అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..కార్గో విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధం
అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో లూయిస్‌విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ఘోర విమాన ప్రమాదం జరిగింది.
By: A.N.Kumar | 5 Nov 2025 9:38 AM ISTఅమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో లూయిస్‌విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే UPS కార్గో విమానం కుప్పకూలిపోయి, భారీ మంటల్లో చిక్కుకుంది.
* ప్రమాదం వివరాలు:
UPS కార్గో విమానం లూయిస్‌విల్లే నుండి హవాయిలోని హొనొలులు కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా విమానం నేలమట్టమైంది. భారీ శబ్దంతో కుప్పకూలిన వెంటనే ఫ్లైట్ పేలిపోయి, పెద్దఎత్తున మంటలు, దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. ప్రమాద తీవ్రత కారణంగా సమీపంలోని పలు భవనాలు కూడా దగ్ధమయ్యాయి.
* సిబ్బంది పరిస్థితి:
విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే, వారి ప్రస్తుత పరిస్థితిపై ఇంకా స్పష్టమైన సమాచారం తెలియరాలేదు. రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
* సహాయక చర్యలు & దర్యాప్తు:
స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో, ఫైరింగ్ యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాద స్థలంలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో భద్రతా చర్యల్లో భాగంగా ఆ ప్రాంత ప్రజలను అధికారులు తాత్కాలికంగా ఖాళీ చేయించారు.
ఈ ఘోర ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) , నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ (NTSB) సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి.
* సోషల్ మీడియాలో కలకలం:
ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియోలు.. విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీగా ఎగసిన మంటలు, దట్టమైన పొగలు చూసి నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం అమెరికా అంతటా చర్చనీయాంశంగా మారింది.
