Begin typing your search above and press return to search.

ఎంతవరకన్నా వెళ్తాము...గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ సంచలన ప్రకటన!

డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు.

By:  A.N.Kumar   |   10 Jan 2026 12:01 PM IST
ఎంతవరకన్నా వెళ్తాము...గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ సంచలన ప్రకటన!
X

ట్రంప్ తాను పట్టిన కుందేలు కు మూడేకాళ్లు అని అంటున్నాడు. తా వలచింది రంభ అన్నట్టు ఇప్పుడు నాటో దేశం డెన్మార్క్ చేతుల్లోని గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని స్పష్టమైన ప్రకటన చేశారు. నాటోకు అండగా ఉంటామని.. తమ కోరికలు తీర్చాలని.. ఒకవేళ రష్యా, చైనా గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకుంటే తాము కలుగచేసుకోమని.. అందుకే తమకు ఇచ్చేస్తే రక్షణ పరంగా బాగుంటుందని ట్రంప్ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు వేడెక్కాయి. డెన్మార్క్ ఏం చేస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకునే ఆయన.. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ ద్వీపాన్ని అమెరికాలో భాగం చేయాలనే పాత ప్రతిపాదనను మరింత దూకుడుగా ముందుకు తెచ్చారు. కేవలం ప్రతిపాదనే కాకుండా అవసరమైతే కఠిన నిర్ణయాలకైనా సిద్ధమని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

సాంకేతికంగా గ్రీన్‌లాండ్ అనేది డెన్మార్క్ పరిధిలోని ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం. గతంలో ట్రంప్ ఈ ద్వీపాన్ని కొనుగోలు చేస్తామని ప్రతిపాదించినప్పుడు డెన్మార్క్ ప్రభుత్వం దానిని తీవ్రంగా తోసిపుచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్ స్థానిక నాయకత్వం డెన్మార్క్‌ను పక్కన పెట్టి నేరుగా అమెరికాతో చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇది డెన్మార్క్-అమెరికా మధ్య దౌత్యపరమైన చిచ్చు పెట్టే అవకాశం ఉంది.

భారీ ఆఫర్.. పౌరసత్వం.. నగదు ప్రోత్సాహకాలు

గ్రీన్‌లాండ్ ప్రజలను ఆకట్టుకోవడానికి అమెరికా ఒక భారీ ప్యాకేజీ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రీన్‌లాండ్‌లో నివసించే వారికి నేరుగా అమెరికా సిటిజన్‌షిప్ కల్పించనున్నారు.. ఒక్కో పౌరుడికి సుమారు 100,000 డాలర్లు (రూ. 80 లక్షలకు పైగా) నగదు ప్రోత్సాహకం అందించే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా స్థానిక ప్రజల మద్దతు కూడగట్టి విలీన ప్రక్రియను సులభతరం చేయాలని అమెరికా భావిస్తోంది.

రష్యా - చైనా ముప్పు.. ఆర్కిటిక్ రాజకీయాలు

ట్రంప్ ఈ నిర్ణయాన్ని కేవలం భూభాగ విస్తరణగా చూడటం లేదు.. దీనిని జాతీయ భద్రతతో ముడిపెడుతున్నారు.ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా నౌకల కదలికలు పెరిగాయని ఆయన ఆరోపిస్తున్నారు. అమెరికా కనుక గ్రీన్‌లాండ్‌ను తన ఆధీనంలోకి తీసుకోకపోతే శత్రు దేశాలు ఆ ప్రాంతాన్ని ఆక్రమించి అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు. చర్చలు ఫలించకపోతే కఠిన మార్గాలను అనుసరించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేయడం సంచలనంగా మారింది.

మార్కో రూబియో రంగ ప్రవేశం

వచ్చే వారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గ్రీన్‌లాండ్, డెన్మార్క్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో విలీన ప్రతిపాదనలు, భద్రతా ఒప్పందాల గురించి కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ తన నమ్మకస్థుడైన రూబియోను ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దించడం చూస్తుంటే ఈసారి అమెరికా చాలా సీరియస్‌గా ఉన్నట్లు అర్థమవుతోంది.

వెనెజువెలా చమురుపై ప్రకటన

ఇదే సమయంలో వెనెజువెలా అంశాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు. వెనెజువెలాలో ఉన్న అపారమైన చమురు నిల్వలను వెలికితీయడం ద్వారా అటు ఆ దేశ ప్రజలకు, ఇటు అమెరికాకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. అమెరికా చమురు కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెడితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గుతాయని ఆయన తన ఆర్థిక అజెండాను వివరించారు.

ఇదొక చరిత్రాత్మక మలుపా?

అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక దేశంలోని భాగాన్ని మరో దేశం కొనుగోలు చేయడం లేదా స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ ట్రంప్ తన 'అమెరికా ఫస్ట్' విధానంలో భాగంగా అసాధ్యాలను సుసాధ్యం చేయాలని చూస్తున్నారు. గ్రీన్‌లాండ్ గనుక అమెరికా చేతికి వస్తే అది 1867లో రష్యా నుండి అలస్కాను కొనుగోలు చేసిన తర్వాత అతిపెద్ద చరిత్రాత్మక పరిణామం అవుతుంది.