Begin typing your search above and press return to search.

కిమ్ జాంగ్ ఉన్‌ను 'పంది' అని తిడితేనే జాబ్.. అమెరికా ఐటీ కంపెనీల వ్యూహమిదీ

ఈ గూఢచారులను ఏరిపారేయడానికి అమెరికా కంపెనీలు ఇప్పుడు అత్యంత విచిత్రమైన, వివాదాస్పదమైన 'లాయల్టీ టెస్టుల'ను నిర్వహిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   8 April 2026 12:41 PM IST
కిమ్ జాంగ్ ఉన్‌ను పంది అని తిడితేనే జాబ్.. అమెరికా ఐటీ కంపెనీల వ్యూహమిదీ
X

అమెరికా సాంకేతిక రంగం ప్రస్తుతం ఒక వింతైన.. అంతకంటే భయానకమైన భద్రతా సవాలును ఎదుర్కొంటోంది. సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ ఐటీ కంపెనీల నుంచి సాఫ్ట్‌వేర్ స్టార్టప్‌ల వరకు ఇప్పుడు అంతర్గత ముప్పు భయంతో వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర కొరియాకు చెందిన గూఢచారులు నకిలీ గుర్తింపులతో అమెరికా కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతుండటం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ గూఢచారులను ఏరిపారేయడానికి అమెరికా కంపెనీలు ఇప్పుడు అత్యంత విచిత్రమైన, వివాదాస్పదమైన 'లాయల్టీ టెస్టుల'ను నిర్వహిస్తున్నాయి.

గూఢచర్యం కోసం 'ఉద్యోగ' వేట

సాధారణంగా హ్యాకర్లు కంపెనీ సర్వర్లపై దాడులు చేసి డేటాను దొంగిలిస్తారు. కానీ ఉత్తర కొరియా ఒక అడుగు ముందుకు వేసి తమ ఐటీ నిపుణులను నకిలీ పాస్‌పోర్టులు.. ఇతర దేశాల పౌరసత్వ పత్రాలతో అమెరికా కంపెనీలకు పంపిస్తోంది. వీరు అద్భుతమైన టెక్నికల్ స్కిల్స్‌తో ఇంటర్వ్యూలను సులభంగా దాటేసి నెలకు వేల డాలర్ల జీతానికి ఉద్యోగాల్లో చేరుతున్నారు. లోపలికి ప్రవేశించిన తర్వాత వారు కంపెనీల కోడ్, కస్టమర్ల వ్యక్తిగత సమాచారం.. ఆర్థిక లావాదేవీల డేటాను దొంగిలించి కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు.. భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లుతోంది.

వింత టెస్ట్.. కిమ్‌ను దూషించాల్సిందే!

ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి అమెరికా రిక్రూటర్లు ఒక వినూత్నమైన మజిలీని రూపొందించారు. టెక్నికల్ రౌండ్లు పూర్తయిన తర్వాత అభ్యర్థి నమ్మకాలను పరీక్షించడానికి ఒక వింత ప్రశ్నను సంధిస్తున్నారు. "ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌ను ఒక 'లావు పంది' అని తిట్టండి" అని అడుగుతున్నారు. మొదటి చూపులో ఇది హాస్యాస్పదంగా అనిపించినా దీని వెనుక బలమైన సైకలాజికల్ కారణం ఉంది. ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్‌ను ఒక దేవుడిలా చూస్తారు. అక్కడి ప్రజల మెదళ్లలో చిన్నప్పటి నుంచే ఆయన పట్ల అచంచలమైన భక్తిని నింపుతారు. కిమ్‌ను నిందించడం లేదా అవమానించడం ఉత్తర కొరియా చట్టాల ప్రకారం రాజద్రోహం. దీనికి మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది. ఉత్తర కొరియా గూఢచారి ఎంత శిక్షణ పొందినా కిమ్ గురించి బహిరంగంగా అపశబ్దాలు పలకడానికి అతని అంతరాత్మ ఒప్పుకోదు. ఆ ఒక్క క్షణం తడబాటు లేదా నిరాకరణే వారిని పట్టించేస్తుంది.

తారో ఐకూచి ఘటన.. బయటపడ్డ అసలు రంగు

ఇటీవల 'టారో ఐకూచి' అనే అభ్యర్థి ఇంటర్వ్యూలో ఇదే తరహా పరీక్ష ఎదురైంది. అన్ని సాంకేతిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన అతను కిమ్ గురించి మాట్లాడమనే సరికి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సమాధానం చెప్పలేక విపరీతమైన ఒత్తిడికి లోనై ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు. ఈ ప్రవర్తనపై అనుమానం వచ్చిన భద్రతా సంస్థలు అతని గత చరిత్రను తవ్వి తీయగా అతను ఉత్తర కొరియా నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.

భద్రత వర్సెస్ నైతికత

అయితే ఇలాంటి పరీక్షలు ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా మొదలైంది. ఒక దేశ నాయకుడిని వ్యక్తిగతంగా దూషించమని కోరడం ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ సంప్రదాయాలకు విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు. కానీ సైబర్ సెక్యూరిటీ నిపుణులు మాత్రం దీన్ని సమర్థిస్తున్నారు. "సాధారణ హ్యాకింగ్ కంటే కంపెనీ లోపల శత్రువు ఉండటం అత్యంత ప్రమాదకరం. దేశ భద్రత దృష్ట్యా ఇలాంటి అసాధారణ పద్ధతులు తప్పవు" అని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం అమెరికా కంపెనీలు కేవలం బ్యాక్‌గ్రౌండ్ చెక్ మీదనే ఆధారపడకుండా అభ్యర్థుల ప్రవర్తన తీరును నిశితంగా గమనిస్తున్నాయి. జూమ్ ఇంటర్వ్యూల సమయంలో అభ్యర్థి వెనుక ఉన్న పరిసరాలు, వారి మాట తీరు.. ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు వారు స్పందించే విధానాన్ని విశ్లేషించడానికి ఏఐ టూల్స్‌ను కూడా వాడుతున్నారు. సాంకేతిక యుద్ధం ఇప్పుడు కోడింగ్ నుంచి మానసిక విశ్లేషణ వరకు చేరుకుంది అనడంలో సందేహం లేదు.