Begin typing your search above and press return to search.

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్యలో అమెరికా డ్రోన్లు.. ఏమిటీ అసలు గుట్టు!

ఇటీవల అఫ్గనిస్థాన్‌-పాకిస్థాన్‌ మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సైనికులతో పాటు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు.

By:  Raja Ch   |   30 Oct 2025 6:00 PM IST
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్  మధ్యలో అమెరికా డ్రోన్లు.. ఏమిటీ అసలు గుట్టు!
X

ఇటీవల అఫ్గనిస్థాన్‌-పాకిస్థాన్‌ మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సైనికులతో పాటు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. అయితే... టర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో కొన్ని రోజులు కాల్పుల విరమణ జరిగింది. అయితే తాజాగా టర్కీ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. అయితే అందుకు కారణం అమెరికా డ్రోన్లు అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... సరిహద్దుల్లో కాల్పుల విరమణ, సీమాంతర ఉగ్రవాదం, మొదలైన అంశాలపై ఈ రెండు దేశాల మధ్య శనివారం టర్కీ వేదికగా చర్చలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇవి విఫలమైనట్లు తాజాగా పాకిస్థాన్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా స్పందించిన పాక్‌ సమాచార, ప్రసార శాఖ మంత్రి అతావుల్లా తరార్‌.. చర్చల్లో ఎలాంటి పరిష్కారమూ కనుగొనలేకపోయామని, అవి విఫలమయ్యాయని తెలిపారు.

అసలు విషయం చెప్పిన ఆఫ్గన్ మీడియా!:

టోలో న్యూస్ నివేదిక ప్రకారం.. ఆఫ్ఘన్ గగనతలాన్ని ఇస్లామాబాద్ ఉల్లంఘించడం ఆపివేసి, అమెరికా డ్రోన్ విమానాలను నిరోధించినట్లయితే.. పాకిస్తాన్‌ పై దాడులకు తమ భూభాగాన్ని ఉపయోగించకుండా నిరోధించడానికి ఆఫ్గనిస్తాన్ కట్టుబడి ఉంటుందని చర్చలు జరిపిన వారు తెలిపారు. అయితే... ఈ షరతుకు పాకిస్తాన్ అంగీకరించడానికి నిరాకరించిందని ఆఫ్గన్ మీడియా ఒక మూలాన్ని ఉటంకిస్తూ తెలిపింది.

ఇదే సమయంలో... ఆఫ్గనిస్తాన్ లోపల నిఘా, సంభావ్య దాడుల కోసం డ్రోన్లు తన గగనతలంలో పనిచేయడానికి అనుమతించే మరో దేశంతో ఒప్పందంపై సంతకం చేసినట్లు పాకిస్తాన్ అంగీకరించిందని కాబూల్‌ కు చెందిన జర్నలిస్ట్ తమీమ్ బాహిస్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే.. చర్చల్లో మాత్రం అమెరికాతో చేసుకున్న ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించలేమని పాకిస్థాన్ పేర్కొందని టోలో న్యూస్ వెల్లడించింది.

ఇదే క్రమంలో... పాకిస్తాన్ సంధానకర్తలు మొదట్లో కొన్ని నిబంధనలను అంగీకరించారని.. అయితే, పాకిస్తాన్ హైకమాండ్‌ కు ఫోన్ కాల్ వచ్చిన తర్వాత తమ వైఖరిని మార్చుకున్నారని.. అమెరికా డ్రోన్‌ లపై తమకు నియంత్రణ లేదని, ఐసిస్‌ పై చర్య తీసుకునేలా చేయలేమని చెప్పారని ఆ వర్గాలు చెప్పాయని అది పేర్కొంది. ఈ సమాధానానికి ఖతార్, టర్కీ మధ్యవర్తులు కూడా ఆశ్చర్యపోయారని అది నివేదించింది.

భారత్ పై పాక్ ఆరోపణలు!:

ఇటీవల ఢిల్లీ - కాబూల్ మధ్య బంధం మరింత బలపడుతున్నాయని చెబుతోన్న వేళ పాకిస్థాన్ కడుపు తెగ మండిపోతుందనే చెప్పాలి. ఇప్పటికే ఢిల్లీ చెప్పినట్లుగా కాబూల్ ఆడుతుందని.. వారి తరుపున తాలిబన్లు తమపై ఫ్రాక్సీ యుద్ధం చేసున్నారని పాకిస్థాన్ పదే పదే ఆరోపించింది. ఈ క్రమంలో తాజాగా శాంతి చర్చలు విఫలమవ్వడంతో అందుకు భారత్ కారణమని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా స్పందించిన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పందిస్తూ... కాబూల్‌ లో తీగలను లాగుతూ, తోలుబొమ్మ ప్రదర్శన నిర్వహిస్తున్న వారిని ఢిల్లీ నియంత్రిస్తోందని అన్నారు. అయితే... పాకిస్తాన్ గడ్డను ఉపయోగించి అమెరికా డ్రోన్ దాడుల అంశంపై మాత్రం ఆసిఫ్ స్పందించలేదు!

మరోవైపు... తాలిబన్ పాలనను పూర్తిగా తుడిచిపెట్టి, వారిని తిరిగి గుహల్లోకి నెట్టేందుకు పాకిస్తాన్ తన పూర్తి ఆయుధశాలలో కొంత భాగాన్ని కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదని.. వారు కోరుకుంటే, తోరా బోరా వద్ద వారి ఓటమి దృశ్యాలు పునరావృతం కావడం ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు చూడటానికి ఒక దృశ్యం అవుతుందని ఖ్వాజా ఆసిఫ్ చెప్పారని కరాచీకి చెందిన డాన్ నివేదిక తెలిపింది.