Begin typing your search above and press return to search.

ట్రంప్ H1B వీసా బాంబ్ పై భారత్ రియాక్షన్ ఇదీ

1990లలో అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాలను ప్రవేశపెట్టింది. దీని లక్ష్యం విదేశాల నుంచి ప్రతిభావంతులైన నిపుణులను తీసుకువచ్చి టెక్ పరిశ్రమలో ఖాళీలను భర్తీ చేయడం.

By:  A.N.Kumar   |   20 Sept 2025 10:53 PM IST
ట్రంప్ H1B వీసా బాంబ్ పై భారత్ రియాక్షన్ ఇదీ
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్-1బీ వీసాపై కఠిన నిబంధనలు విధించడం, ముఖ్యంగా వార్షిక ఫీజును భారీ స్థాయిలో పెంచడం అంతర్జాతీయ వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామంపై భారత్ తొలిసారిగా అధికారికంగా స్పందించింది.

విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ఈ అంశంపై మాట్లాడుతూ “తాజా హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నిర్ణయం ఇరుదేశాలకూ ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ఎన్నో కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఈ నిర్ణయం వల్ల తలెత్తే సమస్యలను అమెరికా ప్రభుత్వం గమనిస్తుందని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.

భారత ఆందోళన

భారత విదేశాంగ శాఖ ప్రకటనలో అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు, వలస కార్మికులపై ఈ నిర్ణయం ఆర్థికపరంగాను, మానవీయ కోణంలోనూ ఒత్తిడి సృష్టించవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. నైపుణ్యం కలిగిన వ్యక్తుల రాకపోకల వల్ల ఇరుదేశాలకూ లబ్ధి చేకూరుతుందని, ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధికి ఇవి కీలకమని గుర్తు చేసింది.

హెచ్-1బీ వీసా నేపథ్యం

1990లలో అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాలను ప్రవేశపెట్టింది. దీని లక్ష్యం విదేశాల నుంచి ప్రతిభావంతులైన నిపుణులను తీసుకువచ్చి టెక్ పరిశ్రమలో ఖాళీలను భర్తీ చేయడం. ఈ వీసాలు సాధారణంగా మూడు నుంచి ఆరేళ్ల వరకు మంజూరు చేయబడతాయి. ప్రస్తుతం ఈ వీసాలకు లాటరీ విధానం అమల్లో ఉంది.

కొత్త నిబంధన ప్రభావం

తాజా ఉత్తర్వు ప్రకారం.. అమెరికాలోని కంపెనీలు ఒక హెచ్-1బీ వీసా దరఖాస్తుపై ఏడాదికి లక్ష డాలర్లు (దాదాపు రూ. 88 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వీసా ఖర్చులు తక్కువగా ఉండేవి, వాటిని సాధారణంగా కంపెనీలే భరించేవి. కానీ కొత్త విధానం వల్ల కంపెనీల ఖర్చులు విపరీతంగా పెరగనున్నాయి.

2024 గణాంకాల ప్రకారం హెచ్-1బీ వీసా దారుల్లో భారత్ 71% వాటాతో అగ్రస్థానంలో ఉండగా, చైనా 11.7% వాటా కలిగి ఉంది. కనుక ఈ రెండు దేశాలపై అమెరికా కొత్త వీసా విధానం మరింత ప్రభావం చూపనుంది.

భారత్ ఇప్పటికే ఈ అంశంపై అమెరికాతో చర్చలు జరపాలని భావిస్తోంది. మానవీయ కోణంలో పరిశీలించి ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. నైపుణ్యం కలిగిన వలస ఉద్యోగులపై ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఇరుదేశాల ఆర్థిక ప్రయోజనాలకు, సంబంధాల అభివృద్ధికి అవరోధంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.