Begin typing your search above and press return to search.

మంచుతుపాను వేళ అమెరికాలో బతుకు.. నరకానికి నకలు!

అగ్రరాజ్యమనే అహంకారంతో తాను ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించే రాజ్యానికి ఎదురే లేదా? దాన్ని కట్టడి చేసే వారే లేరా? అన్న ప్రశ్నలు పలువురి మదిలో మెదులుతూ ఉంటాయి.

By:  Garuda Media   |   28 Jan 2026 12:07 PM IST
మంచుతుపాను వేళ అమెరికాలో బతుకు.. నరకానికి నకలు!
X

అగ్రరాజ్యమనే అహంకారంతో తాను ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించే రాజ్యానికి ఎదురే లేదా? దాన్ని కట్టడి చేసే వారే లేరా? అన్న ప్రశ్నలు పలువురి మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే.. తిరుగులేని అధికారం.. అంతకు మించిన శక్తి సామర్థ్యాలు ఉన్న వారిని ఎవరూ ఏమీ చేయలేకున్నా.. ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. ఈ భూమి మీద ఎవరూ తనకు మించినోళ్లు కాదన్న విషయాన్ని ప్రకృతి అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. తాజాగా అమెరికా విషయంలోనూ అదే జరిగిందా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.

ఒకరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయొచ్చా? అంటే.. తన స్వార్థం.. తాను సంపన్నం కావటానికి ప్రపంచంలోని ఏ దేశ ప్రయోజనాల్ని అయినా తాకట్టు పెట్టేందుకు వెనుకాడని తత్త్వం అగ్రరాజ్యం అణువణువునా ఉంటుంది. అలాంటి వేళలో.. నిజాన్ని నిజంగా మాట్లాడుకోవటంలో తప్పు లేదన్నది ఒక వాదన. అమెరికాలోని దక్షిణ.. ఈశాన్య ప్రాంతాల్లోని రాష్ట్రాల్ని అతలాకుతలం చేసిన మంచు తుపాను ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తోంది.

ఈ మంచు తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని కొన్ని అంశాల్లో చెప్పాల్సి వస్తే.. మంగళవారం నాటికి 8 లక్షల మందికి విద్యుత్ సరఫరా అందటం లేదు. తాజాగా (మన కాలమానం ప్రకారం బుధవారం) అయితే ఇది 5.5 లక్షల మందిగా ఉన్నట్లు చెబుతున్నారు. అమెరికాలో కరెంటు లేకపోవటానికి మించిన నరకం మరొకటి ఉండదు. మనకు మాదిరి కరెంట్ పోవటం అంటే పరిసరాలు చీకటితో నిండిపోవటమే కాదు.. జీవనం దుర్బరంగా మారుతుంది. అమెరికాలో కరెంటు లేకుండా నిమిషం గడవదు. వారి జీవితంలో విద్యుత్ అన్నది ఒక భాగం. ప్రతిది కరెంట్ మీద ఆధారపడి నడిచే బతుకులు.

అమెరికా శీతల దేశం కావటం.. మంచు తుపాను వేళ అమెరికాలో దీని ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మైనస్ 10 డిగ్రీల నుంచి మైనస్ 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇది మైనస్ 40 నుంచి మైనస్ 50 డిగ్రీల ఫారిన్ హీట్ గా ఉన్నట్లు ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఈ స్థాయిలో చలి ఉంటే బయట ఉన్న వ్యక్తి చర్మం కేవలం 10 నిమిషాల్లోనే గడ్డకట్టి పోయే ప్రమాదం పొంచి ఉంటుంది.

చికాగో రాష్ట్రంలో మైనస్ 15 డిగ్రీలు నమోదు కాగా.. గాలితో కలిపి మైనస్ 35 డిగ్రీల వరకు ఉన్న పరిస్థితి. అదే ఉత్తర డకోటా.. మిన్నెసోటా లాంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠంగా మైనస్ 40 డిగ్రీలు నమోదైన పరిస్థితి. ఉష్ణోగ్రత 32 డిగ్రీల ఫారిన్ హీట్ ఉంటే నీరు గడ్డకట్టటం మొదలవుతుంది. ప్రస్తుతం అమెరికాలోని మంచు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దీని కంటే తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా శరీరం గడ్డకట్టి మొద్దు బారిపోవటం.. శరీర ఉష్ణోగ్రత పడిపోయి ప్రాణాపాయం కలగటం లాంటి ప్రమాదం పొంచి ఉంటుంది. వాతావరణశాఖ తాజా అంచనాల ప్రకారం ఈ తీవ్రమైన చలి జనవరి 31 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు

అమెరికాలో విద్యుత్ సరఫరా ఆగిపోతే.. మెజార్టీ ఇళ్లలో ఎలక్ట్రిక్ హీటింగ్ వ్యవస్థలు పని చేయవు. అదే జరిగితే.. చలితో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. వయసులో ఉన్న వారి పరిస్థితి కొంత వరకు తట్టుకోగలరు. కానీ.. పెద్ద వయస్కులు.. చిన్నపిల్లలు.. వ్యాధులతో సతమతమయ్యే వారికి నరకంలో ఉన్నట్లుగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పడిపోయి మరణించే అవకాశం ఉంది.

ఇంట్లో వేడి లేని కారణంగా వాటర్ పైపుల్లో నీరు గడ్డకట్టి.. అవి కాస్తా వ్యాకోచించి పైపులు పగిలిపోయే పరిస్థితి. దీంతో కరెంటు వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం నీటితో నిండిపోయి వేల డాలర్ల ఆస్తినష్టం జరుగుతుంది.కరెంటు లేకపోతే నీటి పంపింగ్ వ్యవస్థలు పని చేయవు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు ఆగిపోతాయి. ఇళ్లు మంచు కారణంగా చలి తీవ్రతను తగ్గించుకునేందుకు వేడి కోసం కార్ గ్యారేజీల్లో కార్లు ఆన్ చేస్తారు. ఇళ్లల్లో బొగ్గు పొయ్యిలు.. జనరేటర్లు వాడతారు. దీని కారణంగా వెలువడే కార్బన్ మోనాక్సైడ్ గాలిని పీల్చి చాలామంది నిద్రలో మరణించే ప్రమాదం పొంచి ఉంది.

కరెంటు లేని కారణంగా ఫోన్ ఛార్జింగ్ లేకపోవటం.. ఇంటర్నెట్ వైఫై పని చేయని కారణంగా వాతావరణ హెచ్చరికల్ని అందుకోలేరు. తమ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. చివరకు అత్యవసర సేవలకు కాల్ చేయటం కూడా కష్టమవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తీవ్రమైన మంచు కారణంగా బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. మనకు మాదిరి దగ్గరదగ్గరగా నివాసాలు ఉండని కారణంగా.. ఏదైనా సాయం కోసం ఇతరులను అడగటం అంత తేలిక కాదు. అలా అడిగిన సాయం చేసేందుకు స్పందించే తీరు తక్కువే.

తాజామంచు తుపాను కారణంగా అమెరికాకు జరిగిన ఆర్థిక నష్టం అక్షరాల రూ.8.7 లక్షల కోట్ల నుంచి రూ.9.5లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీని కారణంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి రేటు 0.5 శాతం నుంచి 1.5 శాతం వరకు తగ్గే వీలుంది. జనజీవనం ఎంతలా స్తంభించిందంటే.. శనివారం నుంచి ఇప్పటివరకు మొత్తం 24,500పైగా విమాన సర్వీసులు రద్దుఅయ్యాయి. ఇప్పుడిప్పుడే విమాన రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు చెబుతున్నారు. బోస్టన్.. న్యూయార్క్ లో పరిస్థితి ఇప్పటికి సాధారణ స్థితిలోకి రాలేదు. ఈ మంచు తుపాను కారణంగా మరణాలు 38 వరకు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

న్యూమెక్సికోలోని బోనిటో ఫాల్స్ వద్ద అత్యధికంగా 31 అంగుళాల మంచు కురిసింది. అదే విధంగా న్యూయార్క్ లోని అప్ స్టేట్ ప్రాంతంలో 30 అంగుళాలు.. బోస్టన్ లో 23 అంగుళాల మంచు నమోదైంది. ఇలాంటి వేళలో బతుకు ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జనవరి 31న తూర్పు తీరంలో మరో మంచు తుపాను వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. ఇప్పటికే అతలాకుతలం అవుతున్న అమెరికన్లకు మరో విషమ పరీక్ష సిద్ధంగా ఉన్నట్లు చెప్పాలి. తూర్పు తీరంలో దాదాపు 14 రాష్ట్రాలు ఉంటాయి. అవేమంటే..

- మైనే

- న్యూ హాంప్‌షైర్

- మసాచుసెట్స్

- రోడ్ ఐలాండ్

- కనెక్టికట్

- న్యూయార్క్

- న్యూజెర్సీ

- పెన్సిల్వేనియా (దీనికి నేరుగా సముద్ర తీరం లేకున్నా తూర్పు తీర రాష్ట్రంగానే భావిస్తారు)

- డెలావేర్

- మేరీల్యాండ్

- వర్జీనియా

- నార్త్ కరోలినా

- సౌత్ కరోలినా

- జార్జియా

- ఫ్లోరిడా

- వాషింగ్టన్ డీసీ

ఈ జాబితాలో తూర్పు తీర ప్రాంతం పరిధిలోని పద్నాలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ అట్లాంటిక్ ప్రాంతం కూడా కలిసి ఉంది. అయితే.. తాజాగా జరిగిన మంచు తుపాను తీవ్రత ఎక్కువగా న్యూయార్క్, మసాచుసెట్స్ దాని చుట్టుపక్కల ఉన్న ఉత్తర రాష్ట్రాల మీద ఉంది. మొత్తంగా మంచు తుపాను.. అందునా తీవ్రమైన మంచు తుపాను అంటే నరకంతో సావాసం చేసినట్లే. అగ్రరాజ్యానికి సైతం ప్రక్రతి విధించే పరిమితులు చూస్తే..జీవనే తత్త్వం ఇట్టే బోధ పడుతుంది.