విమానం హైజాక్ టెన్షన్... పైలెట్లు ఏమి చేశారంటే..!
వివరాళ్లోకి వెళ్తే... అమెరికా ఎయిర్ లైన్స్ 'స్కైవెస్ట్' కు చెందిన 6469 విమానం.. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:45 గంటలకు లాస్ ఏంజిల్స్ కు బయలుదేరింది.
By: Raja Ch | 22 Oct 2025 10:07 AM ISTవిమానంలో ఒక్కసారిగా హైజాక్ టెన్షన్ పడ్డారు పైలెట్లు. కాక్ పీట్ లోకి ఎవరో బలవంతంగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారని పైలెట్లు భావించారు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. తీరా అసలు విషయం తెలుసుకున్న అనంతరం.. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... అమెరికాలో ఓ ప్లైట్ ను బయలుదేరిన 40 నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కాక్ పిట్ లోకి ఎవరో బలవంతంగా వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు భావించిన పైలట్లు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అనంతరం.. సమస్య ఏమీ లేదని.. కాక్ పీట్ లోకి బలవంతంగా వచ్చే ప్రయత్నం ఎవరూ చేయలేదని.. సిబ్బందే పైలెట్లను సంప్రదించడానికి మాత్రమే ప్రయత్నించారని తేలింది.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికా ఎయిర్ లైన్స్ 'స్కైవెస్ట్' కు చెందిన 6469 విమానం.. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:45 గంటలకు లాస్ ఏంజిల్స్ కు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా ఇంటర్ కామ్ ఫోన్ పనిచేయకపోవడంతో సిబ్బందితో మాట్లాడేందుకు పైలట్లు ప్రయత్నించగా కమ్యూనికేషన్ సాధ్యం కాలేదు.
దీంతో పైలట్లతో మాట్లాడేందుకు ప్రయత్నించే క్రమంలో విమాన సిబ్బంది కాక్ పిట్ డోర్ ను కొట్టారు. అయితే.. పైలట్లు మాత్రం దాన్ని మరోలా అర్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా... ఎవరో కాక్ పిట్ లోకి బలవంతంగా ప్రవేశించేందుకు డోర్ ను కొడుతున్నారని, విమానాన్ని హైజాక్ చేయాలని భావిస్తున్నట్లున్నారని భయాందోళనకు గురయ్యారు.
దీంతో మరో ఆలోచన లేకుండా.. వెంటనే విమాన మార్గాన్ని మళ్లించి నెబ్రస్కాలోని ఒమాహాలో ఉన్న ఎప్లీ ఎయిర్ ఫీల్డ్ లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం పోలీసులు వచ్చి తనిఖీలు చేశారు. అయితే విమాన సిబ్బందే కాక్ పిట్ డోర్ కొట్టారని.. ఆ విషయం తెలియక పైలెట్లు ఆందోళన చెందారని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్... 'అక్టోబర్ 20, సోమవారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:45 గంటల ప్రాంతంలో నెబ్రాస్కాలోని ఒమాహాలోని ఎప్లీ ఎయిర్ ఫీల్డ్ కు తిరిగి వచ్చిన తర్వాత స్కైవెస్ట్ ఫ్లైట్ 6569 సురక్షితంగా ల్యాండ్ అయింది. పైలట్ క్యాబిన్ సిబ్బందిని సంప్రదించలేకపోవడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు' అని తెలిపింది.
విమానాన్ని ఢీకొట్టిన మిస్టీరియస్ వస్తువు!:
మరో వింత సంఘటనలో.. గత వారం డెన్వర్ నుండి లాస్ ఏంజిల్స్ కు వెళుతున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం (యూఏ1093) విండ్ షీల్డ్ ను ఓ వింత వస్తువు ఢీకొట్టింది! అయితే ఆ వింత వస్తువు ఏమిటనే విషయంపై స్పష్టత రాలేదని అంటున్నారు. అది వెదర్ బెలూన్ అయ్యి ఉండొచ్చని మరోవైపు చెబుతునారు. దీంతో.. 134 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
ఆ తర్వాత వారిని వేరే విమానంలో వారి గమ్యస్థానానికి తరలించారు. విమానం 36,000 అడుగుల ఎత్తులో ఉంగా జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి జాతీయ రవాణా భద్రతా బోర్డుతో కలిసి పనిచేస్తున్నట్లు స్మార్ట్ వెదర్ బెలూన్ కంపెనీ విండ్ బోర్న్ సిస్టమ్స్ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
