Begin typing your search above and press return to search.

ట్రంప్ '100% పంచ్'.. భారత్ పారిపోయి చైనా ఒళ్లో పడుతుందా? భయపడిపోతున్న అమెరికా సెనేటర్లు

రష్యా దగ్గర చమురు కొంటున్నారని కోపం వచ్చిందంట.. భారత్ మీద ఏకంగా 100% పన్నుల బాంబు పేల్చారు అమెరికా పెద్దలు.. దానికి భారత్ భయపడాలి కానీ.. అమెరికా సెనేటర్లే ఆందోళన చెందుతున్నారు.

By:  A.N.Kumar   |   8 Aug 2026 2:51 PM IST
ట్రంప్ 100% పంచ్.. భారత్ పారిపోయి చైనా ఒళ్లో పడుతుందా? భయపడిపోతున్న అమెరికా సెనేటర్లు
X

రష్యా దగ్గర చమురు కొంటున్నారని కోపం వచ్చిందంట.. భారత్ మీద ఏకంగా 100% పన్నుల బాంబు పేల్చారు అమెరికా పెద్దలు.. దానికి భారత్ భయపడాలి కానీ.. అమెరికా సెనేటర్లే ఆందోళన చెందుతున్నారు. బిల్లు పాస్ అయి ట్రంప్ మామ చేతికి ఆ పవర్ వస్తే భారత్ దిగుమతులపై సుంకాల బాదుడే బాదుడు. అయితే ఈ ఆవేశంలో అమెరికా ఒక చిన్న విషయాన్ని మరచిపోతోందని కొందరు సెనేటర్లు గుండెలు బాదుకుంటున్నారు. అదేంటంటే "మనం పన్నులతో బాదితే భారత్ వెళ్ళి చైనా ఐస్ క్రీమ్ తింటుందేమో!" అని.

'నిందితులు' దొరికేశారు రోయ్..

అమెరికా సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ గారైతే ఏకంగా వేలు చూపిస్తూ "ఇదిగోండి.. రష్యా యుద్ధానికి డబ్బులిస్తున్న అసలు నిందితులు భారత్, చైనాలే" అని బాహాటంగానే ప్రకటన ఇచ్చేశారు. పుతిన్ దగ్గర చౌకగా లభించే క్రూడ్ ఆయిల్ కొని దేశంలో పెట్రోల్ ధరలు పెరగకుండా చూసుకోవడం భారత్ చేసిన 'పెద్ద నేరం' అట.. ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఇంధన కొనుగోళ్లే ఇంధనం పోస్తున్నాయని వారి భావన.

భారత్‌ను తోసేసి, చైనాను ఆపుతారా?

అసలైన కామెడీ ఏంటంటే.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దాష్టీకాన్ని అడ్డుకోవడానికి భారత్‌ను 'రాతి బండ'లా వాడుకోవాలని చూసింది అమెరికాయే.. సెమీకండక్టర్లు, రక్షణ, సాంకేతికత అంటూ భారత్‌ను భుజాన వేసుకుని ఆడిన అంకుల్ సామ్ ఇప్పుడు అదే భారత్‌పై 100% పన్నులు వేస్తాననడం నిజంగా విడ్డూరమే. "నన్ను తాకితే చైనా వైపు పోతా" అని భారత్ బెదిరించకపోయినా అమెరికా అమాయకత్వమే భారత్‌ను చైనా-రష్యా వైపు నెట్టేసేలా ఉందనేది కొందరు విశ్లేషకుల మాట.

అమెరికాకే ముప్పు.. మనకేం నష్టం..

ఒకవేళ 100% పన్నులు పడితే మన ఫార్మా, టెక్స్‌టైల్స్, ఆటో రంగాలు దెబ్బతింటాయి సరే.. మరి అమెరికా వినియోగదారులు ఐఫోన్ల నుంచి మందుల వరకు అన్నీ రెట్టింపు ధరకు కొనుక్కోవాల్సి వస్తుంది కదా? అది ఆలోచించారా అంటే.. "ముందు విదేశాంగ నీతి, ఆ తర్వాతే పౌరుల జేబులు" అన్నట్టుంది వారి తీరు.

భారత్ ఎప్పుడూ ఏ ఒక్కరి పాకెట్‌లోనూ ఉండే దేశం కాదు. తన ఇంధన భద్రత కోసం ఎక్కడైనా కొంటుంది. ఇప్పటికైతే ఈ 100% టారిఫ్ బిల్లు ఇంకా ప్రతినిధుల సభను దాటాల్సి ఉంది. బిల్లు పాస్ అయి చట్టంగా మారినా భారత్‌ను బెదిరించి చైనా వైపు నెట్టాలా లేక చల్లబడాలా అనేదే ఇప్పుడు 'అంకుల్ సామ్' ముందున్న పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న