అన్నదాత ఆప'శోకాలు'... బాబుకు ఇబ్బందే.. !
రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆకలి తీర్చే రైతన్నలు ఆప'శోపాలు' కాదు.. ఆప'శోకాలు' పడుతున్నారు. ప్రస్తుతం యూరియా దక్కక రైతులు.. పడుతున్న వేదనకు అంతు పొంతు లేకుండా పోయింది.
By: Garuda Media | 7 Sept 2025 1:00 AM ISTరాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆకలి తీర్చే రైతన్నలు ఆప'శోపాలు' కాదు.. ఆప'శోకాలు' పడుతున్నారు. ప్రస్తుతం యూరియా దక్కక రైతులు.. పడుతున్న వేదనకు అంతు పొంతు లేకుండా పోయింది. ఎక్కడికక్కడ అన్నదాతల సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ప్రతిపక్షం చేస్తున్న కుట్ర అని పేర్కొంటున్నా.. వాస్తవం మాత్రం క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉంది.
రైతులకు యూరియా లభించక పడిగాపులు పుడుతున్నారు. మరోవైపు.. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు యూరియాను లోడుకు లోడు.. పొరుగు రాష్ట్రాలకు పంపేసి సొమ్ములు చేసుకుంటున్నారు. అదేసమయంలో దళారుల ప్రమేయం పెరిగిపోయింది. దీంతో యూరియా బస్తాకు 500-1000 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అంతేకాదు.. రైతులకు కూడా రాజకీయాలు అంటగట్టి.. తమ వారికి మాత్రమే యూరియాను ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఆదేశించడం కూడా సర్కారు కు ఇబ్బందిగా మారింది.
ఈ పరిణామాలు చాలా సీరియస్‌గా ఉన్నాయన్నది అధికార పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలోనే పెద్ద ఎత్తున విమర్శలు, వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సర్కారు స్పందన కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నది వాస్తవం. కానీ, ప్రభుత్వం మాత్రం ఇదంతా ట్రాష్.. అని, వైసీపీ నేతలు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని చెబుతోంది. అనుకూల మీడియాలోనే భారీ ఎత్తున రైతులు ఇబ్బందులు పడుతున్నారని కథనాలు వస్తుంటే.. ఇప్పుడు కూడా స్పందించకపోవడం సరికాదన్నది టీడీపీలోనే నాయకులు చెబుతున్నారు.
నిజానికి గత ఏడాది కాలంలో రైతులకు సంబంధించిన సమస్యలపై సర్కారుఉదాశీనంగానే వ్యవహరి స్తోందన్న చర్చ ఉంది. గుంటూరులో నల్లబర్లీ పొగాకు కొనుగోలు సమస్య ఇప్పటికీ ఉంది. ఇక, చిత్తూరులో తలెత్తి మామిడి కాయల గుజ్జు పరిశ్రమల వ్యవహారం రాజకీయంగా మంటలు రేపింది. ప్రస్తుతం ఉల్లిపాయల సమస్య కూడా కర్నూలు సహా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా కొత్త పంటలు వేసుకున్న రైతులు.. యూరియా కోసం వేచి చూస్తున్న సమయంలో ఇది కూడా వారిని ఇరకాటంలోకి నెట్టింది. మొత్తంగా చూస్తే.. సీఎం చంద్రబాబు దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టకపోతే.. ఇబ్బందులు తప్పవన్నది ఖాయం.
