Begin typing your search above and press return to search.

H-1B వీసా ఫీజుల పెంపు: భారత విదేశాంగ శాఖ సంచలన ప్రకటన

ఈ అసాధారణ ఫీజు పెంపు పట్ల అమెరికాలోని ప్రముఖ టెక్ దిగ్గజాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, జేపీమార్గన్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు మార్గదర్శకాలను జారీ చేశాయి.

By:  A.N.Kumar   |   28 Sept 2025 11:49 AM IST
H-1B వీసా ఫీజుల పెంపు: భారత విదేశాంగ  శాఖ సంచలన ప్రకటన
X

అమెరికా ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ప్రపంచ ఐటీ రంగాన్ని, ముఖ్యంగా భారత్‌ను కుదిపేసింది. అత్యంత కీలకమైన H-1B వీసా అప్లికేషన్ ఫీజును సుమారు $1,000 (₹85,000) నుంచి ఏకంగా $100,000 (సుమారు ₹90 లక్షలు) వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాకింగ్ నిర్ణయం ప్రధానంగా అమెరికా ఉద్యోగాలపై ఆధారపడే భారతీయ ఐటీ నిపుణులపై, వారిని నియమించుకునే అంతర్జాతీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

* భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పందన

ఈ అంశంపై భారత్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పందించింది. ఇది ఇంకా ఒక "అభివృద్ధి చెందుతున్న పరిస్థితి" అని పేర్కొంటూ.. ఇదే ఫైనల్ కాదని.. చర్చలు జరుపుతున్నామని.. ఈ భారీ ఫీజు పెంపు యొక్క అన్ని కోణాలను, ముఖ్యంగా మానవతా ప్రభావాలను.. భారతీయ నిపుణులపై పడే భారాన్ని నిశితంగా సమీక్షిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ పరిణామంపై అమెరికా అధికారులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

కంపెనీల ఆందోళనలు.. వెనకడుగు వేసే ప్రమాదం

ఈ అసాధారణ ఫీజు పెంపు పట్ల అమెరికాలోని ప్రముఖ టెక్ దిగ్గజాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, జేపీమార్గన్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు మార్గదర్శకాలను జారీ చేశాయి. వీసా విధానాల్లో వచ్చిన ఈ మార్పులు ఉద్యోగ భద్రతపై, నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి.

ప్రతి ఉద్యోగి కోసం దాదాపు ₹90 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి రావడం వల్ల, భారతీయ ఉద్యోగులను నియమించుకునే కంపెనీల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఫలితంగా, అనేక సంస్థలు భారత్ నుంచి కొత్త నియామకాలు చేపట్టడానికి వెనకడుగు వేసే ప్రమాదం ఉంది.

ఉద్యోగ కోతలకు దారి

ఇప్పటికే H-1B వీసాతో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా భవిష్యత్తులో వీసా రెన్యూవల్ కష్టంగా మారవచ్చని, ఇది అంతిమంగా ఉద్యోగ కోతలకు దారి తీయవచ్చని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

మినహాయింపు అవకాశాలు

ఈ ఫీజు పెంపు అన్ని కంపెనీలకు వర్తించినప్పటికీ, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి నిర్ణయంతో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపు ఇవ్వవచ్చని అమెరికా అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా "జాతీయ ప్రయోజనం" కోసం అత్యంత ప్రత్యేక నిపుణులను నియమించాల్సిన పరిస్థితుల్లో ఈ మినహాయింపు అమల్లోకి రావచ్చని తెలుస్తోంది.

అమెరికా వీసా విధానాల్లో వచ్చిన ఈ అనూహ్య మార్పు భారత ఐటీ రంగానికి, అమెరికాలోని భారతీయ నిపుణులకు పెద్ద సవాలుగా మారనుంది. ఇకపై భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ప్రతిభావంతుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందని, దీనివల్ల రెండు దేశాల మధ్య టెక్నాలజీ రంగ సహకారం, మానవ వనరుల మార్పిడిపై ప్రతికూల ప్రభావం పడవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ అంశంపై రెండు దేశాల ప్రభుత్వాల మధ్య చర్చలు అత్యవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.