చైనా ఎయిర్‌లైన్స్‌కు అమెరికా షాక్: రష్యా మార్గంపై నిషేధం!
చైనా–అమెరికా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయాన రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 10 Oct 2025 10:37 PM ISTచైనా–అమెరికా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయాన రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా ఎయిర్‌లైన్స్ అమెరికాకు వెళ్లే.. వచ్చే విమాన సర్వీసుల్లో రష్యా వైమానిక మార్గాన్ని ఉపయోగించడాన్ని నిషేధించాలని అమెరికా రవాణా శాఖ నిర్ణయించింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య చైనా విమానయాన సంస్థలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.
ఈ నిషేధం ఎందుకు?
ప్రస్తుతం చైనా ఎయిర్‌లైన్స్ రష్యా గగనతలం మీదుగా ప్రయాణించడం వలన అమెరికా ఎయిర్‌లైన్స్ కంటే స్పష్టమైన పోటీ ప్రయోజనాన్ని పొందుతున్నాయి. రష్యా మార్గం తక్కువ దూరం ఉండటం వల్ల ఇంధన వ్యయం గణనీయంగా తగ్గుతోంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతోంది. అయితే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా , పశ్చిమ దేశాల ఎయిర్‌లైన్స్ రష్యా గగనతలాన్ని దాటే మార్గాలను పూర్తిగా నివారిస్తున్నాయి. దీని వల్ల చైనా ఎయిర్‌లైన్స్‌కు లభిస్తున్న ఈ "అసమానతను" సరిచేయడానికి అమెరికా ప్రభుత్వం ఈ కొత్త పరిమితులను విధించింది.
* ఎవరిపై ప్రభావం ఉంటుంది?
ఈ ప్రతిపాదిత నిషేధం కింది ప్రధాన చైనా విమానయాన సంస్థలపై నేరుగా వర్తిస్తుంది. Air China, China Eastern, China Southern, Xiamen Airlines కు తక్కువ ఖర్చుతో లాభాలు గడిస్తున్నాయి. హాంకాంగ్‌కు చెందిన Cathay Pacific ఈ నిషేధం పరిధిలోకి రాదు. అలాగే కార్గో ఫ్లైట్స్‌కు కూడా ఈ నియమం వర్తించదు.
* జియో పొలిటికల్ టెన్షన్ : ఆర్థిక నేపథ్యం & ఉద్రిక్తతలు
ఈ విమానయాన చర్య కేవలం వ్యాపార పోటీకి సంబంధించినది మాత్రమే కాకుండా, విస్తృత అమెరికా–చైనా ఆర్థిక ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా కనిపిస్తోంది. ఇటీవల, చైనా ప్రభుత్వం అమెరికా పరిశ్రమలకు కీలకమైన రేర్ ఎర్త్ ఎగుమతులపై కట్టడి పెంచింది. దీనిపై అమెరికా అసహనం వ్యక్తం చేయగా, విమానయాన రంగంలో ఈ కొత్త పరిమితి ప్రతిస్పందనగా వచ్చింది. అమెరికా ప్రకటన వెలువడిన తర్వాత చైనాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిర్‌లైన్ల షేర్లు స్వల్పంగా పడిపోయాయి. రష్యా 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తరువాత అమెరికా , పశ్చిమ దేశాల ఎయిర్‌లైన్స్‌కు తన గగనతలాన్ని మూసివేసింది. కానీ చైనా ఎయిర్‌లైన్స్ మాత్రం రష్యా మార్గాలను ఉపయోగించడం కొనసాగించాయి.
* తదుపరి చర్యలు , ప్రభావం
అమెరికా రవాణా శాఖ చైనా ఎయిర్‌లైన్స్‌కు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి రెండు రోజుల సమయం ఇచ్చింది. తుది ఉత్తర్వు నవంబర్‌లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
నిపుణుల అంచనా ప్రకారం:
రష్యా మార్గం వినియోగం ఆగిపోతే, అమెరికా తూర్పు తీరం నుంచి చైనాకు వెళ్లే విమానాలు మరింత పొడవుగా, ఖరీదుగా మారవచ్చు. ఈ నిర్ణయం అమెరికా ఎయిర్‌లైన్స్‌కు కొంత ఊరటనిచ్చినా, వాషింగ్టన్–బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ నిషేధం రాబోయే నెలల్లో గ్లోబల్ ఎయిర్ ట్రావెల్ దిశను మార్చే అవకాశం ఉంది.
