ట్రంప్ యుద్ధం స్టార్ట్ చేస్తే ఎండ్ కార్డ్ ఇరాన్ చేతుల్లో !
అమెరికా పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ ఏ వ్యూహంతో ఇరాన్ మీదకు యుద్ధం వచ్చి యుద్ధం మొదలెట్టాడో తెలియదు కానీ ఇపుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు అయ్యాడని అంటున్నారు.
By: Satya P | 12 March 2026 2:00 PM ISTఅమెరికా పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ ఏ వ్యూహంతో ఇరాన్ మీదకు యుద్ధం వచ్చి యుద్ధం మొదలెట్టాడో తెలియదు కానీ ఇపుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు అయ్యాడని అంటున్నారు. యుద్ధం నేను మొదలెట్టాను నేనే ఆపుతాను అని ట్రంప్ అంటున్నా ఇపుడు ఆయన చేతులలో ఏమీ లేదని పరిణామాలు చూస్తే అర్ధం అవుతోంది. ఇరాన్ అయితే యుద్ధాన్ని ఆపేది తామే అని అంటోంది. అంతే కాదు తానో ఇజ్రాయెల్ నో ఏదో ఒక దేశం మాత్రమే పశ్చిమాసియాలో ఉంటాయని చెబుతోంది. తాము కచ్చితంగా ఉంటామని అంతం చేసేది ఇజ్రాయెల్ ని అని కూడా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. అదే సమయంలో అమెరికాకూ సీరియస్ గానే హెచ్చరికలు జారీ చేస్తోంది.
కధ అడ్డం తిరిగింది :
అమెరికా ఇజ్రాయెల్ పోయి పోయి 86 ఏళ్ళ కురు వృద్ధుడైన ఖమేనీని ఆయన పరివారాన్ని యుద్ధం నెపంతో హతమార్చారు. కానీ సాధించింది మాత్రం శూన్యం అంటున్నారు. ఎందుకంటే అతని కంటే చురుకైన వాడు అత్యంత కఠినమైన వాడు అయిన 57 ఏళ్ళు జూనియర్ ఖమేనీ ఇపుడు ఇరాన్ కి కొత్త సుప్రీం లీడర్ గా వచ్చారు. దాంతో ఇరాన్ యుద్ధ రూపమే మారిపోయింది. దాంతో ఖమేనీని లేకుండా చేస్తే ఇరాన్ జుట్టు మొత్తం తమ చేతుల్లోకి వస్తుందని ఆలోచించిన అమెరికా ఇజ్రాయెల్ రెండు దేశాల కలలూ నెరవేరడం లేదు. అంతే కాదు ఇపుడు ఇరాన్ కసి మీద ఉంది. దెబ్బ తిన్న బెబ్బులిగా మారింది. దాంతో ఇరాన్ మాకు పోయేదేమీ లేదు చూసుకుందామని అంటోంది. దాంతో ఇక్కడే కధ అడ్డం తిరిగి అమెరికా తల పట్టుకోవాల్సి వస్తోంది అంటున్నారు.
ఇంటా బయటా వ్యతిరేకత :
అమెరికా ఆదాయాలు కరిగిపోతున్నాయి. యుద్ధం వల్ల డబ్బు మంచి నీళ్ల ప్రాయం అయింది. గల్ఫ్ దేశాల మిత్రులు కూడా ఇపుడు అమెరికా మీద తీవ్ర అసహనం గా ఉన్నారు. అమెరికా పౌరులు సైతం ఈ యుద్ధం పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎందుకొచ్చిన యుద్ధమని కూడా అంటున్నారు. మరో వైపు రష్యా చైనా కూడా ఇరాన్ విషయంలో సంఘీభావంగా ఉన్నాయి. ఇవన్నీ చివరికి అమెరికా పెద్దన్నకు చికాకుగా మారుతున్నాయి. యుద్ధం ఆపే శక్తి తమకే ఉంది అని బీరాలు పోవడం తప్ప చేసేది ఏమీ లేకుండా పోతోంది అని అంటున్నారు.
ఇరాన్ కండిషన్లు ఒప్పుకుంటారా :
ఇక అమెరికా ఈ యుద్ధం నుంచి గౌరవప్రదంగా బయటపడడం ఎలా అన్నదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది. మరో వైపు పరిస్థితి అంతా సానుకూలం చేసుకుంటున్న ఇరాన్ ఏకంగా అమెరికాకే షరతులు పెడుతోంది. వాటిని అంగీకరిస్తేనే యుద్ధాన్ని విరమిస్తామని అంటున్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ భవిష్యత్తులో ఎలాంటి దాడులు ఇరాన్ మీద చేయమని ఒక బలమైన హామీ ఇవ్వాలని కోరుతోంది. అలాగే ఇరాన్ కి ఉన్న హక్కులను గురించాలని మరో షరతు పెట్టింది. ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో ఇరాన్ నష్టపోయిన దానికి తగిన పరిహారం ఇవ్వాలని మూడో షరతుగా ముందుకు తెచ్చింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసౌజ్ పెజెష్కియన్ ఎక్స్ లో పేర్కొన్నారు.
ఇరాన్ తో పెట్టుకుంటే :
నిజానికి చూస్తే ఇరాన్ కి ఇక పోయేది ఏమీ లేదనే అంటున్నారు. ఎలాగూ నష్టపోయాం, ఇక ముందు పోరాటమే అని అంటోంది. ఎంత కాలం సాగినా తాము రెడీ అంటోంది. కానీ అమెరికా పరిస్థితి అలా కాదని విశ్లేషిస్తున్నారు. ఇంటా బయటా సమస్యలు అనేకం ఉన్నాయి. ఒత్తిళ్ళు ఉన్నాయి. అందుకే ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలా అని అమెరికా ఇపుడు మల్ల గుల్లాలు పడుతోంది అని ప్రచారం సాగుతోంది యుద్ధం ఎంత కాలం కొనసాగితే అమెరికాకు అంత కాలమూ నష్టమే. దాంతో పాటు ఒక వైపు గల్ఫ్ మిత్ర దేశాలు గుర్రుగా ఉంటున్నాయి. మరో వీపు యూరోపియన్ దేశాల నుంచి వ్యతిరేకత వస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ కీలక సమయంలో అమెరికా ఎలా పావులు కదుపుతుందో.
