Begin typing your search above and press return to search.

చమురు కొనుగోలు తప్పే అయితే.. యుద్ధ సామాగ్రి అమ్మేటోళ్ల సంగతేంటి ట్రంప్?

సుంకాలు మొదలు రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ఉక్రెయిన్ యుద్దానికి వాడుతున్నట్లుగా ప్రచారం మొదలు పెట్టింది.

By:  Garuda Media   |   25 Sept 2025 10:00 PM IST
చమురు కొనుగోలు తప్పే అయితే.. యుద్ధ సామాగ్రి అమ్మేటోళ్ల సంగతేంటి ట్రంప్?
X

ఒక కుక్కను చంపాలనుకున్నప్పుడు.. తెలివైనోడు చేసే పని ముందు ఆ కుక్క ప్రవర్తన సరిగా లేదని ప్రచారం చేయటం.. దాన్ని పిచ్చిదన్న ముద్ర వేయటం.. ఆ తర్వాత అంతటి ప్రమాదకరమైన కుక్కను బతికి ఉంచితే అందరికి ముప్పు అని తీర్మానం చేయించి..అందరి చేత చంపించే దుర్మార్గమైన తెలివి కొందరికి ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు అలాంటి పాడుబుద్ధినే ప్రదర్శిస్తోంది. డైరీ ఉత్పత్తులతో పాటు..మరికొన్ని వ్యాపార అంశాలకు సంబంధించి తాము కోరుకున్న విధంగా భారత మార్కెట్ల తలుపుల్ని అమెరికాకు అనుగుణంగా తెరిచి ఉంచాలన్న మాటను కాదన్నప్పటి నుంచి ట్రంప్ తీరులో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

సుంకాలు మొదలు రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ఉక్రెయిన్ యుద్దానికి వాడుతున్నట్లుగా ప్రచారం మొదలు పెట్టింది. ఎవరు ఎందుకు యుద్ధం చేస్తారన్నది వారిష్టం. ఒకదేశం చెప్పిందనో.. ఒక దేశం తమ వద్ద వస్తువుల్ని భారీగా కొనుగోలు చేస్తుందన్న ఉద్దేశంతో ఉత్త పుణ్యానికి యుద్ధం చేయటమన్నది ఉండదు కదా? ఆ చిన్న విషయం అమెరికాఅధ్యక్షుడికి తెలియంది కాదు కదా? తాను కోరిన విధంగా భారత సర్కారు వ్యాపార అవకాశాల్ని మూత వేయటం.. ట్రంప్ తానా అంటే తందానా అనేందుకు తాము సిద్ధంగా లేమన్న విషయాన్ని ఢిల్లీ స్పష్టం చేసిన వేళ నుంచి.. ట్రంప్ అండ్ కోలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

అప్పటి నుంచి ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకురావటం.. భారత ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా వ్యవహరించే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్సు మొదలు ఐక్యరాజ్య సమితి సమావేశంలోనూ భారత్ ను ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయటం ఎక్కువైంది. అధ్యక్షుడు ట్రంప్ మొదలు ఆయన ప్రభుత్వంలో భాగస్వామ్యమైన నేతలు పలువురు అదే పనిగా భారత్ మీద విషం చిమ్మటం ఒక అలవాటుగా మారింది.

రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి భారత్ కొంటున్న చమురే కారణమని చెబుతూ.. రష్యా ఆర్థికస్థితి భారత్ వల్లే మెరుగు అవుతుందన్న మాటను తరచూ చెబుతున్నారు. ఇలాంటి వేళ.. రష్యా దగ్గర అత్యధికంగా చమురు కొనుగోలు చేసే దేశాల్లో మొదటి స్థానం చైనాది. ఆ తర్వాతే భారత్ ది. జాగ్రత్తగా పరిశీలిస్తే చైనాతో పోలిస్తే భారత్ ను లక్ష్యంగా చేసుకోవటం కనిపిస్తుంది. చమురు కొనుగోలు చేయటమే ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేయటానికి కారణమనే అనుకుంటే.. మరి రష్యాకు ఆయుధాలు.. ఆయుధ పరికరాలు.. ముందుగుండు సామాగ్రి అమ్మేటోళ్ల సంగతేంటి? అన్నది ప్రశ్న. దీని గురించి ఏ ఒక్కరు ఎందుకు మాట్లాడరన్నది అసలు ప్రశ్న.

ఇక్కడే మరిన్ని సందేహాలు వ్యక్తమవుతాయి. అందులో ముఖ్యమైనది.. ఆర్థిక బలం ఉండగానే ఆయుధాలు సమకూరవు కదా? ఆర్థిక బలంతో ప్రజల సంక్షేమం కూడా ప్రభుత్వాల బాధ్యతే కదా? అలాంటప్పుడు భారత్ కొనుగోలు చేస్తున్న చమురుతో వచ్చే ఆదాయంతో రష్యా తన ప్రజల సంక్షేమానికి వినియోగించలేదని ఎలా చెప్పగలుతుతారు? అదే సమయంలో డబ్బులు చేతిలో ఉన్నంత మాత్రాన ఆయుధాలు.. మందుగుండు సమకూరవు కదా? ఇన్నేళ్లుగా రష్యా చేస్తున్న యుద్ధానికి అవసరమైన యుద్ధ సామాగ్రిని ఎవరు అందిస్తున్నారు? మరి.. ఆ వ్యాపారం మీదా.. ఆ వ్యాపారం చేసే దేశాల మీద ట్రంప్ ఎందుకు మాట్లాడరు?

ఈ ప్రశ్నలకు తగిన సమాధానాలు వెతుకుతూ అంతర్జాతీయ కథనాలు.. నివేదికల్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. యుద్ధానికి అవసరమైన మందుగుండు కావొచ్చు.. ఆయుధ విడి భాగాలు కావొచ్చు.. అందుకు అవసరమైన రసాయనాల.. యుద్ధ సామాగ్రి.. వాటి విడిభాగాలు అన్నీ కూడా పలు దేశాల నుంచి రష్యాకు వస్తున్న విషయాన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. రష్యా తన ఆయుధ కొనుగోళ్లు.. మిలిటరీ ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలను బయటకు వెల్లడించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. దీంతో అధికారిక సమాచారం అంతర్జాతీయంగా లభించదు.

అయితే.. అగ్రరాజ్యం తలచుకుంటే ఇలాంటి సమాచారం టన్నుల కొద్దీ ఇట్టే దొరికేస్తాయి. అంతర్జాతీయ నివేదికల్ని చూసినప్పుడు రష్యాకు యుద్ధ సామాగ్రి.. యుద్ధానికి అవసరమైన పరికరాలు.. డ్రోన్లు, విడి భాగాల్ని అందించే దేశాల్లో ఉత్తర కొరియా.. చైనా.. తుర్కీ (టర్కీ)తో యూఏఈ దేశాలు కూడా సాయం చేస్తుంటాయి. చైనానుంచి మెషిన్ టూల్స్.. అధునాతన యంత్ర భాగాలు రష్యాకు సరఫరా చేస్తాయన్నది బహిరంగ రహస్యం.

యుద్ధానికి అవసరమైన మందుగుండు సామాగ్రి తయారీలో కీలకంగా వ్యవహరించే నెట్రోసెల్యూలోజ్, క్రోమీయం, కాటన్ సెల్యులోజ్ లాంటి పదార్థాలు రష్యాకు ఎక్కడి నుంచి అందుతున్నాయన్నప్పుడు కజాకిస్తాన్, ఉజ్ బెకిస్తాన్, టర్కీ దేశాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. రష్యాకు ఆయుధ భాగాలు పంపిస్తున్న దేశాల్లో చైనాతో పాటు యూఏఈ (యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్) కూడా ఉందన్న విషయాన్ని యూరోపియన్ యూనియన్ గుర్తించినట్లుగా రిపోర్టులు చెబుతున్నాయి. మరి.. ఇలాంటి విషయాలపై ట్రంప్ ఎందుకు మాట్లాడరు? భారత్ మీద అదే పనిగా విరుచుకుపడే అమెరికాకు యుద్ధం కొనసాగింపునకు అవసరమైన వస్తువుల్ని ఎందుకు ఆపలేకపోతోంది? అన్న ప్రశ్నకు సమాధానం కనిపించదు. ఇదంతా చూసినప్పుడు మనసులో ఏదో పెట్టుకొని.. రష్యా దగ్గర ముడి చమురు కొనుగోలు చేసిన అంశాన్ని అదే పనిగా ప్రస్తావిస్తూ అంతర్జాతీయంగా భారత ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నట్లుగా చెప్పక తప్పదు.