ఆ రాష్ట్రంలో తల్లిపాలలో యురేనియం... శాస్త్రవేత్తల రియాక్షన్ ఇదే!
అవును... అమృతంతో సమానమైన తల్లిపాలు సైతం రకరకాల కారణాల వల్ల ఇప్పుడు ప్రమాదకరంగా మారుతున్నాయా అని అంటే అవుననే సమాధానం వినిపిస్తొంది
By: Raja Ch | 24 Nov 2025 1:00 PM ISTతల్లి ప్రేమకు, తల్లి పాలకూ విలువ కట్టలేమని అంటారు. అవి ఈ సృష్టిలో తల్లి తప్ప మరెవరూ సృష్టించలేని అద్భుతాలని చెబుతారు. ఈ భూమిపైకి కొత్త అతిథిగా వచ్చిన శిశువుకు తల్లిపాలే సకల పోషకాలు అందిస్తాయని.. అవే ఆ బిడ్డ పాలిట అమృత ద్రవాలని అంటారు. అయితే.. ఇటీవల అంత స్వచ్ఛమైన తల్లి పాలు సైతం ప్రమాదకరంగా మారూతున్నాయనే విషయాలు తెరపైకి వస్తున్నాయి!
అవును... అమృతంతో సమానమైన తల్లిపాలు సైతం రకరకాల కారణాల వల్ల ఇప్పుడు ప్రమాదకరంగా మారుతున్నాయా అని అంటే అవుననే సమాధానం వినిపిస్తొంది. ఇందులో భాగంగా... తాజాగా బీహార్ లో నిర్వహించిన ఓ పరిశోధనలో తల్లిపాలలో రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది.
అయితే ఈ విషయంపై సీనియర్ శాస్త్రవేత్త, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్.డీ.ఎం.ఏ) సభ్యుడు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మాజీ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కే అస్వాల్ స్పందించారు. ఈ సందర్భంగా... తల్లి పాలలో స్వల్ప మోతాదులో ఉరేనియం ఉన్నప్పటికీ శుశువులకు ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ఈ యురేనియం నమూనాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించదగిన పరిమితి కంటే తక్కువగానే ఉన్నాయని.. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదే సమయంలో.. పాలిచ్చే తల్లులలో యురేనియం ఎక్కువ భాగం మూత్ర విసర్జన సమయంలో బయటకు వెళ్లిపోతుందని.. తల్లి పాలలో తక్కువ మోతాదులోనే నిల్వ ఉంటుందని తెలిపారు.
కాగా... పాట్నాలోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్, పరిశోధనా కేంద్రం, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ, ఢిల్లీలోని ఎయిమ్స్ శాస్త్రవేత్తల బృందం బీహార్ లో ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదిక ప్రకారం... బీహార్ నుంచి వచ్చిన తల్లి పాల నమూనాలో 5 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్) వరకూ యురేనియం ఈ అధ్యయనంలో కనుగొనబడింది.
ఈ అధ్యయనం సహ రచయిత అయిన ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన డాక్టర్ అశోక్ శర్మ స్పందిస్తూ... ఈ అధ్యయనం 40 మంది పాలిచ్చే తల్లుల పాలను విశ్లేషించిందని.. అన్ని నమూనాలలో యురేనియం కనుగొనబడిందని.. 70% మంది శిశువులు క్యాన్సర్ కారక ఆరోగ్య ప్రమాదాన్ని చూపించినప్పటికీ మొత్తం యురేనియం స్థాయిలు అనుమతించదగిన పరిమితుల కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు.
