పన్నులు, రాజకీయాలు.. పౌరసత్వం వదిలేస్తున్న అమెరికన్లు!
పన్నులతో పాటు అమెరికా రాజకీయాల తీరు, దేశంలో పెరుగుతున్న విభజనలు, క్యాపిటల్ భవనం అల్లర్లు, గన్ కల్చర్ పెరుగడం వంటి అంశాలు కూడా ఈ నిర్ణయాల వెనుక ఉన్నాయి.
By: A.N.Kumar | 26 Oct 2025 7:00 AM ISTఅమెరికా పౌరసత్వం అంటే ప్రపంచంలోని అనేక మందికి కల. కానీ ఆ కలను నెరవేర్చుకున్న కొందరు ఇప్పుడు ఆ పౌరసత్వాన్నే వదులుకుంటున్నారు. విదేశాల్లో నివసిస్తున్న వేలాది మంది అమెరికన్లు తమ దేశ పౌరసత్వాన్ని విడిచిపెడుతున్న ఘటనలు ఇటీవల సంవత్సరాల్లో పెరుగుతున్నాయి. దీనికి కారణాలు కేవలం పన్నులు లేదా చట్టాలు మాత్రమే కాకుండా, రాజకీయాలు.. సామాజిక పరిస్థితులపై ఉన్న అసంతృప్తి కూడా అని నిపుణులు చెబుతున్నారు.
ఓ అమెరికా వార్తా సంస్థ అంచనా ప్రకారం, ప్రతి ఏడాది సగటున 5 నుండి 6 వేల మంది ప్రవాస అమెరికన్లు తమ పౌరసత్వాన్ని త్యజిస్తున్నారు. గ్రీన్‌బ్యాక్ అనే అంతర్జాతీయ సర్వే సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో కూడా ఇదే ధోరణి వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం, 2024లో అమెరికా పౌరసత్వం వదులుకోవాలనుకున్న వారి శాతం 30%గా ఉండగా, 2025లో అది 49%కు పెరిగింది. అంటే దాదాపు సగం మంది ప్రవాస అమెరికన్లు భవిష్యత్తులో తమ పౌరసత్వాన్ని వదిలివేయాలనే ఆలోచనలో ఉన్నారు.
పన్నులే ప్రధాన కారణం
సర్వేలో పాల్గొన్న వారిలో 61% మంది పన్నుల విధానమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. అమెరికా పౌరులు ఎక్కడ ఉన్నా కెనడా, యూరప్ లేదా ఆసియా ప్రతి సంవత్సరం అమెరికా ప్రభుత్వానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయాల్సిందే. ఈ నియమం పాటించకపోతే భారీ జరిమానాలు పడతాయి. ఈ విధానం అనేక ప్రవాస అమెరికన్లకు భారంగా మారింది. అదనంగా పన్నుల లెక్కలు, ఫార్మ్‌లు, డాక్యుమెంటేషన్ వంటి లాజిస్టికల్ సమస్యలు కూడా వారికి తలనొప్పిగా మారుతున్నాయి.
రాజకీయాలు, సామాజిక పరిస్థితులు కూడా కారణమే
పన్నులతో పాటు అమెరికా రాజకీయాల తీరు, దేశంలో పెరుగుతున్న విభజనలు, క్యాపిటల్ భవనం అల్లర్లు, గన్ కల్చర్ పెరుగడం వంటి అంశాలు కూడా ఈ నిర్ణయాల వెనుక ఉన్నాయి. సర్వేలో 51% మంది ఈ కారణాల వల్లే పౌరసత్వాన్ని వదులుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. "ఇప్పటి అమెరికా మన విలువలకు సరిపోవడం లేదు" అనే భావన కూడా కొందరిలో పెరుగుతోంది.
పెరుగుతున్న విచారణలు
కెనడాకు చెందిన ఓ ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ ప్రకారం.. 2025 జనవరిలోనే అమెరికా పౌరసత్వం వదులుకునే అంశంపై విచారణల సంఖ్య 300% పెరిగింది. అంటే, ప్రజలు కేవలం ఆలోచించడమే కాదు, దిశగా చర్యలు కూడా ప్రారంభించారు.
ఒకప్పుడు అమెరికా పౌరసత్వం పొందడం జీవితంలో పెద్ద సాధనంగా భావించేవారు. కానీ ఇప్పుడు అదే పౌరసత్వాన్ని వదిలిపెట్టడం ఒక పెద్ద ధోరణిగా మారింది. పన్నులు, చట్టపరమైన అడ్డంకులు, రాజకీయ అవస్థలు, సామాజిక అసంతృప్తి.. ఇవన్నీ కలిసి ప్రవాస అమెరికన్లలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు "అమెరికన్ డ్రీమ్" అనుకున్నది.. ఇప్పుడు కొందరికీ "అమెరికన్ భారంగా" మారిందని చెప్పాలి.
