పాకిస్తాన్ నమ్మితే మునుగుతాం.. అమెరికా విదేశాంగ వ్యూహంలో కొత్త చీలిక?
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు దౌత్యపరంగా ఎంత కీలకమో.. వాటి చుట్టూ ఇప్పుడు అంతే పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది.
By: A.N.Kumar | 23 Jun 2026 10:00 PM ISTఅమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు దౌత్యపరంగా ఎంత కీలకమో.. వాటి చుట్టూ ఇప్పుడు అంతే పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. చర్చల్లో పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరించడం అమెరికాలోనే తీవ్ర విమర్శలకు దారి తీసింది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్లు ట్రంప్ ప్రభుత్వాన్నే ప్రశ్నించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
'ఉగ్రవాద చరిత్ర ఉన్న దేశాలను ఎలా నమ్ముతారు?'
ఫ్లోరిడా రిపబ్లికన్ సెనేటర్ రిక్ స్కాట్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం, ఆర్థిక సహాయం అందించారనే ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తాన్, ఖతార్‌లను శాంతి చర్చల్లో మధ్యవర్తులుగా అంగీకరించడం సరైన నిర్ణయం కాదన్నారు. అమెరికా తన అసలైన మిత్రదేశాలు ఎవరో గుర్తించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇరాన్ అణ్వాయుధాల విషయంలో అమెరికా ఎలాంటి రాజీ పడకూడదని, ఏ ఒప్పందమైనా ఇరాన్‌కు అణ్వాయుధ సామర్థ్యం కల్పించేలా ఉండకూడదని స్పష్టం చేశారు.
లాడెన్ ఉదాహరణతో పాక్‌పై విరుచుకుపడ్డ సెనేటర్
మొంటానా సెనేటర్ టిమ్ షీహీ మరింత ఘాటుగా స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత వాంఛనీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ సంవత్సరాల తరబడి ఆశ్రయం ఇచ్చిందనే విషయాన్ని ప్రపంచం మర్చిపోలేదన్నారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా వ్యతిరేక తిరుగుబాటుదారులకు నిధులు అందించడం, ఇరాన్‌కు అనుకూలంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న దేశం ఇప్పుడు శాంతి చర్చల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
అమెరికా నిజమైన మిత్రులు ఎవరంటే?
పాకిస్తాన్, ఖతార్‌లకు బదులుగా మధ్యప్రాచ్యంలో అమెరికాకు విశ్వసనీయ భాగస్వాములైన యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలకు కీలక పాత్ర ఇవ్వాలని సెనేటర్లు సూచించారు. సంక్షోభ సమయాల్లో ఈ దేశాలే అమెరికాకు అండగా నిలిచాయని, అందుకే భవిష్యత్ దౌత్య చర్చల్లో వీరినే ప్రధాన భాగస్వాములుగా చూడాలని అభిప్రాయపడ్డారు.
ట్రంప్ ప్రభుత్వానికి అంతర్గత ఒత్తిడి పెరుగుతోందా?
ఈ వ్యాఖ్యలు కేవలం పాకిస్తాన్‌పై విమర్శలు మాత్రమే కావు. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ వ్యూహంపై సొంత పార్టీ నేతల నుంచే ప్రశ్నలు రావడం గమనార్హం. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలు అత్యంత సున్నిత దశలో ఉన్న సమయంలో ఈ విమర్శలు రావడం వల్ల భవిష్యత్ దౌత్య పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగా.. మరోవైపు అమెరికాలోనే పాకిస్తాన్ పాత్రపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మధ్యప్రాచ్య దౌత్యంలో అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుంటుందా? లేక ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్నే కొనసాగిస్తుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
