మరో టాప్ కంపెనీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ షాక్.. ఇక అమెరికాలో ఉండలేం..
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందే సుదీర్ఘ ప్రయాణంలో పీఈఆర్ఎం లేబర్ సర్టిఫికేషన్ అనేది అత్యంత కీలకమైన మొదటి అడుగు.
By: A.N.Kumar | 26 Sept 2026 5:08 PM ISTకళ్ల నిండా కోటి ఆశలు.. చేతి నిండా ఉద్యోగం.. జీవితంలో స్థిరపడ్డామనే నమ్మకం.. అమెరికాలో అడుగుపెట్టిన ప్రతి భారతీయుడి గమ్యం ఒక్కటే.. ఎలాగైనా 'గ్రీన్ కార్డ్' సాధించి స్వేచ్ఛగా బతకడం. కానీ ఏళ్ల తరబడి పడుతున్న కష్టానికి.. రేపటిపై పెంచుకున్న ఆశలకు ఒక్కసారిగా గండిపడింది. రాత్రింబవళ్లు కష్టపడి కంపెనీలను లాభాల బాట పట్టించే విదేశీ నిపుణులకు మరోసారి తీవ్ర నిరాశే మిగిలింది. ప్రముఖ టెక్ దిగ్గజాలు 'అడోబ్' , 'కాగ్నిజెంట్' సంస్థల్లో పనిచేస్తున్న వందలాది మంది భారతీయుల ఇమ్మిగ్రేషన్ కలలు ఇప్పుడు తీవ్ర అనిశ్చితిలో పడిపోయాయి.
అమెరికా కార్మిక శాఖ (డీఓఎల్) విడుదల చేసిన రికార్డుల ప్రకారం.. అడోబ్ కంపెనీకి చెందిన దాదాపు 215 పెండింగ్ పీఈఆర్ఎం (ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్) అప్లికేషన్లు 100 శాతం ‘హోల్డ్’ కేటగిరీలోకి వెళ్ళిపోయాయి. అటు కాగ్నిజెంట్‌లోనూ ఏకంగా 1,831 పీఈఆర్ఎం కేసులు పూర్తిగా నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా దాదాపు 2,070 పైగా కేసులు ఒక్కసారిగా హోల్డ్‌లో పడటంతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
కన్నీళ్లు తెప్పిస్తున్న విదేశీ ఉద్యోగుల రోదన
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందే సుదీర్ఘ ప్రయాణంలో పీఈఆర్ఎం లేబర్ సర్టిఫికేషన్ అనేది అత్యంత కీలకమైన మొదటి అడుగు. ఈ అడుగు పడితేనే తదుపరి ప్రక్రియ ముందుకు సాగుతుంది. కానీ, ఇప్పుడు ఆ మొదటి అడుగే పడకుండా నిలిచిపోవడంతో ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. హెచ్1బీ 1B వీసా పరిమితులు, రీ-న్యూవల్స్ భయాలు, పిల్లల చదువులు, ఇళ్ల ఈఎంఐలు.. వీటన్నింటి మధ్య ప్రశాంతంగా జీవించవచ్చని ఆశపడ్డవారికి ఈ వార్త కోలుకోలేని దెబ్బ.
"ఇక్కడే పుట్టి పెరుగుతున్న మా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఏళ్ల తరబడి పన్నులు కడుతూ కంపెనీల పురోగతికి శ్రమిస్తున్నాం.. కానీ మా స్థిరత్వానికి గ్యారెంటీ లేకపోతే మేం ఎక్కడికి పోవాలి?" అని ఓ అడోబ్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులు పూర్తిగా తిరస్కరించబడలేదు.. కేవలం 'హోల్డ్'లోనే ఉన్నాయని ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అసలు ఎందుకు హోల్డ్‌లో పెట్టారనే దానికి కార్మిక శాఖ నుంచి ఎలాంటి స్పష్టమైన కారణం లభించకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది.
అధికారికంగా కారణాలు వెల్లడయ్యే వరకు ఈ భయం, ఆందోళన వారిని వెంటాడుతూనే ఉంటాయి. నిద్రలేని రాత్రులు గడుపుతూ అమెరికా ప్రభుత్వ తదుపరి నిర్ణయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం తప్ప.. ప్రస్తుతం ఈ ఐటీ బాధితులు చేయగలిగింది ఏమీ లేకపోవడం నిజంగా హృదయవిదారకం.
