Begin typing your search above and press return to search.

అమెరికా-కెనడా టారిఫ్ వార్ భారత్‌కు ఏవిధంగా క‌లిసొస్తుంది?

అమెరికా, కెనడాల మధ్య తీవ్రమవుతున్న టారిఫ్ సమరం ప్రపంచ ఆర్థిక సమీకరణాలను వేగంగా మారుస్తోంది.

By:  Sivaji Kontham   |   27 Aug 2026 7:00 AM IST
అమెరికా-కెనడా టారిఫ్ వార్ భారత్‌కు ఏవిధంగా క‌లిసొస్తుంది?
X

అమెరికా, కెనడాల మధ్య తీవ్రమవుతున్న టారిఫ్ సమరం ప్రపంచ ఆర్థిక సమీకరణాలను వేగంగా మారుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం భారీ టారిఫ్‌లకు నిరసనగా కెనడా ప్రతీకార సుంకాలను ప్రకటించడం.. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విఫలం కావడం అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఉత్తర అమెరికాలోని ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య తలెత్తిన ఘర్షణ పరోక్షంగా భారత ఆర్థిక వ్యవస్థకు, ఎగుమతిదారులకు సరికొత్త అవకాశాలను తలుపులు తడుతోంది.

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో భారత్‌తో తీవ్ర స్థాయిలో క్షీణించిన దౌత్య, వ్యాపార బంధాలు.. నూతన ప్రధాని మార్క్ కార్నీ బాధ్యతలు స్వీకరించాక వేగంగా మెరుగ‌య్యాయి. అమెరికాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్న కెనడా.. ఇప్పుడు భారత్ వైపు ముమ్మరంగా దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) చర్చలు ముమ్మరమయ్యాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏటా 70 బిలియన్ డాలర్లకు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం ద్వైపాక్షిక సంబంధాలలో సరికొత్త అధ్యాయానికి సంకేతంగా నిలుస్తోంది.

ఈ వాణిజ్య ఒప్పందం పూర్తయితే భారతీయ ఉత్పత్తులకు కెనడా మార్కెట్‌లో అపారమైన డిమాండ్ ఏర్పడనుంది. ముఖ్యంగా మన దేశం నుంచి మెడిసినల్ ఉత్ప‌త్తులు, ఉక్కు, సీఫుడ్, ఎలక్ట్రానిక్స్ వ్యాపార రంగాలు భారీగా ప్రయోజనం పొందుతాయి. అదే సమయంలో భారత్ కూడా తన పారిశ్రామిక, వ్యవసాయ అవసరాలకు అవసరమైన యురేనియం, పొటాష్, ఎల్‌ఎన్‌జీ, ఎరువులను కెనడా నుంచి సమృద్ధిగా దిగుమతి చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పరస్పర ప్రయోజనకరంగా మారనుంది.

మరోవైపు ఈ టారిఫ్ వివాదం భారత విదేశాంగ, వాణిజ్య విధానాలకు కీలకమైన హెచ్చరికగా నిలుస్తోంది. అమెరికా వంటి అగ్రరాజ్యాల ఏకపక్ష వాణిజ్య విధానాలు.. సుంకాల బాదుడు ఏ క్షణంలోనైనా భాగస్వామ్య దేశాలను సంక్షోభంలోకి నెట్టగలవని కెనడా అనుభవం స్పష్టం చేస్తోంది. అందువల్ల రాబోయే రోజుల్లో అమెరికాతో చేసుకునే వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ ఎంతో జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపేన్ భారత్ ఆర్థిక వృద్ధిని..మార్కెట్ ప్రాధాన్యతను బహిరంగంగా ప్రశంసించడం.. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చలు జరపడం గమనార్హం. గతంలో విభేదాలు ఉన్నా ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారత్ బలాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి. గ్లోబల్ ట్రేడ్ డైవర్సిఫికేషన్‌లో భారత్ నమ్మకమైన, కీలకమైన శక్తిగా అవతరిస్తోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్ర‌పంచంలోని ప‌రిణామాల‌ను అనువుగా మ‌లుచుకుని తెలివిగా ఎన్ క్యాష్ చేయ‌గ‌ల స‌మ‌ర్థ‌త భార‌త్ కి ఉంద‌ని మ‌రోసారి ప్రూవ్ అవుతోంది.