H-1B వీసాలపై $1 లక్ష ఫీజు: ట్రంప్ నిర్ణయానికి ఫెడరల్ కోర్టు గ్రీన్ సిగ్నల్!
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు.. ముఖ్యంగా భారతీయ ఐటీ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.
By: A.N.Kumar | 24 Dec 2025 12:13 PM ISTఅమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు.. ముఖ్యంగా భారతీయ ఐటీ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. డొనాల్డ్ ట్రంప్ పాలనలో H-1B వీసాలపై ప్రతిపాదించిన 1 లక్ష డాలర్ల (సుమారు రూ.85 లక్షలు) భారీ ఫీజు విధింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం చట్టబద్దమేనని కోర్టు స్పష్టంచేయడంతో వలసదారుల్లో ఆందోళన మొదలైంది.
కోర్టు తీర్పు.. ట్రంప్ నకు భారీ ఊరట..
ఈ భారీ ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాలు, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన పిటిషన్లపై వాషింగ్టన్ డీసీ ఫెడరల్ డిస్ట్రిక్ట్ జడ్జి బెరిల్ హోవెల్ తీర్పునిచ్చారు. ‘ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు చట్టానికి లోబడి ఉన్నప్పుడు అవి మంచివా లేదా చెడ్డవా అని నిర్ణయించే అధికారం కోర్టులకు ఉండదు.. ఇది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశం’ అని జడ్జి వ్యాఖ్యానించారు.
భారతీయులపై పడనున్న పెనుప్రభావం
ప్రస్తుతం హెచ్1బీ ఫీజులు సగటున 2వేల డాలర్ల నుంచి 5వేల డాలర్ల మధ్యలో ఉన్నాయి. అయితే తాజా తీర్పుతో ఇది ఒక్కసారిగా 1లక్ష డాలర్లకు చేరనుంది. దీనివల్ల కలిగే నష్టాలు ఉన్నాయి. చిన్న, మధ్యతరహా కంపెనీలు ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి విదేశీనిపుణులను నియమించుకోవడం అసాధ్యంగా మారుతుంది. అమెరికాలోని హెచ్1బీ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులే కావడంతో మన ఐటీ నిపుణుల అవకాశాలకు గండి పడనుంది. అమెరికా కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి విదేశీయులను పక్కనపెట్టి స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ట్రంప్ సర్కార్ వాదన ఏంటి?
స్థానిక అమెరికన్ల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని ట్రంప్ ప్రభుత్వం వాదించింది. తక్కువ వేతనాలకే విదేశీ నిపుణులు దొరుకుతున్నారనే కారణంతో కంపెనీలు స్థానిక అమెరికన్లను తొలగిస్తున్నాయని.. ఈ ధోరణిని అడ్డుకోవడానికే ఫీజులను భారీగా పెంచామని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా వలస విధానాలను నియంత్రించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆందోళనలో వ్యాపార వర్గాలు
ఈ తీర్పుపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్ర అసంతృస్తి వ్యక్తం చేసింది. ఫీజు పెంపు వల్ల ప్రతిభావంతులైన విదేశీ నిపుణులు అమెరికాకు రావడం తగ్గిపోతుందని.. దీనివల్ల అమెరికా ఆర్తిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసే యోచనలో వ్యాపార సంఘాలు ఉన్నాయి.
ఈ తీర్పుతో అమెరికాలో వలస విధానాలు మరింత కఠినతరం కానున్నాయి. ట్రంప్ మార్క్ ‘అమెరికా ఫస్ట్’ విధానం ఇప్పుడు న్యాయస్థానం మద్దతుతో మరింత వేగంగా అమలు కానుంది.
