హెచ్-1బీ ఉద్యోగులకు భారీ ఊరట: గ్రీన్ కార్డ్ నిరీక్షణకు తెరపడేనా? సెనేట్‌లో కొత్త బిల్లు
సెనేటర్ అలెక్స్ పడిల్లాతో పాటు డెమొక్రాటిక్ విప్ డిక్ డర్బిన్ ఈ బిల్లుకు నాయకత్వం వహిస్తున్నారు.
By: A.N.Kumar | 28 July 2026 4:33 PM ISTఅమెరికాలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తూ గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ఆశలు చిగురించే పరిణామం చోటుచేసుకుంది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికా సెనేట్‌లో ఒక కీలకమైన కొత్త బిల్లు ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లు చట్టంగా మారితే ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వలసదారులకు శాశ్వత నివాస హోదా గ్రీన్ కార్డ్ సులభంగా లభించే అవకాశం ఉంది.
ఏమిటి ఈ కొత్త ప్రతిపాదన?
అమెరికా ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ చట్టంలోని ‘రిజిస్ట్రీ కట్ ఆఫ్ డేట్’ సెక్షన్ 249 ప్రకారం.. 1972 జనవరి 1కి ముందు నుంచి అమెరికాలో నివసిస్తున్న వారికి మాత్రమే నేరుగా గ్రీన్ కార్డ్ పొందే వెసులుబాటు ఉంది. అయితే కాలిఫోర్నియా డెమొక్రాటిక్ సెనేటర్ అలెక్స్ పడిల్లా ప్రవేశపెట్టిన కొత్త బిల్లులో ఈ పాత తేదీ నిబంధనను పూర్తిగా తొలగించాలని ప్రతిపాదించారు. దీని స్థానంలో దరఖాస్తు చేసుకునే సమయానికి కనీసం 7 సంవత్సరాలు నిరంతరంగా అమెరికాలో నివసించి ఉంటే చాలు. అర్హులైన వారు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులకు ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు.. మిగతా సాధారణ అర్హత ప్రమాణాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
భారతీయులకు ఎందుకింత కీలకం?
అమెరికా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల కేటాయింపులో ఉన్న ‘కంట్రీ క్యాప్’ ఏటా ప్రతి దేశానికి 7% పరిమితి కారణంగా అత్యధికంగా నష్టపోతున్నది భారతీయ ఐటీ నిపుణులే. ప్రస్తుతం భారతీయులు గ్రీన్ కార్డ్ పొందడానికి 10 నుండి 20 ఏళ్లకు పైగా వేచి చూడాల్సి వస్తోంది. ఈ కొత్త 7 ఏళ్ల నిబంధన అమల్లోకి వస్తే దశాబ్దాల తరబడి ఉన్న నిరీక్షణకు ప్రత్యామ్నాయ మార్గం సుగమమవుతుంది.
లబ్ధి పొందే ఇతర వర్గాలు
ఈ బిల్లు కేవలం హెచ్-1బీ వీసాదారులకే కాకుండా అమెరికాలో చాలా కాలంగా నివసిస్తున్న వివిధ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుంది . చిన్నతనంలోనే అమెరికాకు వచ్చిన పిల్లలు... టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ కలిగిన నివాసితులు... కోవిడ్ .. ఇతర సమయాల్లో సేవలు అందించిన వర్కర్లు.. దీర్ఘకాల వీసాదారుల పిల్లలు వయసు దాటిపోవడం వల్ల వీసా కోల్పోయే ప్రమాదంలో ఉన్న పిల్లలు దీని పరిధిలోకి వస్తారు.
బిల్లు ఆమోదం పొందుతుందా?
సెనేటర్ అలెక్స్ పడిల్లాతో పాటు డెమొక్రాటిక్ విప్ డిక్ డర్బిన్ ఈ బిల్లుకు నాయకత్వం వహిస్తున్నారు. మరో 14 మంది సెనేటర్లతో పాటు 30కి పైగా కార్మిక, పౌరహక్కుల సంస్థలు దీనికి మద్దతు తెలుపుతున్నాయి.
అయితే అమెరికా కాంగ్రెస్‌లో ఇమ్మిగ్రేషన్ అంశంపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్రమైన రాజకీయాభిప్రాయ భేదాలు ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లు రెండు సభల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ ఆమోదం పొంది.. అధ్యక్షుడి సంతకం అయ్యే వరకు వేచి చూడాల్సిందే..
