Begin typing your search above and press return to search.

యుద్ధం ముగిసిందని ట్రంప్ చేతులెత్తాడు.. కానీ అసలు ట్విస్ట్ ఇరాన్ చేతిలోనే

కొన్ని రోజులుగా ప్రపంచాన్ని ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ సినిమాలా టెన్షన్ పెట్టిన అమెరికా-ఇరాన్ లొల్లికి ప్రస్తుతానికైతే 'శుభం' కార్డు పడినట్టు కనిపిస్తోంది.

By:  A.N.Kumar   |   15 Jun 2026 9:48 AM IST
యుద్ధం ముగిసిందని ట్రంప్ చేతులెత్తాడు.. కానీ అసలు ట్విస్ట్ ఇరాన్ చేతిలోనే
X

కొన్ని రోజులుగా ప్రపంచాన్ని ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ సినిమాలా టెన్షన్ పెట్టిన అమెరికా-ఇరాన్ లొల్లికి ప్రస్తుతానికైతే 'శుభం' కార్డు పడినట్టు కనిపిస్తోంది. "ఇక చాలు బాస్.. యుద్ధం ముగిసింది" అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. దీంతో "అబ్బా.. థియేటర్లలో సీట్ల అంచులు పట్టుకుని కూర్చున్న జనాలంతా థాంక్స్ రా బాబు" అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆగండి.. సినిమా క్లైమాక్స్ అయిపోయిందని థియేటర్ లైట్లు వేసేలోపే.. ఇరాన్ స్క్రీన్ మీద ‘ట్విస్ట్’ బోర్డు పెట్టింది. ఈ కథ ఇంకా పూర్తిగా ముగియలేదనే సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి.

హోర్ముజ్ జలసంధి 'లాక్'.. విలవిల్లాడిన ప్రపంచం

ఈ ఇద్దరి ఈగోల మధ్య నలిగిపోయింది మాత్రం సామాన్య జనమే. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధికి తాళం పడటంతో ముడి చమురు సరఫరాలు బ్రేక్ పడ్డాయి. ఫలితంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రాకెట్‌లా దూసుకెళ్లాయి. పెట్రోల్ బంక్‌కు వెళ్లి బిల్లు చూసిన వినియోగదారుడికి గుండె ఆగినంత పనైంది. మనలాంటి దిగుమతులపై ఆధారపడే దేశాల పరిస్థితి అయితే మరీ ఘోరం. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయలేక ప్రభుత్వాలు తలలు పట్టుకున్నాయి. ఇలాంటి టైమ్‌లో శాంతి ఒప్పందం కుదరడంతో మార్కెట్లు కాస్త కుదుటపడ్డాయి. జలసంధి తెరుచుకుంటే చమురు ధరలు దిగివచ్చి భారత్‌కు భారీ ఊరట లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

అసలు కథ ఇక్కడే ఉంది.. 24 బిలియన్ డాలర్ల పంచాయితీ

"యుద్ధం ఆపమంటే ఆపుతాం.. కానీ మా పైసలు మాకు ఇచ్చేయాలి మరి" అంటూ ఇరాన్ మైండ్ వాయిస్ వినిపిస్తోందట.. ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తుల విడుదల అంశం ఇప్పుడు పెద్ద పంచాయితీగా మారింది. ఒప్పందానికి ముందే 12 బిలియన్ డాలర్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఇరాన్ మీడియా సంబరపడుతోంది. కానీ అమెరికా మాత్రం, "ముందు మీరు బుద్ధిగా ఒప్పందాన్ని అమలు చేయండి.. ఆ తర్వాతే మిగతా చిల్లర ఇస్తాం" అంటూ కండిషన్లు పెడుతోంది.

గెలిచింది ఎవరు? తగ్గింది ఎవరు?

ఇక ఇరాన్ మీడియా వెర్షన్ చూస్తే మరో లెవెల్లో ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఎంత బిల్డప్ ఇచ్చినా ఇరాన్ అస్సలు వెనక్కి తగ్గలేదని చివరకు ట్రంపే యుద్ధం కొనసాగించలేక తుపాకులు పక్కన పడేశాడని కథనాలు వండుతున్నారు. ట్రంప్ ఏమో "నేను గెలిచా" అంటుంటే ఇరాన్ ఏమో "నువ్వు కాదు.. నేనే నెగ్గా" అని కాలర్ ఎగరేస్తోంది.

పార్ట్-2 వచ్చే ఛాన్స్ ఉందా?

ప్రస్తుతానికి అయితే తుపాకుల మోత ఆగింది, థియేటర్లో సైలెన్స్ నడుస్తోంది. కానీ ఈ 24 బిలియన్ డాలర్ల ఆస్తుల వ్యవహారం తేలే వరకు అమెరికా-ఇరాన్ సంబంధాల్లో పూర్తి శాంతి నెలకొందని అనుకోవడం కాస్త తొందరపాటే అవుతుంది. పైసల విషయంలో తేడా వస్తే.. 'ముగిసిందనుకున్న' ఈ యుద్ధ కథకు త్వరలోనే 'పార్ట్-2' లేదా 'సీక్వెల్' వచ్చే అవకాశాన్ని అస్సలు కొట్టిపారేయలేం. రాసి పెట్టుకోండి... డైరెక్టర్లు ఇంకా కెమెరాలు ప్యాకప్ చెప్పలేదు..