ట్రంప్ కొత్త బిల్లు : గ్రీన్‌కార్డ్‌లపై గుడ్ న్యూస్
జూలై 15న అమెరికా ప్రతినిధుల సభలో 'డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025' పేరుతో ఒక ముఖ్యమైన వలస సంస్కరణ బిల్లును ప్రవేశపెట్టారు.
By: A.N.Kumar | 9 Aug 2025 10:00 PM ISTఅమెరికా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, గ్రీన్‌కార్డు దరఖాస్తులను వేగవంతంగా ప్రాసెస్ చేయడానికి ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం.. సుమారు రూ. 17.5 లక్షలు (అంటే $20,000) ఫీజు చెల్లించి, గ్రీన్‌కార్డ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవచ్చు.
-డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025: ప్రధాన ఉద్దేశాలు
జూలై 15న అమెరికా ప్రతినిధుల సభలో 'డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025' పేరుతో ఒక ముఖ్యమైన వలస సంస్కరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రధాన లక్ష్యాలు.. ప్రతి సంవత్సరం జారీ చేసే గ్రీన్‌కార్డ్‌ల సంఖ్యను పెంచడం. పాత వలస చట్టాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చడం... ప్రస్తుతం 11.3 మిలియన్లకు చేరిన భారీ వీసా బ్యాక్‌లాగ్‌ను తగ్గించడం ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి.
బిల్లులోని కీలక అంశాలు
ఈ కొత్త బిల్లులో పలు కీలకమైన నిబంధనలు ఉన్నాయి. వీసా కోసం ఎదురుచూసే గరిష్ట సమయాన్ని 10 సంవత్సరాలకు పరిమితం చేయడం. ఉద్యోగం లేదా కుటుంబ ఆధారిత వలస దరఖాస్తులు 10 సంవత్సరాలకు మించి పెండింగ్‌లో ఉంటే, $20,000 (సుమారు రూ. 17.5 లక్షలు) ఫీజు చెల్లించి వేగవంతమైన ప్రాసెసింగ్‌ను పొందవచ్చు. ప్రతి దేశానికి ఉన్న గ్రీన్‌కార్డ్ పరిమితిని 7% నుంచి 15%కి పెంచడం. ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ కోఆర్డినేటర్ అనే కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, వివిధ విభాగాల మధ్య సమన్వయం పెంచడం... బ్యాక్‌లాగ్ తగ్గించడానికి $3.6 బిలియన్ల నిధులు కేటాయించడం.
- ఈ బిల్లు వల్ల ఎవరు లాభపడతారు?
ఈ బిల్లుతో ప్రధానంగా రెండు వర్గాల వారికి ప్రయోజనం కలుగుతుంది. చిన్న వయసులో అమెరికాకు వచ్చిన పత్రాలు లేని వలసదారులకు ఇది గొప్ప అవకాశం. సంవత్సరాలుగా వీసా కోసం ఎదురుచూస్తున్న నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు త్వరగా గ్రీన్‌కార్డ్ పొందే అవకాశం లభిస్తుంది. అయితే నేర చరిత్ర ఉన్నవారికి ఈ ప్రయోజనం వర్తించదు.
-వీసా నిబంధనల్లో మరిన్ని మార్పులు
ఈ బిల్లులో వీసా నిబంధనలకు సంబంధించి మరికొన్ని మార్పులు కూడా ఉన్నాయి. ఉద్యోగ ఆధారిత వీసాలలో కుటుంబ సభ్యులను కోటా లెక్కల నుంచి తొలగించడం. దీనివల్ల ప్రధాన దరఖాస్తుదారుడు మాత్రమే కోటాలో లెక్కించబడతారు. అంతర్జాతీయ విద్యార్థులు (F-1 వీసా హోల్డర్లు) చదువు పూర్తయ్యాక తిరిగి తమ దేశాలకు వెళ్లాలనే ఉద్దేశాన్ని నిరూపించాల్సిన అవసరం లేకుండానే అమెరికాలో ఉద్యోగావకాశాలను పొందవచ్చు.సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, మెడిసిన్ (STEM) విభాగాల్లో డాక్టరేట్ చేస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు 'O' వీసా అర్హత స్వయంగా లభిస్తుంది.
ఈ బిల్లు ఆమోదం పొందితే, అమెరికా వలస వ్యవస్థలో దశాబ్దాల తర్వాత వచ్చిన అతిపెద్ద సంస్కరణ అవుతుంది. దీనివల్ల వలసదారులకు స్థిరత్వం లభించడమే కాకుండా, సరిహద్దు భద్రత కూడా మరింత కట్టుదిట్టం అవుతుంది.
