Begin typing your search above and press return to search.

కీలక బిల్లు... హెచ్-1బీ, ఎల్-1 వీసా లొసుగులను టార్గెట్ చేసిన సెనేటర్లు!

అవును... హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాలను సంస్కరించాలని, విదేశీ ఉద్యోగుల నియామకం విషయంలో కఠిన నిబంధనలు ఉండాలని యూఎస్ సెనెటర్లు డిమాండ్ చేస్తున్నారు.

By:  Raja Ch   |   1 Oct 2025 9:42 AM IST
కీలక బిల్లు... హెచ్-1బీ, ఎల్-1 వీసా లొసుగులను టార్గెట్ చేసిన సెనేటర్లు!
X

హెచ్‌-1బీ వీసాల విషయంలో అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇటీవల వాటి ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్‌ లుట్నిక్ స్పందిస్తూ.. 2026 ఫిబ్రవరికి ముందే ఆ వీసాల జారీ ప్రక్రియలో గణనీయమైన మార్పులు ఉంటాయని వెల్లడించారు.

ఇదే సమయంలో పాత విధానంలో లోపాలు ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో గత వారం అమెజాన్, గూగుల్, మెటా వంటి పది ప్రధాన అమెరికన్ కంపెనీలకు లేఖలు పంపిన సెనేటర్లు చక్ గ్రాస్లీ, డిక్ డర్బిన్ హెచ్‌-1బీ, ఎల్-1 వీసా కార్యక్రమాలను సరిదిద్దడానికి ద్వైపాక్షిక చట్టాన్ని ప్రకటించారు. ప్రతిపాదిత చట్టం బెర్నీ సాండర్స్‌ తో సహా క్రాస్-పార్టీ చట్టసభ సభ్యుల మద్దతు పొందింది.

అవును... హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాలను సంస్కరించాలని, విదేశీ ఉద్యోగుల నియామకం విషయంలో కఠిన నిబంధనలు ఉండాలని యూఎస్ సెనెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సెనెటర్లు చక్‌ గ్రాస్లీ, డిక్‌ డర్బిన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. కార్పొరేట్‌ దుర్వినియోగాన్ని అరికట్టి అమెరికా ఉద్యోగులను రక్షించడమే దీని లక్ష్యమని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఈ బిల్లు హెచ్‌-1బీ లాటరీని మెరిట్ ఆధారిత ప్రాధాన్యతా వ్యవస్థతో భర్తీ చేస్తుంది.

ఇది యూఎస్-విద్యావంతులైన అడ్వాన్స్‌డ్ డిగ్రీ హోల్డర్లకు, ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాలకు చెందిన వారికి, అధిక వేతన దరఖాస్తుదారులకు అనుకూలంగా ఉంటుంది. ఇదే సమయంలో హెచ్-1బీ ఉద్యోగాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్మిక శాఖ వెబ్‌ సైట్‌ లో తప్పనిసరిగా పోస్ట్ చేయడంతో పాటు వేతన ఉల్లంఘనలకు అధిక జరిమానాలను కూడా ఇది ప్రతిపాదిస్తుంది.

వాస్తవానికి హెచ్-1బీ వీసా అనేది యూఎస్-ఆధారిత కంపెనీలు డిగ్రీ అవసరమయ్యే ఉద్యోగులకు నియమించుకున్న నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం అయితే ఎల్-1 వీసా అనేది విదేశీ కార్యాలయాల నుండి అమెరికా కార్యాలయానికి బదిలీ చేయబడిన మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ ల కోసం. ఈ క్రమంలో లాటరీ ఎంపిక, 85000 వార్షిక కోటాకు లోబడి ఉండే కొత్త హెచ్-1బీ వీసా కేటాయింపులలో భారతీయులు సుమారు 58 శాతం పొందడం గమనార్హం.

లాటరీకి స్వస్థి!:

అయితే తాజా బిల్లు ప్రకారం... హెచ్-1బీ లాటరీని ప్రాధాన్యతా వ్యవస్థ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో ప్రధానంగా అమెరికా స్టెమ్ మాస్టర్స్ లేదా పీ.హెచ్.డీ డిగ్రీలు ఉన్న దరఖాస్తుదారులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ప్రాధాన్యతా శ్రేణులలో ఇతర అమెరికా అడ్వాన్స్‌డ్ డిగ్రీలు – స్టెమ్ లో అమెరికా బ్యాచిలర్ డిగ్రీలు, ఆపై ఇతర అమెరికా బ్యాచిలర్స్ డిగ్రీలు ఉన్నవారు ఉన్నారు.

డీ.హెచ్.ఎస్. ముసాయిదా ప్రతిపాదన!:

హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీ.హెచ్.ఎస్.) ఇటీవల ఒక ముసాయిదా ప్రతిపాదనను జారీ చేసి ప్రజల అభిప్రాయాలను ఆహ్వానించింది. ఇందులో భాగంగా... హెచ్-1బీ వీసా కోసం స్పాన్సర్ చేయబడిన వారికి ఎక్కువ ఎంపిక అవకాశాలను కల్పించే హెచ్-1బీ క్యాప్ లాటరీ ప్రక్రియను మార్చాలని దాని ప్రతిపాదన ప్రయత్నిస్తుంది. మరోవైపు, ఈ బిల్లు అమెరికా-విద్యావంతులైన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది.

సెనేటర్ల కీలక వ్యాఖ్యలు!:

వ్యాపారాలు స్వదేశంలో దొరకనప్పుడు అగ్రశ్రేణి ప్రతిభను సంపాదించడానికి పరిమిత మార్గాలుగా కాంగ్రెస్ హెచ్-1బీ, ఎల్-1 వీసా కార్యక్రమాలను సృష్టించింది. కానీ చాలా సంవత్సరాలుగా, చాలా మంది యజమానులు చౌకైన విదేశీ కార్మికులకు అనుకూలంగా అమెరికన్ కార్మికులను తొలగించడానికి ఈ వీసాలను ఉపయోగించారు అని (రిపబ్లికన్) సెనేటర్ గ్రాస్లీ అన్నారు.

ఇదే సమయంలో... ప్రధాన కంపెనీలు వేలాది మంది అమెరికన్ కార్మికులను తొలగిస్తున్నాయి, అదే సమయంలో తక్కువ వేతనాలు, పేలవమైన పని పరిస్థితులతో విదేశీ కార్మికుల కోసం వేలాది వీసా పిటిషన్లను దాఖలు చేస్తున్నాయని.. అమెరికన్ కార్మికులను రక్షించడానికి, విరిగిన అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సరిచేయడానికి కాంగ్రెస్ జోక్యం చేసుకోవాలని (డెమోక్రాట్) సెనేటర్ డర్బిన్ వ్యాఖ్యానించారు.

ఇమ్మిగ్రేషన్.కామ్ మేనేజింగ్ అటార్నీ కీలక వ్యాఖ్యలు!:

మరోవైపు.. మీరు ఒక విద్యార్థి అయితే, ముఖ్యంగా స్టెమ్ రంగంలో ఉంటే, ప్రధానంగా అమెరికా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైతే.. విదేశీ డిగ్రీలు పొందిన దరఖాస్తుదారుల కంటే హెచ్-1బీ వీసా పొందడంలో మీకు ప్రధాన పోటీ ప్రయోజనాన్ని అందిస్తుంది అని ఇమ్మిగ్రేషన్.కామ్ మేనేజింగ్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా అన్నారు.

హెచ్-1బీ వీసాలకు మొదటి ప్రాధాన్యత అమెరికా సంస్థ నుండి స్టెమ్ రంగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా పీ.హెచ్.డీ. పొందిన గ్రాడ్యుయేట్లకు చెందుతుందని స్పష్టం చేశారు.