవ్వడం ఒకేసారి జరగడంతో ఒకే విమాన నంబర్‌తో రెండు విమానాలు ఒకే ఆకాశ మార్గంలోకి వచ్చాయి.
ఏటిసి మానిటర్‌పై ఈ విషయాన్ని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే అప్రమత్తమయ్యారు. గందరగోళాన్ని నివారించేందుకు ఆయన రాకపోకలు సాగిస్తున్న విమానాలను `అమెరికన్ 2482 అరైవల్`, `అమెరికన్ 2482 డిపార్చర్` అని పిలుస్తూ పైలట్లకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. కింద నుంచి టేకాఫ్ అవుతున్న విమానం పైకి లేవకుండా నియంత్రిస్తూ... పైన వస్తున్న విమానాన్ని సురక్షితమైన ఎత్తులోనే ఉంచి.. పైలట్లు పరస్పరం ఒకరినొకరు చూసుకునేలా చేస్తూ ప్రమాద పరిధి నుండి తప్పించారు.
ఈ ఘటనపై 25 ఏళ్ల అనుభవం ఉన్న ఆ కంట్రోలర్ స్పందిస్తూ.. తన కెరీర్‌లో ఒకే కాల్ సైన్‌తో రెండు విమానాలు ఇలా ఒకే చోటికి రావడం ఎప్పుడూ చూడలేదని... ఇది చాలా అరుదైన విషయమని తెలిపారు. పైలట్ కూడా కంట్రోలర్ సమయస్ఫూర్తిని కొనియాడగా... ఇది పెద్ద ప్రమాదానికి దారితీసేదే... కానీ సమయానికి పరిస్థితి చక్కబడటం ఊరటనిచ్చింది! అని ఆయన పేర్కొన్నారు. విమాన సంస్థ డిస్పాచ్ సెంటర్ చేసిన పొరపాటు వల్లనే ఒకే నంబర్‌తో రెండు విమానాలు గాలిలోకి వచ్చాయని విమానయాన భద్రతా నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఈ అసాధారణ ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ - ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.ఏ.ఏ) సమగ్ర విచారణకు ఆదేశించాయి. కంట్రోలర్ - పైలట్ల వృత్తి నైపుణ్యం... అప్రమత్తత వల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో కొనియాడింది. వ్యవస్థలో లోపాలు ఉన్నా ప్రాణనష్టం జరగకుండా కాపాడే సురక్షితమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని ఈ ఘటన మరొకసారి నిరూపించింది.
