Begin typing your search above and press return to search.

ఒత్తిడి నుంచి ఒప్పందాల దాకా… వాణిజ్యంలో భారత్‌కు గెలుపు మలుపు

ఒకప్పుడు భారత్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆర్థిక ఒత్తిడితో మోకాళ్లపైకి తెచ్చేందుకు ప్రయత్నించిన అమెరికా ఇప్పుడు అదే భారత్‌తో సఖ్యత కోసం తలుపుతడుతున్న పరిస్థితికి దిగజారింది.

By:  A.N.Kumar   |   27 Feb 2026 3:43 PM IST
ఒత్తిడి నుంచి ఒప్పందాల దాకా… వాణిజ్యంలో భారత్‌కు గెలుపు మలుపు
X

ఒకప్పుడు భారత్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆర్థిక ఒత్తిడితో మోకాళ్లపైకి తెచ్చేందుకు ప్రయత్నించిన అమెరికా ఇప్పుడు అదే భారత్‌తో సఖ్యత కోసం తలుపుతడుతున్న పరిస్థితికి దిగజారింది. ప్రపంచ ఆర్థిక వేదికపై మారుతున్న సమీకరణలు.. అంతర్జాతీయ న్యాయపరమైన పరిణామాలు.. భారత్‌ చేపట్టిన వ్యూహాత్మక నిర్ణయాలు... ఇవి అన్నీ కలిసివచ్చి అమెరికా వైఖరిలో గణనీయ మార్పుకు దారి తీశాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన గత పాలనలో భారత్‌పై కఠిన వైఖరి అవలంబించిన విషయం తెలిసిందే. భారత్‌ను “డెడ్‌ ఎకానమీ”గా అభివర్ణిస్తూ అధిక దిగుమతి సుంకాలు విధిస్తూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఒత్తిడి తెచ్చాడు. ముఖ్యంగా ఉక్కు, టెక్స్‌టైల్‌, వ్యవసాయ రంగాలపై టారిఫ్‌ల రూపంలో భారత్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాడు. అయితే భారత్‌ ఈ ఒత్తిడికి తలొగ్గకుండా సహనంతో పాటు వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది.

టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించేందుకు భారత్‌ ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించింది. ఆస్ట్రేలియా, యూకే, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న యూరోపియన్‌ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందాన్ని పూర్తి చేయడం ద్వారా తన ఆర్థిక వ్యూహాన్ని బలపరిచింది. ఈ చర్యలు అమెరికా ఆధిపత్యానికి సవాల్‌గా మారాయి.

ఇదే సమయంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ట్రంప్‌ పరిపాలనలో అమలులోకి తీసుకువచ్చిన పలు అధిక దిగుమతి సుంకాలు చట్టవిరుద్ధమని పేర్కొనడంతో అమెరికా వాణిజ్య విధానాలకు గట్టి దెబ్బ తగిలింది. దీంతో భారత్‌పై అమెరికా చూపిన వాణిజ్య ఒత్తిడి గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా ఉక్కు, టెక్స్‌టైల్‌ రంగాల్లో భారత ఎగుమతులకు ఇది ఊరటనిచ్చింది.

ఇప్పటివరకు టారిఫ్‌ల విషయంలో చర్చల కోసం భారత ప్రతినిధులు అమెరికాకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే తాజా పరిణామాలతో పరిస్థితి తలకిందులైంది. ఇప్పుడు అమెరికా అధికారులు భారత్‌కు వచ్చి చర్చలు జరుపుతున్నారు. అదీ ఎలాంటి ప్రచారం లేకుండా రహస్యంగా జరగడం విశేషం.

ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య వ్యవహారాల కార్యదర్శి హోవార్డ్‌ లూట్నిక్‌ ఇటీవల నిశ్శబ్దంగా ఢిల్లీకి చేరుకుని, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో టారిఫ్‌ సడలింపులు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, డిజిటల్‌ ట్రేడ్‌ వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. భారత్‌ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సమానస్థాయి చర్చలకు దారితీసింది.

ఒకప్పుడు ప్రపంచ దేశాలకు షరతులు విధించిన అమెరికా ఇప్పుడు చర్చలకు ముందుకొచ్చే పరిస్థితి రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో మారుతున్న శక్తిసామ్యాన్ని ప్రతిబింబిస్తోంది. డబ్ల్యూటీవో నియమాలు, బైలాటరల్‌ ఒప్పందాలను ఆయుధంగా మార్చుకున్న భారత్‌ అమెరికా ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంది. ఈ పరిణామం చైనా, యూరోపియన్‌ యూనియన్‌ వంటి దేశాలకు కూడా ఒక సంకేతంగా మారింది.. అమెరికా ఏకపక్ష విధానాలు ఇకపై అంత సులభంగా అమలులోకి రావని అందరికీ అర్థమైంది.

భారత్‌-అమెరికా వాణిజ్య సంబంధాలు ఇప్పటికే 200 బిలియన్‌ డాలర్లను దాటే స్థాయికి చేరుకున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్‌, ఐటీ, ఆటోమొబైల్‌ రంగాల్లో భారత ఎగుమతులకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి.

మొత్తానికి ఒకప్పుడు ఆదేశాలు జారీ చేసిన అమెరికా ఇప్పుడు చర్చలకు రావాల్సిన పరిస్థితి రావడం, భారత్‌ వ్యూహాత్మక దృక్పథానికి నిదర్శనం. ఈ రహస్య చర్చలు భవిష్యత్‌లో సమగ్ర వాణిజ్య ఒప్పందానికి బాటలు వేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వాణిజ్య సమీకరణాల్లో భారత్‌ స్థానం మరింత బలపడుతున్నదనడానికి ఇది స్పష్టమైన సంకేతం.