Begin typing your search above and press return to search.

సర్వే రిపోర్టు: యూఎస్ లో విద్యాధికులు హిందువులు.. యూదులు 2 ప్లేస్

జాతీయ సరాసరి కంటే ఎక్కువ మంది ముస్లింలు.. బౌద్ధులు.. సనాతన క్రైస్తవులు.. సాధారణ ప్రొటెస్టెంట్ క్త్రైస్తవులు గ్రాడ్యుయేట్స్ గా సర్వేలో తేలింది.

By:  Garuda Media   |   22 Feb 2026 11:42 AM IST
సర్వే రిపోర్టు: యూఎస్ లో విద్యాధికులు హిందువులు.. యూదులు 2 ప్లేస్
X

ఆసక్తికర రిపోర్టు ఒకటి వెలుగు చూసింది. అగ్రరాజ్యం అమెరికాలో విద్యాధికులు ఏ వర్గానికి చెందిన వారన్న దానిపై సర్వే నిర్వహించగా.. ఊహించని ఫలితాలు వెల్లడైనట్లు చెబుతున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ రిలీజ్ చేసిన ఈ సర్వే రిపోర్టులో హిందువులు అత్యధిక విద్యాధికులుగా తేల్చారు. వీరి తర్వాత యూదులు ఉన్నట్లుగా తేల్చారు. అమెరికాలోని వివిధ మతాలకు చెందిన వారి స్థితిగతులపై 2023-24లో ఒక సర్వేను నిర్వహించి రిపోర్టు సిద్దం చేశారు. అందులో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

రిలిజియస్ ల్యాండ్ స్కేప్ సమగ్ర సర్వే (సింఫుల్ గా చెప్పాలంటే ఆర్ఎల్ఎస్) పేరుతో నిర్వహించిన సర్వేలో అమెరికాలో నివసిస్తున్న ప్రతి పది మంది హిందువుల్లో ఏడుగురు అంటే 70 శాతం మంది పట్టభద్రులు కాగా.. యూదుల్లో 65 శాతం మందికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే.. అమెరికాలోని మొత్తం జనాభాలో పట్టభద్రుల సరాసరి కేవలం 35 శాతం మాత్రమే.

జాతీయ సరాసరి కంటే ఎక్కువ మంది ముస్లింలు.. బౌద్ధులు.. సనాతన క్రైస్తవులు.. సాధారణ ప్రొటెస్టెంట్ క్త్రైస్తవులు గ్రాడ్యుయేట్స్ గా సర్వేలో తేలింది. అదే సమయంలో క్రైస్తవుల్లో కొన్ని వర్గాలుగా చెప్పే ఇవాంజెలికల్ ప్రొటెస్టెంట్లు.. కేథలిక్కులు మాత్రం జాతీయ సరాసరి కంటే తక్కువ సంఖ్యలో ఉన్నట్లుగా గుర్తించారు. దీని వెనుక ఉన్న కారణాల్ని పరిశీలించగా ఉన్నత విద్యాభ్యాసం కోసమే అమెరికాకు వస్తున్నందున బాగా చదువుకున్న వారిలో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

సర్వేలో భాగంగా 2023-24లో 36,908 మందిని ప్రశ్నించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇదిలా ఉండగా అమెరికా జనాభాలో హిందువుల శాతం ఎంత? అన్నది చూస్తే మరింత ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈసర్వే నిర్వహించిన ప్యూ రీసెర్చ్ సెంటర్ రిపోర్టు ప్రకారం అమెరికాలోని మొత్తం యువజన జనాభాలో హిందువులు ఒక శాతంగా గుర్తించారు. ప్రతి వంద మంది అమెరికన్లలో ఒకరు హిందువులుగా తేల్చారు. 2007లో అమెరికా జనాభాలో హిందువులు 0.4 శాతం అయితే.. ఆరేళ్ల వ్యవధిలో అది కాస్తా ఒక శాతానికి మారింది.

ఇక.. అమెరికా జనాభాలో యూదుల 2 శాతంగా గుర్తించారు. అమెరికాలో యూదుల జనాభా సుమారు 75 లక్షలుగా ఉంటారని అంచనా వేశారు. అమెరికా జనాభాలో క్రైస్తవులు 62 శాతం కాగా.. మతం లేని వారు 29 శాతంగా చెబుతున్నారు. అమెరికాలో క్రైస్తవం తర్వాత అతి పెద్ద మత సమూహాల్లో యూదులు మొదటి స్థానంలో ఉండగా.. హిందువులు.. ముస్లింలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తక్కువ జనాభాగా ఉన్నప్పటికీ విద్య.. ఆర్థిక రంగాల్లో హిందువులు.. యూదులు అత్యున్నత స్థానాల్లో ఉండటం గమనార్హం.

యూఎస్ లో అత్యధిక ఆదాయం ఉన్న వర్గాల్లో హిందువులు.. యూదులు నిలిచారు. దాదాపు 50 శాతం కంటే ఎక్కువగా హిందువులు.. యూదు కుటుంబాల వార్షిక ఆదాయం రూ.83 లక్షలకు పైనే (ఇప్పుడున్న డాలర్ మారకం విలువతో చూస్తే రూ.92 లక్షలుగా చెప్పొచ్చు) ఉంటుందని లెక్క కట్టారు. అదే సమయంలో జాతీయ సగటున కేవలం 19 శాతం నుంచి 30 శాతం మంది అమెరికన్లు మాత్రమే ఈ స్థాయిలో సంపాదిస్తున్నట్లుగా తేల్చారు. అంతేకాదు అమెరికాలో అత్యంత యువ మత సమూహాల్లో హిందువులు ఒకరుగా తేల్చారు. వీరిలో దాదాపు 73 శాతం మంది 18 నుంచి 49 ఏళ్ల లోపు వయసు వారే కావటం గమనార్హం.