Begin typing your search above and press return to search.

గ్రీన్ కార్డ్ కోసం 19 నెలల నిరీక్షణ: అమెరికా వలస వ్యవస్థలోని 'అనిశ్చితి'కి నిలువుటద్దం

వలస నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ జాప్యానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. యూఎస్.సీఐఎస్ కి చెందిన కొన్ని ఫీల్డ్ ఆఫీసులు వేగంగా పని చేస్తాయి.

By:  A.N.Kumar   |   22 Feb 2026 4:00 PM IST
గ్రీన్ కార్డ్ కోసం 19 నెలల నిరీక్షణ: అమెరికా వలస వ్యవస్థలోని అనిశ్చితికి నిలువుటద్దం
X

అమెరికా కలని నిజం చేసుకునే క్రమంలో గ్రీన్ కార్డ్ అనేది ఒక కీలక మైలురాయి. అయితే ఆ మైలురాయిని చేరుకోవడానికి కొందరికి పట్టే సమయం వర్ణనాతీతం. ఇటీవల ఒక వలసదారుడు రెడ్డిట్ వేదికగా పంచుకున్న తన 19 నెలల సుదీర్ఘ నిరీక్షణ కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక వ్యక్తి ఆవేదన మాత్రమే కాదు.. వేలాది మంది వలసదారులు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత జాప్యానికి నిదర్శనం.

ఒక దరఖాస్తు.. రెండేళ్ల నిరీక్షణ

సదరు అభ్యర్థి సెప్టెంబర్ 2024లో కుటుంబ ఆధారిత వలస కోసం ఐ-130 , ఐ-485 దరఖాస్తులను సమర్పించారు. ఫిబ్రవరి 2025లో ఐ-130 ఆమోదం పొందినప్పటికీ అసలైన ఐ-485 మాత్రం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. సాధారణంగా ఐ-130 ఆమోదం పొందాక ప్రక్రియ వేగవంతం కావాలి.. కానీ ఇక్కడ 19 నెలలు గడిచినా ఫలితం లేకపోవడం గమనార్హం.

పాక్షిక ఊరట.. కానీ పూర్తి భరోసా లేదు..

ప్రస్తుతానికి సదరు అభ్యర్థికి వర్క్ ఆథరైజేషన్ (ఈఏడీ) , అడ్వాన్స్ పరోల్ (ట్రావెల్ పర్మిట్) లభించాయి. ఇంటర్వ్యూ లేకుండానే ఇవి ఆమోదం పొందడం సానుకూలాంశమే అయినా అవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. ఇప్పటికీ సదరు అభ్యర్థి ఎఫ్-1 స్టూడెంట్ వీసా స్టేటస్‌లోనే కొనసాగుతున్నారు. గ్రీన్ కార్డ్ చేతికి వచ్చే వరకు కెరీర్ , వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ధీమా ఉండదు. ఏ క్షణంలో ఏ మార్పు వస్తుందో అన్న భయం వలసదారులను వేధిస్తోంది.

జాప్యానికి కారణాలు ఏమిటి?

వలస నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ జాప్యానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. యూఎస్.సీఐఎస్ కి చెందిన కొన్ని ఫీల్డ్ ఆఫీసులు వేగంగా పని చేస్తాయి. మరికొన్ని ఆఫీసుల్లో దరఖాస్తుల భారం ఎక్కువగా ఉండటం వల్ల ఏళ్ల తరబడి సమయం పడుతుంది. అభ్యర్థి స్థానిక కాంగ్రెస్ ప్రతినిధి ద్వారా విచారణ జరిపించినా యూఎస్.సీఐఎస్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం.. వ్యవస్థలో ఉన్న పారదర్శకత లోపాన్ని సూచిస్తోంది.

బాధితులకు ఉన్న మార్గాలేమిటి?

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు చట్టపరమైన నిపుణుల సలహా మేరకు నడుచుకోవాలి. మొదటి ఇంక్వైరీ జరిగి చాలా కాలం అయినందున, మరోసారి ప్రజా ప్రతినిధుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం ముఖ్యం. ప్రభుత్వం తన విధిని సక్రమంగా నిర్వహించనప్పుడు కోర్టు ద్వారా ఆదేశాలు జారీ చేయించడం. ఇది యూఎస్.సీఐఎస్ ని నిర్ణయం తీసుకునేలా నిర్బంధిస్తుంది. ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల సలహాతో కేసులో సాంకేతిక లోపాలు ఏవైనా ఉన్నాయేమో సరిచూసుకోవడం అవసరం.

ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములవుతూ చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకున్న వలసదారులు ఇలాంటి అనిశ్చితిని ఎదుర్కోవడం దురదృష్టకరం. 19 నెలల నిరీక్షణ అనేది కేవలం సమయానికి సంబంధించింది కాదు.. అది ఒక వ్యక్తి భవిష్యత్తు , మానసిక ప్రశాంతతకు సంబంధించింది. ఇప్పటికైనా యూఎస్.సీఐఎస్ తన ప్రాసెసింగ్ సమయాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.