Begin typing your search above and press return to search.

చైనా, పాక్‌లకు చెక్: భారత్‌కు $482 మిలియన్ల భారీ సైనిక ప్యాకేజీని ప్రకటించిన అమెరికా

భారత్ సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ దేశాల నుంచి పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ఉద్రిక్తతల మధ్య అమెరికా ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.

By:  A.N.Kumar   |   22 Jun 2026 1:28 PM IST
చైనా, పాక్‌లకు చెక్: భారత్‌కు $482 మిలియన్ల భారీ సైనిక ప్యాకేజీని ప్రకటించిన అమెరికా
X

భారత్ సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ దేశాల నుంచి పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ఉద్రిక్తతల మధ్య అమెరికా ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారీ సైనిక సహాయ ప్యాకేజీకి అమెరికా ఆమోదం తెలిపింది. భారత సైన్యం ప్రస్తుతం వినియోగిస్తున్న అత్యాధునిక ఏహెచ్-64ఈ అపాచీ అటాక్ హెలికాప్టర్లు.. అలాగే ఎం777ఏ2 అల్ట్రా-లైట్ హోవిట్జర్ ఫిరంగుల నిర్వహణ, విడిభాగాలు, సాంకేతిక మద్దతు మరియు శిక్షణ కోసం సుమారు 482.2 మిలియన్ డాలర్లు (రూ. 4,000 కోట్లకు పైగా) విలువైన ప్యాకేజీని ప్రకటించింది. మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఈ నిర్ణయం మైలురాయిగా నిలవనుంది.

హిమాలయ సరిహద్దుల్లో 'హోవిట్జర్' బలానికి మరింత ఊతం

ఈ తాజా ప్యాకేజీలో అత్యధిక ప్రాధాన్యతను హిమాలయ పర్వత ప్రాంతాల్లో ముఖ్యంగా తూర్పు లడఖ్ వంటి చైనా సరిహద్దుల్లో మోహరించిన ఎం777 అల్ట్రా-లైట్ హోవిట్జర్ ఫిరంగులకు కల్పించారు. దీనికోసం దాదాపు 230 మిలియన్ డాలర్లను కేటాయించారు. ఈ ఫిరంగులు బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల హెలికాప్టర్ల ద్వారా ఎత్తైన కొండ ప్రాంతాలకు సైతం వీటిని వేగంగా తరలించవచ్చు. ఈ నిధులతో ఫిరంగుల విడిభాగాలు, మరమ్మతులు, సాంకేతిక సేవలతో పాటు భారత సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ బీఏఈ సిస్టం ఈ నిర్వహణ బాధ్యతల్లో కీలక భాగస్వామిగా వ్యవహరించనుంది.

నిరంతర యుద్ధ సన్నద్ధతలో 'అపాచీ' దళాలు

ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన, శక్తివంతమైన అటాక్ హెలికాప్టర్లుగా పేరుగాంచిన ఏహెచ్ -64ఈ అపాచీ హెలికాప్టర్ల నిర్వహణ కోసం అమెరికా 198.2 మిలియన్ డాలర్ల మద్దతును ప్రకటించింది. గ్లోబల్ డిఫెన్స్ దిగ్గజాలైన బోయింగ్, లాక్ హీడ్ మార్టిన్ సంస్థలు ఈ హెలికాప్టర్లకు అవసరమైన ఇంజినీరింగ్ సేవలు, లాజిస్టిక్స్ , స్పేర్ పార్ట్స్‌ను సరఫరా చేయనున్నాయి. దీనివల్ల భారత వైమానిక, భూతల రక్షణ దళాల్లోని అపాచీ హెలికాప్టర్లు ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా 24/7 పూర్తిస్థాయి యుద్ధ సన్నద్ధతతో ఉండేందుకు వీలవుతుంది.

వ్యూహాత్మక ప్రాధాన్యత, అంతర్జాతీయ విశ్లేషణ

అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనను అక్కడి కాంగ్రెస్ ఆమోదానికి పంపగా దానికి సంబంధించిన అధికారిక ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈ ఒప్పందంపై అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ స్పందిస్తూ.. ఈ ప్యాకేజీ వల్ల ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలు మెరుగవుతాయని, దీనివల్ల ప్రాంతీయ సైనిక సమతుల్యత ఏమాత్రం దెబ్బతినదని స్పష్టం చేసింది. "ఇది సరికొత్త ఆయుధాల కొనుగోలు ఒప్పందం కానప్పటికీ వ్యూహాత్మకంగా అంతే ప్రాధాన్యత కలిగినది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు అత్యుత్తమ సామర్థ్యంతో ఉంచేందుకు ఈ మెయింటెనెన్స్ ప్యాకేజీ ఎంతో అవసరం." అని ప్రకటించింది.

చైనా సరిహద్దుల్లో అత్యంత వేగంగా సైన్యాన్ని, ఆయుధాలను మోహరించడానికి , పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి తలెత్తే ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా తక్షణమే తిప్పికొట్టడానికి ఈ ప్యాకేజీ భారత సైన్యానికి కొండంత అండగా నిలవనుంది. అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం భారత్‌కు రక్షణపరంగా సరికొత్త బూస్ట్‌ను ఇవ్వడమే కాకుండా ఇరుదేశాల మధ్య పెరుగుతున్న సైనిక బంధానికి నిదర్శనంగా నిలిచింది.