Begin typing your search above and press return to search.

7.5 లక్షల ఉద్యోగులు వేతనం లేకుండా ఇంటికే.. అమెరికాలో తీవ్ర సంక్షోభం..

అప్పటి నుంచి భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న ఏ దేశం కూడా అభివృద్ధిలో ముందుకు కదలలేదు సరికదా.. కనీసం ప్రశాంతంగా ఉన్న దాఖలాలు లేవు.

By:  Tupaki Political Desk   |   1 Oct 2025 12:26 PM IST
7.5 లక్షల ఉద్యోగులు వేతనం లేకుండా ఇంటికే.. అమెరికాలో తీవ్ర సంక్షోభం..
X

2014 తర్వాత మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న ఏ దేశం కూడా అభివృద్ధిలో ముందుకు కదలలేదు సరికదా.. కనీసం ప్రశాంతంగా ఉన్న దాఖలాలు లేవు. మొదట శ్రీలంక తాము చైనాతోనే ఉంటామని చెప్పింది. ఆ దేశం ఏమైందో చూశాం. ఆ తర్వాత మాల్డీవులు.. అది కూడా, ఇక పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రొట్టెల పిండి కోసం కొట్లాటలు తప్పలేదు. పొరుగున బంగ్లాదేశ్ ఇక ఇప్పట్లో కోలుకునేలా లేదు. సమీపంలోని నేపాల్ ఇలా ప్రతీది నాశనం అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా వంతు అన్నట్లు ఉంది.

అమెరికాలో సంక్షోభం

టారీఫ్ ల పేరుతో భారత్ ను వేధించినందుకు అమెరికా ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. దాని పాపం దానికే అని మనం ఊరుకున్నాం.. కానీ అనతి కాలంలో అక్కడ కూడా సంక్షోభం ఎదురవుతుంది. అమెరికా వంటి అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా మూతపడడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆరేళ్ల తర్వాత అమెరికాలో సంక్షోభం చోటు చేసుకుంది. నిధుల బిల్లుపై కాంగ్రెస్‌లోని రిపబ్లికన్‌, డెమొక్రటిక్‌ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఫలితంగా ప్రభుత్వం షట్ డౌన్ అయ్యింది. అమెరికన్ల నిత్యజీవితానికి కీలకమైన సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. లక్షలాది ఉద్యోగుల వేతనం లేకుండా ఇంటికే పరిమితమవ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలను, పార్టీల అహంకారాలను బహిర్గతం చేస్తోంది.

అసలు కారణం ఇదే..

ప్రతి ఏటా అక్టోబర్‌ 1వ తేదీ అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభిస్తుంది. దీనికి అవసరమైన నిధులను ఆ దేశ కాంగ్రెస్‌ ఆమోదించాలి. ఈసారి రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టగా, డెమొక్రాట్లు ఆరోగ్య బీమా సబ్సిడీల పొడిగించాలని పట్టుబట్టారు. కానీ రిపబ్లికన్లు ఆ అంశం బడ్జెట్‌ చర్చల్లో కాకుండా వేరు చేయాలని పట్టుబట్టారు. రెండు వైపులా ఎవరూ తగ్గకపోవడంతో, బిల్లు ఆమోదం పొందలేదు. ఫలితంగా నిధుల విడుదల నిలిచిపోయింది.

రాజకీయాల ఆట..

‘షట్‌డౌన్‌ వల్ల ఉద్యోగాలు పోతే, దానికి డెమొక్రాట్లే కారణం అవుతారు’ అని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ స్వయంగా చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత దిగజార్చింది. దేశాధినేత ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి. పరిస్థితిని చక్కదిద్దడం పోయి ఆందోళన, భయాలను ప్రజలపై రుద్దడంతో అమెరికన్లు ఖంగారు పడుతున్నారు.

వీరిపై ప్రభావం పడే అవకాశం..

7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వేతనం లేకుండా సెలవుపై వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు.

అమెరికా మొత్తంగా పార్కులు, మ్యూజియంలు మూసి వేస్తారు.

వీసా ప్రాసెసింగ్, రుణాల మంజూరు, పరిశోధనలు పూర్తిగా నిలిచిపోతాయి.

పౌర సేవలైన తాగునీటి అందజేత, పారిశుధ్యం, ఇంకా చాలా వరకు సేవలు ఆలస్యం అవుతాయి.

అయితే సైన్యం, సరిహద్దు భద్రత, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వంటి అత్యవసర సేవలకు మాత్రం ఎలాంటి భంగం వాటిల్లదు. కానీ ఉద్యోగులకు మాత్రం వేతనాలు కొంత ఆలస్యం కావచ్చు. దీని వల్ల్ ప్రజా జీవన ప్రమాణం దెబ్బతినడమే కాకుండా, ప్రభుత్వంపై విశ్వాసం దెబ్బతింటుంది.

గతంలో షట్ డౌన్ల చరిత్ర..

1981 నుంచి ఇప్పటి వరకు అమెరికా 15 సార్లు షట్‌డౌన్‌ ఎదుర్కొంది. సాధారణంగా ఇది కొన్ని రోజులు మాత్రమే కొనసాగాయి. 2018లో ట్రంప్‌ హయాంలో ‘బోర్డర్‌ వాల్’ డిమాండ్‌పై 35 రోజులపాటు షట్‌డౌన్‌ జరిగింది. ఇది అమెరికా చరిత్రలో సుదీర్ఘమైనదిగా చెప్తారు.

ప్రపంచంలో ఎలాంటి మార్పులు జరగవచ్చు..

అమెరికా ఒక సూపర్‌ పవర్‌ నేషన్. అక్కడి ఆర్థిక వ్యవస్థలో తలెత్తే చిన్నపాటి ఆటుపోటు గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. డాలర్‌ బలహీన పడితే.. వాణిజ్య అస్థిరత, పెట్టుబడులు తగ్గుతాయి. చైనా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు దీనిని అవకాశంగా తీసుకోవచ్చు. కాబట్టి షట్‌డౌన్‌ అనేది కేవలం అమెరికా అంతర్గత సమస్య కాదు.. ప్రపంచానికి కూడా ఆర్థిక సంకేతాలు పంపుతుంది.