Begin typing your search above and press return to search.

ట్రంప్ ఉడత ఊపులకు భయపడేదే లే.. చైనా ఏంటి ఇలా తిరగబడింది

“అమెరికా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోంది. ఈ చర్యలు మా దేశ ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి” అని చైనా అధికారులు మండిపడ్డారు.

By:  A.N.Kumar   |   12 Oct 2025 1:44 PM IST
ట్రంప్ ఉడత ఊపులకు భయపడేదే లే.. చైనా ఏంటి ఇలా తిరగబడింది
X

ప్రపంచంలోని అగ్ర ఆర్థిక శక్తులైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై ఏకంగా 100 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ట్రంప్ తాజా నిర్ణయంపై చైనా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా “చర్యకు ప్రతిచర్య ఉంటుంది” అంటూ అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది.

* ట్రంప్ '100% టారిఫ్స్' ఎందుకు విధించారు?

ట్రంప్ ప్రభుత్వం నవంబర్ 1 నుంచి చైనా దిగుమతులపై ఈ 100 శాతం అదనపు సుంకాలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయానికి కారణంగా చైనా ఇటీవలే అమెరికాకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించడాన్ని వాషింగ్టన్ పేర్కొంది.

ట్రంప్ ధ్వజమెత్తారు

అధ్యక్షుడు ట్రంప్, చైనా చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై సూటిగా విమర్శలు గుప్పించారు. “చైనా మాతో ఆటలు ఆడితే, అందుకు వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జిన్‌పింగ్‌తో జరగాల్సిన సమావేశాన్ని కూడా నేను రద్దు చేస్తా ” అని ట్రంప్ హెచ్చరించారు.

మునుపటి వాణిజ్య వివాదమే కారణం

చైనా సరసమైన వాణిజ్య పద్ధతులు పాటించడం లేదని, అమెరికా బౌద్ధిక ఆస్తులను దొంగిలిస్తోందని ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ సుంకాలు పెంచే నిర్ణయం తీసుకున్నారు.

* చైనా నుండి స్ట్రాంగ్ వార్నింగ్: 'వెనకడగబోం'

ట్రంప్ నిర్ణయం , హెచ్చరికలపై చైనా తీవ్రంగా స్పందించింది. చైనా ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ అమెరికా చర్యలు కేవలం చర్చల వాతావరణాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక సమతౌల్యాన్ని కూడా గందరగోళానికి గురిచేస్తాయని పేర్కొంది. “అమెరికా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోంది. ఈ చర్యలు మా దేశ ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి” అని చైనా అధికారులు మండిపడ్డారు. “మేము గొడవ కోరుకోవడం లేదు, కానీ మా జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైతే వెనుకడమూ లేదు. అమెరికా చర్యలకు మేం తప్పకుండా గట్టి ప్రతిచర్య తీసుకుంటాం,” అని స్పష్టంగా హెచ్చరించింది.

2018లో ట్రంప్ ప్రభుత్వం భారీ సుంకాలు విధించినప్పుడు కూడా చైనా ప్రతిచర్యలకు దిగింది. ఇప్పుడు మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుతున్నప్పటికీ, ఈసారి చైనా మరింత దృఢంగా, ఆత్మవిశ్వాసంతో అమెరికాకు ఎదురు నిలుస్తోంది.

* ప్రపంచ ఆర్థికంపై ప్రభావం!

అమెరికా, చైనా ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడంతో, వీరి మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే కుదిపేస్తాయి. టారిఫ్స్ పెంపుదలపై ప్రకటన రాగానే అంతర్జాతీయ మార్కెట్లు అస్థిరంగా మారాయి. ఇప్పటికే గ్లోబల్ ట్రేడ్ సెక్టార్‌లో నెలకొన్న అనిశ్చితి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ వాణిజ్య యుద్ధం ఎంతవరకు వెళ్లినా, దాని ఫలితం ఏ దేశానికీ లాభం చేకూర్చకపోవచ్చు. టారిఫ్‌లు పెంచడం వల్ల ఇరు దేశాల్లోని వినియోగదారులు, కంపెనీలు పెరిగిన ధరల భారాన్ని మోయాల్సి వస్తుంది.

ఈసారి ట్రంప్ దూకుడుగా ముందుకు వస్తున్నా, చైనా మాత్రం తన వాణిజ్య వ్యూహంలో వెనుకడే మూడ్‌లో లేదని తేలిపోయింది. ఈ “ట్రంప్ టారిఫ్స్ – చైనా వార్నింగ్” అంశం ప్రపంచ ఆర్థిక రాజకీయం మొత్తాన్నీ కుదిపేసే అవకాశం ఉంది.