ట్రంప్ ప్రకటన విన్న వెంటనే ఫ్లైట్ దిగి వెళ్లిపోయిన భారతీయులు
ఈ ప్రకటన వెలువడిన రోజే శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఒక అపూర్వ ఘటన చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 22 Sept 2025 7:34 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు నిర్ణయం భారతీయులలో భయాందోళనలకు దారి తీసింది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం.. అమెరికాకు వీసాలు చేసే వారికి అదనపు భారమయ్యేలా ఛార్జీలు పెంచారు. అయితే ఇది కొత్తగా వీసా తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసినప్పటికీ, ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న వారు, అలాగే ఇతర దేశాల నుంచి వెళ్లాలనుకునే భారతీయ నిపుణులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ఎయిర్‌పోర్టులో అపూర్వ ఘటన
ఈ ప్రకటన వెలువడిన రోజే శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఒక అపూర్వ ఘటన చోటుచేసుకుంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా.. అందులోని భారతీయ ప్రయాణికులు ట్రంప్ ప్రకటన విన్న వెంటనే దిగిపోవడం ప్రారంభించారు. టికెట్ బుక్ చేసుకున్న వారు ఒక్కరినొకరు అనుసరిస్తూ విమానం నుంచి బయటకు దూకినట్టే దిగి వెళ్లిపోవడంతో, ఒక్కసారిగా ఎయిర్‌పోర్టులో గందరగోళ వాతావరణం నెలకొంది.
* మూడు గంటల ఆలస్యం.. ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు
భారతీయులు పెద్ద ఎత్తున విమానం దిగిపోవడంతో సదరు విమానం టేకాఫ్ ఆలస్యమైంది. సిబ్బంది తిరిగి ప్రయాణికుల కౌంట్, భద్రతా తనిఖీలు నిర్వహించాల్సి రావడంతో ఎమిరేట్స్ విమానం మూడు గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఈ కారణంగా మిగతా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
*భయాలే ప్రధాన కారణం
ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల భద్రత, భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణం సాధ్యమవుతుందా అనే అనుమానాలు భారతీయులలో పెరుగుతున్నాయి. కొందరు తమ ప్రయాణాలను మధ్యలోనే రద్దు చేసుకుంటుండగా.. మరికొందరు చివరి నిమిషంలో విమానాల నుంచి దిగిపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ట్రంప్ నిర్ణయం ఎంత పెద్ద కలకలం రేపిందో స్పష్టంగా చూపిస్తున్నాయి.
మొత్తానికి హెచ్-1బీ వీసా ఛార్జీల పెంపు ప్రభావం కేవలం ఉద్యోగాలపైనే కాదు.. భారతీయుల ప్రయాణాలపైనా పడుతుండటమే కాకుండా, అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులలో మరింత గందరగోళం సృష్టిస్తోంది.
