స్విట్జర్లాండ్‌లో ఉద్రిక్తంగా అమెరికా-ఇరాన్ చర్చలు.. జేడీ వాన్స్‌కు అవమానం? వైరల్ వీడియోలు
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో భాగంగా స్విట్జర్లాండ్‌లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 22 Jun 2026 1:36 PM ISTపశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో భాగంగా స్విట్జర్లాండ్‌లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ముఖాముఖి సమావేశమయ్యారు. అయితే ఈ చర్చలు ప్రారంభం కావడానికి ముందే చోటుచేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారాయి. ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు దౌత్యపరంగా ఘోర అవమానం జరిగిందంటూ కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఫోటో సెషన్‌ను బహిష్కరించిన ఇరాన్ ప్రతినిధులు?
సమావేశం ప్రారంభానికి ముందు సాంప్రదాయబద్ధంగా అమెరికా ప్రతినిధులు, ఇరాన్ ప్రతినిధులతో కరచాలనం చేసి, గ్రూప్ ఫొటో దిగాలని భావించినట్లు ఇరాన్‌కు చెందిన ప్రముఖ ‘తస్నిమ్’ వార్తాసంస్థ వెల్లడించింది. అయితే ఇందుకు ఇరాన్ ప్రతినిధులు నిరాకరించినట్లు సమాచారం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది. హెజ్‌బొల్లాకు మద్దతు నిలిపివేయాలని.. లేదంటే ఇరాన్‌పై మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉందంటూ ట్రంప్ హెచ్చరించడంపై టెహ్రాన్ ప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ఆగ్రహంతోనే వారు ఫోటో సెషన్‌లో పాల్గొనడానికి నిరాకరించి, సమావేశ ప్రాంగణం నుండి తాత్కాలికంగా బయటకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
జేడీ వాన్స్ వీడియోల వెనుక అసలు నిజమేంటి?
ఇదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆ వీడియోలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కొంత దూరంలో ఒంటరిగా నిలబడి, అక్కడ జరుగుతున్న గందరగోళ పరిస్థితిని గమనిస్తున్నట్లు కనిపిస్తోంది. అనంతరం ఆయన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌లతో మాట్లాడిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి.
వైరల్ అవుతున్న మరో కోణం
ఖతార్ ప్రధాని పక్కనే ఉన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను పలకరించి.. ఆయన పక్కనే నిలబడిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను మాత్రం కనీసం పలకరించకుండా అభివాదం చేయకుండా దాటి వెళ్లినట్లు మరో వీడియో వైరల్ అయ్యింది. దీనిని నెటిజన్లు అమెరికాకు జరిగిన "దౌత్యపరమైన తిరస్కారం" గా అభివర్ణిస్తున్నారు. అయితే మరికొందరు విశ్లేషకులు మాత్రం కేవలం ఎడిట్ చేసిన లేదా కొన్ని సెకన్ల వీడియో క్లిప్పింగుల ఆధారంగా అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి నిర్ధారణలకు రావడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై అటు అమెరికా కానీ, ఇటు ఇరాన్ లేదా సంబంధిత దేశాలు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఉద్రిక్తతల మధ్యే సాగిన కీలక చర్చలు
ఇలాంటి నాటకీయ పరిణామాలు, ఉద్రిక్త వాతావరణం మధ్యే అమెరికా-ఇరాన్ ప్రతినిధుల సమావేశం కొనసాగింది. ఈ హై-ప్రొఫైల్ భేటీలో ఇరు దేశాలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.. ఇరాన్ అణు కార్యక్రమంలో భాగంగా ఇరాన్ అణు సామర్థ్యాల నియంత్రణ, పాత ఒప్పందాల పునరుద్ధరణ... లెబనాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హెజ్‌బొల్లా కదలికలు... పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు.. మిడిల్ ఈస్ట్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఏది ఏమైనప్పటికీ తీవ్రమైన రాజకీయ, సైనిక విభేదాలు కొనసాగుతున్నప్పటికీ.. యుద్ధ వాతావరణాన్ని పక్కన పెట్టి ఇరు దేశాలు సంభాషణల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయడం ఒక సానుకూల పరిణామమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించిన వీడియోలు, వాటిపై వస్తున్న విభిన్న వ్యాఖ్యానాలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి.
