Begin typing your search above and press return to search.

సంచలనం... గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష!

అవును... 2017లో చెరిత్ బ్రూక్ షూమేకర్ అనే మహిళ 24 నుంచి 26 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు ఇంట్లోనే ప్రసవం అయింది.

By:  Raja Ch   |   31 Dec 2025 9:00 PM IST
సంచలనం... గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష!
X

గర్భస్థ శిశువు మరణించిందనే కారణంతో ఓ తల్లికి కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించిందనే విషయం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. అమెరికాలో ఓ న్యాయస్థానం ఇచ్చిన ఈ సంచలన తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గర్భస్థ శిశువు మరణం కారణంగా తల్లిని ఈ స్థాయిలో శిక్షించడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి అయ్యి ఉండొచ్చనే చర్చా జరుగుతుంది. ఇందుకు గల కారణమూ సంచలనంగా మారింది.

అవును... 2017లో చెరిత్ బ్రూక్ షూమేకర్ అనే మహిళ 24 నుంచి 26 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు ఇంట్లోనే ప్రసవం అయింది. అనంతరం ఆమెను పారామెడిక్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో.. గర్భధారణ సమయంలో ఆమె పెథాంఫెటమైన్ వాడినట్లు అంగీకరించిందని.. శిశువును కెమికల్ డేంజర్ లో పడేసేలా ఆమె చేసినందని అభియోగాలు మోపబడ్డాయి. ఆమె మాదకద్రవ్యాలు వాడిందని ప్రాసిక్యూటర్లు బలంగా వాదించారు.

అకాల మరణం జరిగే రోజు వరకూ ఆమె డ్రగ్స్ వాడుతోందని.. ఆమె బాత్ టబ్ లో బిడ్డకు జన్మనిచ్చిందని.. అనంతరం శిశువును టవల్ లో చుట్టి, మూలన పడేసి, నేర స్థలాన్ని శుభ్రం చేసిందని మాజీ లీ కౌంటీ జిల్ల అటార్నీ బ్రాండన్ హ్యూస్ 2020లో చెప్పారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆమె అదే ఏడాది దోషిగా నిర్ధారించబడింది. దీంతో.. కోర్టు ఆమెకు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ క్రమంలో ఇప్పటికే ఆమె ఐదు సంవత్సరాలు జైలులో శిక్ష అనుభవించింది. ఈ సమయంలో ఆమెకు ప్రెగ్నెన్సీ జస్టిస్ అనే సంస్థ అండగా నిలిచింది. దీనిపై అలబామా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో... డ్రగ్స్ వాడకం వల్ల కాకుండా ఇన్ ఫెక్షన్ వల్లే మృత శిశువు జననం జరిగిందని కొత్త ఆధారాలు సమర్పించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆమె తరుపు న్యాయవాదులు ఈసారి కీలకమైన వాదన వినిపించినట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా... మెథాంఫెటమైన్ వాడకం వల్ల ప్రసవం జరిగిందనేందుకు ఎలాంటి రుజువు లేదని ఆమె న్యాయవాదులు వాధించారు. ఈ నేపథ్యంలో... 18 సంవత్సరాల జైలు శిక్ష విధించబడిన ఈ మహిళ శిక్షను అలబామా న్యాయమూర్తి రద్దు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన షూమేకర్... 'ఏళ్ల పోరాటం తర్వాత చివరకు నా మాటలు వినబడుతున్నందుకు కృతజ్ఞురాలిని.. నా తదుపరి క్రిస్మస్ కు నా పిల్లలు, తల్లితండ్రులతో ఇంట్లో ఉండాలని ప్రార్థిస్తున్నాను' అని తెలిపారు.

కాగా... గర్భిణీల హక్కుల కోసం పోరాడే లాభాపేక్షలేని సంస్థ అయిన ప్రెగ్నెన్సీ జస్టిస్.. జూన్ 2022 నుంచి జూన్ 2024 వరకూ మరే ఇతర రాష్ట్రంలో లేని స్థాయిలో అలబామా రాష్ట్రంలో ఎక్కువ మంది గర్భిణీ స్రీలను అరెస్ట్ చేశారని అక్టోబరు లోని ఒక నివేదికలో పేర్కొంది. అయితే ఈ అరెస్టుల్లో ఎక్కువ భాగం మాదకద్రవ్యాల వాడకంతో కూడుకున్నవని వెల్లడించింది.