శాంతి ఒప్పందం.. యుద్ధం చేసి ఏం సాధించావయ్యా ట్రంప్.. నిండా మునిగిన అమెరికా
అమెరికా-ఇరాన్ మధ్య వంద రోజులకు పైగా సాగిన "ఎవరు ముందుగా కన్నుగీటుతారో" అనే భారీ అంతర్జాతీయ రియాలిటీ షోకు ఎట్టకేలకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది.
By: A.N.Kumar | 15 Jun 2026 1:00 PM ISTఅమెరికా-ఇరాన్ మధ్య వంద రోజులకు పైగా సాగిన "ఎవరు ముందుగా కన్నుగీటుతారో" అనే భారీ అంతర్జాతీయ రియాలిటీ షోకు ఎట్టకేలకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధి చుట్టూ యుద్ధ నౌకలు తిరగడం, చమురు ట్యాంకర్లపై డ్రోన్ల దాడులు జరగడం.. ప్రపంచ దేశాలు చమురు ధరల గ్రాఫ్‌ను చూస్తూ గుండెల్లో దడ పుట్టించుకోవడం వంటి ఎపిసోడ్‌ల తర్వాత రెండు దేశాలు 'లైట్' తీసుకుని చర్చల బల్లపై కూర్చోవాలని నిర్ణయించుకున్నాయి.
ఈ హై-వోల్టేజ్ డ్రామాలో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అన్నది పక్కన పెడితే చమురు కంపెనీలు మాత్రం కొన్ని నెలల పాటు పండగ చేసుకున్నాయి. మరోవైపు సాధారణ ప్రజలు మాత్రం పెట్రోల్ బంక్‌ల వద్ద బిల్లులు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా "మా తప్పేముంది?" అన్నట్లుగా మూలన కూర్చుని బావురుమంది.
ఒమన్ తీరంలో ముగిసిన ఆట.. పెరిగిన ఒత్తిడి..
ఇరాన్‌పై అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనం పరిస్థితిని మరింత వేడెక్కించింది. ఒకరినొకరు బెదిరించుకునే లోపే ఒమన్ తీరంలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంతో అంతర్జాతీయ ఒత్తిడి ఒక్కసారిగా పెరిగింది. "ఇక చాలు.. ఆటలు ఆపండి" అంటూ ప్రపంచ దేశాలు గట్టిగా అరిచేసరికి ఇరు దేశాలకూ "కొంచెం తగ్గితే మంచిదేమో" అనే జ్ఞానోదయం కలిగినట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు ఒప్పందం చర్చల్లో అసలు హైలైట్ ఏమిటంటే.. 'మనీ.. మనీ.. మనీ' ఇరాన్‌కు చెందిన ఫ్రోజెన్ నిధులు విడుదల చేయాలా? ఆంక్షలు ఎంతవరకు సడలించాలి? ఈ వంద రోజుల విధ్వంసం తర్వాత పునర్నిర్మాణానికి ఎవరు ఖర్చు పెట్టాలి? అనే ప్రశ్నల చుట్టూనే చర్చలు తిరుగుతున్నాయి. యుద్ధం ముగిసినా ఖాతాల సెటిల్‌మెంట్ బిల్లులు చెల్లించడం మాత్రం ఇంకా మిగిలి ఉన్నట్టే ఉంది.
రాకెట్‌లా ఎగిరి.. లిఫ్ట్‌లో దిగుతున్న చమురు ధరలు
హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు కుదుటపడుతున్నాయనే వార్తలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. కొన్ని వారాలుగా రాకెట్‌లా ఎగిరిన చమురు ధరలు ఇప్పుడు లిఫ్ట్‌లో దిగివస్తున్నాయి. దీనితో ప్రపంచ దేశాల ఆర్థిక మంత్రులు కూడా తమ జేబులు తడుముకుంటూ కాస్త రిలాక్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అసలు సినిమా ఇంకా పూర్తికాలేదు సుమా.. ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమే.
ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ మిలీషియా గ్రూపుల పాత్ర, ఒప్పంద అమలుపై పర్యవేక్షణ వంటి క్లిష్టమైన అంశాలు ఇంకా టేబుల్‌పైనే ఉన్నాయి. అందుకే విశ్లేషకులు ఈ ఒప్పందాన్ని "ది ఎండ్" కార్డ్‌గా కాకుండా కేవలం పార్ట్-1 ముగింపుగా మాత్రమే చూస్తున్నారు.
మొత్తానికి వంద రోజుల యుద్ధం తర్వాత అమెరికా-ఇరాన్‌లు శాంతి మాటలు మాట్లాడుతున్నాయి. కానీ చరిత్ర చెబుతున్న ఒక సత్యం ఏమిటంటే... యుద్ధాలు తుపాకీ కాల్పులతో ట్వీట్లతో మొదలవుతాయి, ఏసీ రూముల్లో చర్చలతో ముగుస్తాయి. అయితే వాటి వల్ల వచ్చే బిలియన్ డాలర్ల బిల్లులు మాత్రం రాబోయే తరాల సామాన్యుల అకౌంట్ల నుండి కట్ అవుతూనే ఉంటాయి..
