Begin typing your search above and press return to search.

ట్రంప్ టారిఫ్ లతో మునుగుతున్న అమెరికన్ కంపెనీలు?

ముఖ్యంగా చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అగ్రరాజ్యానికి చెందిన కంపెనీలు కొత్త టారిఫ్‌ల ప్రభావంతో నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

By:  A.N.Kumar   |   10 Sept 2025 11:00 PM IST
ట్రంప్ టారిఫ్ లతో మునుగుతున్న అమెరికన్ కంపెనీలు?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇతర దేశాలపై సుంకాల భారం మోపి అమెరికాకు అదనపు ఆదాయం రాబట్టాలని ప్రయత్నించినా… ఆ ఝలక్‌ ఎక్కువగా అమెరికన్‌ కంపెనీలకే తగులుతోందని తాజాగా బయటపడింది. ముఖ్యంగా చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అగ్రరాజ్యానికి చెందిన కంపెనీలు కొత్త టారిఫ్‌ల ప్రభావంతో నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

షాంఘైలోని అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవం స్పష్టమైంది. సర్వేలో పాల్గొన్న 254 కంపెనీలలో దాదాపు మూడోవంతు సంస్థలు.. కొత్త సుంకాల కారణంగా తమ అంచనా ఆదాయం తగ్గిపోతుందని స్పష్టం చేశాయి. ముఖ్యంగా చైనాతో నేరుగా వ్యాపారం జరిపే రసాయన, ముడిసరుకు దిగుమతి చేసుకునే కంపెనీలు ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.

ట్రంప్‌ తొలుత చైనా దిగుమతులపై 30 శాతం అదనపు సుంకాలు విధించగా… వాటిని తర్వాత 145 శాతానికి పెంచారు. దీనికి ప్రతిగా చైనా కూడా 10 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధించింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తింది. అయితే మేలో ఇరు దేశాధినేతలు పరస్పర సుంకాలను తగ్గించుకోవాలని నిర్ణయించినప్పటికీ, అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.

సర్వే వివరాలను వెల్లడించిన షాంఘై ఛాంబర్‌ అధ్యక్షుడు ఎరిక్‌ షెంగ్‌ మాట్లాడుతూ “సుంకాలు మా కార్యకలాపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించుకోవడంలో అనిశ్చితి పెద్ద సవాలుగా మారింది” అని అన్నారు.

ఇక బ్యాంకింగ్‌, కొన్నిరకాల సర్వీస్‌ రంగాల్లో సుంకాల ప్రభావం పెద్దగా కనిపించడం లేదని సర్వే చెబుతోంది. కానీ మిగతా పరిశ్రమలు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

అమెరికా అధ్యక్షుడు అత్యవసర చట్టాల కింద టారిఫ్‌లు విధించడంపై ఇప్పటికే పలు కోర్టులు అవి చెల్లుబాటు కావని తీర్పునిచ్చాయి. అయితే ట్రంప్‌ ప్రభుత్వం ఈ తీర్పులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మొత్తం చూస్తే ట్రంప్‌ సుంకాలు చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి కంటే అమెరికా స్వదేశీ కంపెనీలకే పెద్ద బొక్కా అవుతున్నాయనేది వాస్తవం.