Begin typing your search above and press return to search.

చీప్ గా అమ్మేస్తున్నారు.. అమెరికాలో ఇళ్లు కొనేవారే లేరు.. ఎందుకీ దుస్థితి..

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే క్రమంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 5.5 శాతం వరకు పెంచడం రియల్ ఎస్టేట్ రంగానికి శరాఘాతంగా మారింది.

By:  A.N.Kumar   |   14 May 2026 10:12 AM IST
చీప్ గా అమ్మేస్తున్నారు.. అమెరికాలో ఇళ్లు కొనేవారే లేరు.. ఎందుకీ దుస్థితి..
X

అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక మేఘాలు కమ్ముకుంటున్నాయి. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికన్ల జీవన ప్రమాణాలు కఠిన సవాలును ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వాణిజ్య విధానాలు.. ఇతర దేశాలపై విధిస్తున్న భారీ ప్రతీకార సుంకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వెరసి అమెరికా ఆర్థిక వ్యవస్థను అస్థిరత వైపు నెట్టేస్తున్నాయి. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

కరోనా బూమ్ నుండి నేటి పతనం వరకు..

2020 నుంచి 2022 మధ్య కాలంలో అమెరికా ఇళ్ల మార్కెట్ ఊహించని రీతిలో వృద్ధి చెందింది. తక్కువ వడ్డీ రేట్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటుతో ప్రజలు నగరాల నుండి శివార్లకు తరలివెళ్లడం వల్ల ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ సమయంలో ఇళ్ల ధరలు దాదాపు 40 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా ఫ్లోరిడాలోని మయామి వంటి ప్రాంతాల్లో ధరలు రెట్టింపు అయ్యాయి. అయితే ఆ 'బూమ్' ఇప్పుడు ఒక బుడగ లాగా పేలిపోయే దశకు చేరుకుంది.

వడ్డీ రేట్ల సెగ.. భారంగా మారిన ఈఎంఐలు

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే క్రమంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 5.5 శాతం వరకు పెంచడం రియల్ ఎస్టేట్ రంగానికి శరాఘాతంగా మారింది. దీనివల్ల 30 ఏళ్ల మార్ట్‌గేజ్ వడ్డీ రేట్లు 7.5 శాతానికి చేరాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజల నెలవారీ ఈఎంఐలు రెట్టింపు అయ్యాయి. కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారి సంఖ్య 25 శాతం పడిపోయింది. టెక్సాస్, ఫోనిక్స్, ఫ్లోరిడా వంటి ప్రధాన మార్కెట్లలో డిమాండ్ 40 శాతం మేర క్షీణించింది.

పెరుగుతున్న ఇన్వెంటరీ.. 2008 నాటి పరిస్థితులు పునరావృతమా?

ప్రస్తుతం అమెరికా మార్కెట్లో 6.2 లక్షలకు పైగా ఇళ్లు కొనుగోలుదారులు లేక అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంత భారీ స్థాయిలో ఇళ్లు నిలిచిపోవడం ఇదే మొదటిసారి. సాధారణంగా మార్కెట్లో 3 నెలల సరఫరా ఉండటం ఆరోగ్యకరమైన సంకేతం.. కానీ ప్రస్తుతం అది 9 నెలల స్థాయికి చేరుకోవడం గమనార్హం. అంటే ఇళ్లు ఉన్నాయి కానీ కొనే శక్తి ప్రజల వద్ద లేదు. "లాక్-ఇన్ ఎఫెక్ట్" కారణంగా గతంలో తక్కువ వడ్డీ రేట్లకు ఇళ్లు కొన్నవారు వాటిని అమ్మడానికి ఇష్టపడటం లేదు. మరోవైపు, కొత్త ధరలు, వడ్డీ రేట్లు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. ఈ ప్రతిష్టంభన వల్ల రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ఆదాయం 20 శాతం తగ్గిపోయింది.

ట్రంప్ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి

ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చిన ట్రంప్.. ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలతో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వస్తువుల ధరలు పెరగడం, నిర్మాణ వ్యయం భారమవ్వడం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల హౌసింగ్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆశలన్నీ 2026 పైనే!

ఆర్థికవేత్తల అంచనా ప్రకారం.. ఫెడరల్ రిజర్వ్ 2026 చివరి నాటికి వడ్డీ రేట్లను 4 శాతానికి తగ్గిస్తే తప్ప ఈ రంగం కోలుకోవడం కష్టం. ఒకవేళ ఇళ్ల ధరలు అమాంతం పడిపోతే అది బ్యాంకింగ్ రంగంపై కూడా ప్రభావం చూపి, 2008 తరహాలో మరో భారీ ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశం ఉంది. అమెరికా రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఒక విషమ పరీక్షను ఎదుర్కొంటోంది. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచ మార్కెట్లను కూడా వణికించేలా కనిపిస్తోంది.