Begin typing your search above and press return to search.

H-1B బుకింగ్ గందరగోళం: కొత్త US పోర్టల్, అదే పాత ఇబ్బందులు!

అమెరికాలో ఉద్యోగాల కోసం ఆశించే వేలాది మంది భారతీయులకు H-1B వీసా ప్రాసెస్ ఎప్పటి నుంచో టెన్షన్‌ఫుల్‌గానే ఉంటుంది.

By:  A.N.Kumar   |   29 Oct 2025 10:37 AM IST
H-1B బుకింగ్ గందరగోళం: కొత్త US పోర్టల్, అదే పాత ఇబ్బందులు!
X

అమెరికాలో ఉద్యోగాల కోసం ఆశించే వేలాది మంది భారతీయులకు H-1B వీసా ప్రాసెస్ ఎప్పటి నుంచో టెన్షన్‌ఫుల్‌గానే ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. వీసా అపాయింట్‌మెంట్‌లను సులభతరం చేయాలనే ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పోర్టల్‌ (స్కెడ్యూలింగ్ వెబ్‌సైట్‌) అభ్యర్థులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. సులభతరం చేయాలనే ప్రయత్నం చివరికి గందరగోళంగా మారి, వీసా కలలపై నీళ్లు చల్లినట్టైంది.

* గ్లిచ్‌లు, ఎర్రర్లు – అభ్యర్థుల్లో ఆందోళన

కొత్త పోర్టల్‌లో టెక్నికల్ సమస్యలు విపరీతంగా కనిపిస్తున్నాయి. అపాయింట్‌మెంట్ బుకింగ్ సమయంలో ఎదురవుతున్న ఈ సాంకేతిక లోపాలు అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరి అకౌంట్లలో అపాయింట్‌మెంట్‌లు ఆటోమెటిక్‌గా మారిపోతుండగా, మరికొందరికి ఎటువంటి కన్ఫర్మేషన్ పేజీ కూడా కనిపించడం లేదు. కేవలం ఒక తప్పు క్లిక్‌తోనే OFC (Offsite Facilitation Center) , కౌన్సులేట్ ఇంటర్వ్యూ స్లాట్‌లు రెండూ మారిపోతున్నాయి. దీనివల్ల అభ్యర్థులు పూర్తిగా అయోమయానికి గురవుతున్నారు.

* “స్లాట్ పోతుందేమో” భయం

తమ OFC అపాయింట్‌మెంట్ మాత్రమే మార్చుకోవాలని అనుకునే వారు కూడా పొరపాటున ఇంటర్వ్యూ స్లాట్ కూడా మారిపోతుందేమో అన్న భయంతో పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేందుకు వెనుకడుగు వేస్తున్నారు. OFC స్లాట్ పోతుందో, ఇంటర్వ్యూ స్లాట్ పోతుందో అన్న భయం వారిని వెంటాడుతోంది. మార్పులు ఏవి జరిగాయో తేలేది మాత్రం చివర్లో — అప్పటికే ఆలస్యం అవుతుంది.

* కొత్త పోర్టల్, పాత సమస్యలు

“కొత్త” సిస్టమ్ అని అమెరికా ప్రభుత్వం చెప్పినా, వాస్తవానికి పాత సమస్యలే కొత్త రూపంలో కనిపిస్తున్నాయి. ఈ కొత్త వ్యవస్థను మెరుగుపరచడంలో అడ్మినిస్ట్రేషన్ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజూ వందలాది మంది లాగిన్ అవుతుంటే, ఎర్రర్ మెసేజ్‌లు, ఖాళీ స్క్రీన్‌లు, అకస్మాత్తుగా మార్చబడిన అపాయింట్‌మెంట్‌లు వారిని మరింత నిరుత్సాహపరుస్తున్నాయి.

ఈ కొత్త పోర్టల్ భారతీయ అభ్యర్థులకి నిజంగా ఒక "టెక్నికల్ నైట్‌మేర్"లా మారింది. సైట్ డిజైన్ లోపాలు, క్లారిటీ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ “ఏదైనా తప్పు జరిగిపోతుందేమో” అన్న ఆందోళనలో ఉన్నారు. కొందరైతే తమ అకౌంట్ ఓపెన్ చేయడానికే భయపడుతున్నారు.

* వీసా కష్టాలకు మరో సవాలు

ఇప్పటికే H-1B వీసాలపై అమెరికా పరిపాలన కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇప్పుడు ఈ ఆన్‌లైన్ సిస్టమ్ సమస్యలు వీసా దరఖాస్తుదారులకు అదనపు భారంగా మారాయి. వీసా ప్రాసెస్‌పై ఆధారపడి అమెరికాలో కెరీర్ నిర్మించాలనే కల కలిగిన వారికీ, ఈ గ్లిచ్‌లు మరింత నిరాశను తెస్తున్నాయి.

మొత్తం మీద, “కొత్త పోర్టల్ – పాత సమస్యలు” అన్నట్టుగా, H-1B వీసా బుకింగ్ వ్యవస్థ మరోసారి భారతీయ అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఈ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయేమో వేచి చూడాలి.