ట్రంప్ మామ టారిఫ్‌ల షాక్.. ఏపీ రొయ్యకు అమెరికా సుంకాల 'కారం'!
పాపం మన ఎగుమతిదారులు ఇప్పటికే 5.77% కౌంటర్‌వైలింగ్ డ్యూటీ (సీవీడీ)తో మోత మోగుతున్నారు.
By: A.N.Kumar | 4 Sept 2026 2:21 PM ISTఅటు వైట్ హౌస్‌లో పాలసీ మారింది.. ఇటు మన ఆక్వా రైతుల జేబులకు చిల్లు పడింది. ఇప్పటికే మన దేశంలో ప్రతి రంగానికి తమ మార్కు బాదుడు పరిచయం చేస్తున్న అమెరికా బాబులు.. ఇప్పుడు ఏపీ రొయ్యలను చూసి ఉలిక్కిపడ్డారు. "మా దగ్గర రొయ్యల కంటే మీ రొయ్యలే చవగ్గా వస్తున్నాయ్.. ఇదేం న్యాయం?" అని గొడవపెట్టుకుని, భారతీయ సముద్ర ఉత్పత్తులపై ఏకంగా 5.53% యాంటీ డంపింగ్ డ్యూటీ (ఏడీడీ) పడేసారు.
పాపం మన ఎగుమతిదారులు ఇప్పటికే 5.77% కౌంటర్‌వైలింగ్ డ్యూటీ (సీవీడీ)తో మోత మోగుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త డ్యూటీ కూడా తోడవ్వడంతో 'గాడిద పుండు మీద కారం చల్లినట్టు' తయారైంది పరిస్థితి. పైగా ఈ కొత్త పన్ను ఇప్పటికిప్పుడు కాకుండా గత కాలానికి కూడా వర్తిస్తుందట.. అంటే తిన్న రొయ్యలకు బిల్లు ఇప్పుడు కట్టాలన్నమాట. దీనివల్ల మన ఎగుమతిదారులపై ఏకంగా రూ.1,000 కోట్ల మేర అదనపు భారం పడనుందని అంచనా.
అమెరికా పళ్లెంలో 'ఏపీ' రొయ్య.. కానీ బాదుడు మాత్రం మనోళ్లకే..
దేశం మొత్తంలో ఎంతమంది రొయ్యలు పెంచినా.. అమెరికా ప్లేటులోకి వెళ్లే సీఫుడ్‌లో మన ఆంధ్రప్రదేశ్ దాదాపు 'ఏకఛత్రాధిపత్యం' చెలాయిస్తోంది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే 2.71 బిలియన్ డాలర్ల సీఫుడ్‌లో 92 శాతానికి పైగా ఫ్రోజెన్ రొయ్యలే ఉన్నాయి. పాపం మన తీర ప్రాంత రైతులు రాత్రింబవళ్ళు కష్టపడి చెమటోడ్చి రొయ్యలను అమెరికా మేడమ్‌లు.. సార్లకు తినిపిస్తుంటే.. అక్కడి ప్రభుత్వం మాత్రం "మీ మీద సుంకాలు వేస్తాం" అంటూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది.
చివరికి దెబ్బతినేది ఎవరో తెలుసా?
వాషింగ్టన్‌లో పన్నులు పెరిగితే.. ఇక్కడ తీరప్రాంతంలో ఉన్న ఆక్వా రైతు జేబు ఖాళీ అవుతుంది. ఎందుకంటే అమెరికా మార్కెట్‌లో రేట్లు పెంచితే అక్కడివారు కొనరని భయపడే మన ఎగుమతిదారులు, లాభాలు తగ్గకుండా చూసుకోవడానికి ప్లాన్ బి వేస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే.. రైతుల దగ్గర కొనే రొయ్యల ధరను తగ్గించేయడమే..
ఇప్పటికే కరెంట్ బిల్లులు, మేత ఫీడ్ ధరలు, విత్తనం సీడ్ ఖర్చులు పెరిగిపోయి ఆక్వా రైతులు 'అయ్యో దేవుడా' అని తలలు పట్టుకుంటే ఇప్పుడు ఈ గ్లోబల్ పన్నుల భారం కూడా చివరికి వారిపైనే పడేలా ఉంది.
ప్రత్యామ్నాయ మార్కెట్లు.. లభించేనా ఉపశమనం?
అమెరికా పెడుతున్న తిప్పలు తట్టుకోలేక భారత్ ఇప్పుడు చైనా, యూరప్, జపాన్, మిడిల్ ఈస్ట్ దేశాల వైపు చూపులు సారిస్తోంది. "మీరు కాకపోతే ఇంకొకరు" అని గంభీరంగా చెబుతున్నా, అమెరికా అంత పెద్ద మార్కెట్‌ను రాత్రికి రాత్రే భర్తీ చేయడం అంత తేలికైన విషయమేమీ కాదు.
మొత్తానికి అమెరికా సుంకాల దెబ్బకు ఏపీ ఆక్వా రంగం ఇప్పుడు సముద్రపు అలల కంటే ఎక్కువగా ఊగిసలాడుతోంది. మరి మన ప్రభుత్వం రంగంలోకి దిగి ఈ అంతర్జాతీయ పన్నుల పంజా నుంచి ఆక్వా రంగాన్ని ఎలా కాపాడుతుందో చూడాలి.
