Begin typing your search above and press return to search.

అమెరికా దుకాణం తెరుచుకునేది ఎప్పుడు? ప్రజల జీవితాలు ఫణం..

అమెరికాలో ప్రభుత్వ ప్రతిష్ఠంభన (గవర్నమెంట్ షట్ డౌన్) 33వ రోజుకు చేరింది. కాంగ్రెస్‌ నిధుల విడుదల చట్టాన్ని ఆమోదించకపోవడంతో ఫెడరల్‌ ప్రభుత్వ సేవలు స్తంభించిపోయాయి.

By:  A.N.Kumar   |   4 Nov 2025 10:21 AM IST
అమెరికా దుకాణం తెరుచుకునేది ఎప్పుడు? ప్రజల జీవితాలు ఫణం..
X

అమెరికాలో ప్రభుత్వ ప్రతిష్ఠంభన (గవర్నమెంట్ షట్ డౌన్) 33వ రోజుకు చేరింది. కాంగ్రెస్‌ నిధుల విడుదల చట్టాన్ని ఆమోదించకపోవడంతో ఫెడరల్‌ ప్రభుత్వ సేవలు స్తంభించిపోయాయి. పాలక రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య చర్చలు నిలిచిపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం తాత్కాలికంగా మూతబడిన స్థితిలో ఉంది.

ఈ స్థితి వల్ల లక్షలాది ఫెడరల్‌ ఉద్యోగులు జీతాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా సుమారు 4.2 కోట్ల పేద అమెరికన్లకు ప్రభుత్వం అందించే ఆహార సహాయం నిలిచిపోయే ప్రమాదం నెలకొంది.

ఒబామా కేర్‌ వివాదం మూలం

ఈ ప్రతిష్ఠంభనకు ప్రధాన కారణం పూర్వ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రవేశపెట్టిన అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణ చట్టం (Obama Care). ఈ చట్టానికి సంబంధించిన సబ్సిడీలు ఈ ఏడాది చివరికి ముగియనున్నాయి. డెమోక్రాట్లు ఈ సబ్సిడీలను కొనసాగించాలన్న డిమాండ్‌ చేస్తున్నారు. అయితే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం దీనికి కట్టుబడి ఉండరని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌లో సీట్ల గణితం

ఫెడరల్‌ నిధుల చట్టం అమలుకు సెనెట్‌లో 60 ఓట్లు అవసరం. ప్రస్తుతం రిపబ్లికన్లకు 53 సీట్లు, డెమోక్రాట్లకు 45 సీట్లు, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. చట్టం ఆమోదం పొందాలంటే కనీసం అయిదుగురు డెమోక్రాట్లు రిపబ్లికన్ల వైపు నిలవాల్సి ఉంది. కానీ ఆరోగ్య చట్టం విషయంలో డెమోక్రాట్లు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.

ట్రంప్‌ వైఖరిపై విమర్శలు

డెమోక్రాట్లతో బేరమాడే ప్రసక్తే లేదని ట్రంప్‌ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. చివరికి వారే ఒప్పుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ వైఖరిపై ప్రతిపక్షం తీవ్రంగా స్పందించింది. “ప్రజల జీవితాలతో రాజకీయాలు ఆడకండి” అని డెమోక్రాట్లు అధ్యక్షుడిపై దుయ్యబట్టారు.

పరిష్కారం దిశగా దారి ఉందా?

ప్రతిష్ఠంభన మరింత సాగితే ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. పలు ఫెడరల్‌ సేవలు, ప్రయాణ అనుమతులు, పన్ను రీఫండ్‌లు, పరిశోధనా ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ ‘దుకాణం’ మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు కానీ, రిపబ్లికన్లు–డెమోక్రాట్ల మధ్య చర్చలు మళ్లీ మొదలవ్వకపోతే అమెరికా ప్రజల కష్టాలు ఇంకా కొనసాగడం ఖాయం.