Begin typing your search above and press return to search.

ఇప్పుడే ఎందుకు కుదిరింది? అదానీ కోసమా? అమెరికాతో డీల్ పై రాహుల్ గాంధీ ధర్మసందేహం

అమెరికా, యూఎస్ మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయి. టారిఫ్ లు 50 శాతం నుంచి 18 శాతానికి దిగొచ్చాయి.

By:  A.N.Kumar   |   3 Feb 2026 10:00 PM IST
ఇప్పుడే ఎందుకు కుదిరింది? అదానీ కోసమా? అమెరికాతో డీల్ పై రాహుల్ గాంధీ ధర్మసందేహం
X

అమెరికా, యూఎస్ మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయి. టారిఫ్ లు 50 శాతం నుంచి 18 శాతానికి దిగొచ్చాయి. కానీ ర‌ష్యా చ‌మురు కొనుగోలు అంశంలో మాత్రం స్ప‌ష్ట‌త లేదు. ర‌ష్యా చ‌మురుకు బ‌దులుగా వెనుజులా చ‌మురు విక్ర‌యిస్తామ‌ని ట్రంప్ చెబుతున్నారు. ర‌ష్యా నుంచి భార‌త్ కొనుగోలు చేయ‌ద‌ని, వెనుజులా చ‌మురు కొనుగోలు చేస్తుంద‌ని ట్రంప్ ప్ర‌క‌టించ‌డం, అదే స‌మ‌యంలో భార‌త్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న లేక‌పోవ‌డం అస్ప‌ష్ట‌త‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఇప్పుడు ర‌ష్యా కూడా స్పందించింది. చ‌మురు కొనుగోలు అంశంలో భార‌త్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేద‌ని, చ‌మురు దిగుమ‌తులు ఆపేస్తున్న‌ట్టు భార‌త్ ర‌ష్యాకు చెప్ప‌లేద‌ని ర‌ష్యా స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం గంద‌ర‌గోళానికి కార‌ణ‌మ‌వుతోంది. భార‌త్ తో ద్వైపాక్షిక సంబంధాల‌కు, వాణిజ్యానికి ప్రాధాన‌త్య ఇస్తామ‌ని ర‌ష్యా చెబుతోంది.

భార‌త్ వ్యూహమా ?

ర‌ష్యాతో భార‌త్ కు సుదీర్ఘ‌కాలం నుంచి సంబంధాలు ఉన్నాయి. వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ఉంది. చ‌మురు కొనుగోలు చాలా కాలంగా జ‌రుగుతోంది. దీనిని ర‌ద్దు చేసుకోవాల‌ని ట్రంప్ భార‌త్ పై ఒత్తిడి చేస్తున్నారు. కానీ భార‌త్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. ఇప్పుడు కూడా ర‌ష్యా చ‌మురు కాకుండా.. వెనుజులా చ‌మురు భార‌త్ కొనుగోలు చేస్తుంద‌ని ట్రంప్ చెబుతున్నారు. కానీ భార‌త్ ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం గ‌మనార్హం. రెండు దేశాల‌తో స‌మానంగా సంబంధాలు నెర‌పాల‌ని భార‌త్ యోచిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. `ర‌ష్యా చ‌మురు కొనుగోలు చేయం` అని భార‌త్ ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం వ్యూహాత్మ‌కమే అవుతుంది. అటు ర‌ష్యా, ఇటు అమెరికా ఇద్ద‌రూ అవ‌స‌ర‌మే. ఒక‌రి కోసం ఇంకొక‌రిని వ‌దులుకోవ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు. దేశ ప్ర‌యోజ‌నాలు కోసం రెండు దేశాల‌తో సంబంధాలు కొన‌సాగించాలి. అప్పుడే భార‌త్ ప్ర‌యోజ‌నాలు నెర‌వేరుతాయి. ట్రంప్ కోస‌మో.. ర‌ష్యా కోస‌మో మ‌న ప్ర‌యోజ‌నాలు ప‌ణంగా పెట్ట‌డం తెలివైన చ‌ర్య కాదు. ఇదే ఇప్పుడు భార‌త్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ట్రంప్ రియాక్ష‌న్ ఏంటి ?

భార‌త్ రెండు దేశాల‌తో త‌న ప్ర‌యోజ‌నాల నిమిత్తం సంబంధాలు కొన‌సాగిస్తే ట్రంప్ ఎలా స్పందిస్తారు అన్న‌ది కూడా ప్ర‌శ్న‌. ఎందుకంటే ట్రంప్ ర‌ష్యా చ‌మురు కొనుగోలు అంశంలో భార‌త్ మీద ఆగ్ర‌హంతో ఉన్నారు. భార‌త్ ఒక‌వేళ వెనుజులా చ‌మురు కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తే.. ర‌ష్యా చమురు కొనుగోలు చేయ‌బోమ‌ని ప్ర‌క‌టించ‌డం కాదు. వెనుజులా చ‌మురుతో పాటు ఏక కాలంలో ర‌ష్యా చ‌మురు కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక్క‌డ ధ‌ర ముఖ్య‌మైన అంశం. ర‌ష్యా చ‌మురు వెనుజులా చ‌మురు కంటే త‌క్కువ ధ‌ర‌కు, నాణ్య‌త‌తో వ‌స్తే ర‌ష్యా నుంచి కొనుగోలు చేయ‌డ‌మే భార‌త్ కు ప్ర‌యోజ‌నం. ర‌ష్యా కంటే వెనుజులా చ‌మురు త‌క్కువ‌కు, నాణ్య‌త‌తో వ‌స్తే వెనుజులా చ‌మురు కొనుగోలు చేయ‌డం ప్ర‌యోజ‌నం. వాణిజ్యంలో దేశ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధి. అంతేకానీ ట్రంప్ బెదిరించార‌నో, టారిఫ్ వేస్తార‌నో త‌మ ప్ర‌యోజ‌నాలు తాక‌ట్టు పెట్ట‌డం స‌రైన చ‌ర్య కాదు. ర‌ష్యాతో డీల్ కొన‌సాగిస్తే.. ట్రంప్ మ‌ళ్లీ టారిఫ్ ప్ర‌క‌టించే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు. అయితే.. ఇక్క‌డ కొంత మిన‌హాయింపు ఉంది. భార‌త్ తో టారిఫ్ వార్ కొన‌సాగిస్తే.. అది అమెరికాకు ఇబ్బంది అయిన‌ప్పుడు ట్రంప్ ఇరుదేశాల ప్ర‌యోజ‌నాల నేప‌థ్యంలో త‌గ్గొచ్చ‌న్న‌ది నిపుణుల వాద‌న‌.

అదానీ కోస‌మేనా ?

అదానీపై అమెరికాలో ఉన్న కేసు కోస‌మే యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కుదిరింద‌ని రాహుల్ వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిక‌రం. ఇన్నాళ్లుగా నాన్చుతూ.. ఇప్పుడు అనూహ్యంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక ఉన్న అంతరార్థం ఇదేన‌ని చెబుతున్నారు. అదానీ కోసం దేశ‌, రైతుల ప్ర‌యోజ‌నాలు తాక‌ట్టు పెట్టార‌ని మాట్లాడటం చ‌ర్చ‌నీయాంశం. ఈ అంశాన్ని కూడా లోతుగా ప‌రిశీలించాల్సి ఉంటుంది. అమెరికా ఉత్ప‌త్తుల‌ను మ‌న దేశంలోకి ఆహ్వానించ‌డం ద్వారా జ‌రిగే న‌ష్టం, మ‌న ఎగుమ‌తులు అమెరికా వెళ్ల‌డం ద్వారా వ‌చ్చే లాభం.. ఈ రెండింటిని అంచ‌నా వేస్తే భార‌త్ కు ఒన‌గూరే లాభం ఏంటో అర్థ‌మ‌వుతుంది. ఇందులో భార‌త్ కు లాభం లేక‌పోతే మాత్రం రాహుల్ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం ఉండే అవ‌కాశం ఉంటుంది. అలా కాకుండా లాభం ఉంటే ఆరోప‌ణ‌లు రాజ‌కీయ‌మే అవుతాయి.