గ్రీన్ కార్డుల జారీ వేగవంతం చేయండి.. ట్రంప్ సర్కారుకు 63 మంది అమెరికా చట్టసభ సభ్యుల విజ్ఞప్తి
అమెరికాలో చట్టబద్ధంగా నివాసముంటున్న వలసదారులకు ప్రభుత్వ ఆరోగ్య బీమా సదుపాయం దూరమయ్యే ప్రమాదం ఏర్పడటంతో 63 మంది అమెరికా చట్టసభ సభ్యులు స్పందించారు.
By: A.N.Kumar | 20 Oct 2026 5:35 PM ISTఅమెరికాలో చట్టబద్ధంగా నివాసముంటున్న వలసదారులకు ప్రభుత్వ ఆరోగ్య బీమా సదుపాయం దూరమయ్యే ప్రమాదం ఏర్పడటంతో 63 మంది అమెరికా చట్టసభ సభ్యులు స్పందించారు. పెండింగ్లో ఉన్న గ్రీన్ కార్డు (ఫామ్ ఐ-485) దరఖాస్తులను అత్యవసర ప్రాతిపదికన వేగవంతంగా పరిష్కరించాలని కోరుతూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి, అమెరికా పౌరసత్వ-వలస సేవల విభాగం (యూఎస్.సీఐఎస్) డైరెక్టర్ జోసెఫ్ బి. ఎడ్లోకు లేఖ రాశారు. న్యూయార్క్ కాంగ్రెస్ సభ్యురాలు యెవెట్ డి. క్లార్క్, అరిజోనా సభ్యురాలు అడెలిటా ఎస్. గ్రిజాల్వాల నాయకత్వంలో రూపొందిన ఈ విజ్ఞప్తికి రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, శ్రీ తనేదార్ సహా పలువురు భారత సంతతి ప్రతినిధులు కూడా మద్దతు తెలిపారు.
ఆరోగ్య బీమా రద్దు భయాలు.. ప్రమాదంలో రోగుల ప్రాణాలు
అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ కొత్త నిబంధనల వల్ల మెడికెయిడ్, మెడికేర్, చిప్, అఫర్డబుల్ కేర్ యాక్ట్ పన్ను రాయితీలపై తీవ్ర ప్రభావం పడింది. చట్టబద్ధంగా ఉంటూ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న శరణార్థులు, ఆశ్రయం పొందినవారు, బాధితులు నిబంధనల మార్పులతో హెల్త్ కవరేజీని కోల్పోతున్నారు.
ముఖ్యంగా అరిజోనాకు చెందిన నాలుగో దశ బ్రెస్ట్ క్యాన్సర్ బాధితురాలు కీమోథెరపీ పొందుతుండగా ఆమెకు మెడికెయిడ్ కవరేజీ నిలిచిపోయింది. అలాగే మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఒక తొమ్మిదేళ్ల బాలుడి వైద్యం కూడా ప్రశ్నార్థకమైంది. కేవలం అరిజోనాలోనే 20 వేల మంది, తొమ్మిది రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ పరిధిలో సుమారు 2.81 లక్షల మంది వలసదారులు హెల్త్ ఇన్సూరెన్స్ కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. నిరంతర వైద్య చికిత్సలు నిలిచిపోవడం వల్ల రోగుల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
యూఎస్.సీఐఎస్ ముందు ఎంపీలు ఉంచిన 3 కీలక డిమాండ్లు
అత్యవసర ప్రాసెసింగ్ చేయాలని కోరారు. ఆరోగ్య బీమా కవరేజీ ముగిసిపోయే ప్రమాదం ఉన్న దరఖాస్తుదారుల ఫామ్ ఐ-485 కోసం ప్రత్యేక అత్యవసర ప్రాసెసింగ్ విధానాన్ని తక్షణమే ప్రారంభించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేగవంతమైన దరఖాస్తు పరిష్కార ప్రమాణాలపై తగిన స్పష్టతనివ్వాలి. మెడికేర్, మెడికెయిడ్ సేవల కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి బీమా నిలిపివేతను వాయిదా వేసే మార్గదర్శకాలను రూపొందించాలి.
ప్రస్తుతానికి చట్టసభ సభ్యులు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి మాత్రమే చేశారు. దీనిపై యూఎస్.సీఐఎస్ ఇంకా ఎటువంటి అధికారిక ఆమోదం తెలపలేదు. గ్రీన్ కార్డు దరఖాస్తు పెండింగ్లో ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా వర్తిస్తుందని భావించలేము. అందుకే అమెరికాలోని భారతీయ వలసదారులు తమ అర్హతలు, కేటగిరీలను పునఃసమీక్షించుకుంటూ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో అధికారిక ప్రకటనలను నిశితంగా గమనించడం శ్రేయస్కరం.
