'ఉప్పాడ'ను రెచ్చగొట్టిన నాయకులెవరు ..!
ఉప్పాడ.. ఇటీవల కాలంలో రాజకీయంగా తెరమీదకు వచ్చిన ఈ పేరు.. తీవ్ర వివాదానికి దారి తీసింది.
By: Garuda Media | 3 Oct 2025 10:41 AM ISTఉప్పాడ.. ఇటీవల కాలంలో రాజకీయంగా తెరమీదకు వచ్చిన ఈ పేరు.. తీవ్ర వివాదానికి దారి తీసింది. సమీపంలోని ఆక్వా కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలను సముద్రంలోకి వదులుతున్నారని.. దీంతో తమ కు ఉపాధిలేకుండా పోతోందని.. ఇక్కడి మెజారిటీ మత్స్యకారులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వరుసగా నాలుగు రోజుల పాటు.. తీవ్ర ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చితీరాల్సిందేనని పట్టుబట్టారు.
దీంతో పవన్ కల్యాణ్ కూడా స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. ఉప్పాడ సమస్యపై కమిటీ వేస్తామ ని.. తాను కూడా స్వయంగా పరిశీలిస్తానని చెప్పి.. మత్స్యకారులను ఓదార్చారు. దీంతో వారు కొంత మేరకు వెనక్కి తగ్గారు. అయితే.. అసలు ఉప్పాడ సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు? అనేవిషయాలపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. వాస్తవానికి ఈ సమస్య.. ఆది నుంచి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనూమత్స్యకారులు ఆందోళన చేశారు.
అయితే.. ఇప్పుడే ఎందుకు తెరమీదకి వచ్చింది? ఎందుకు అంత పెద్ద ఆందోళన చేశారు? దీనివెనుక ఎవరున్నారు? అనే విషయాలపై కూడా జనసేన నాయకులు ఆరా తీశారు. ఈ క్రమంలో తొలుత వైసీపీ నాయకులు ఉన్నారని వారు భావించినప్పటికీ.. అలాంటిదేమీలేదని.. సొంత జనసేన నాయకులే ఉన్నా రని తెలిసింది. పార్టీలో ఏర్పడిన చీలికల కారణంగా.. వివాదాన్ని పెద్దది చేసేందుకు.. స్థానిక నాయకత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేలాసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారని అంటున్నారు.
ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్.. నేడో రేపో దృష్టి పెట్టనున్నారు. సొంత పార్టీలో ఉంటూ.. రెండుగా చీలిపోయిన నాయకులు.. స్థానిక సమస్యలను రెచ్చగొట్టి.. పార్టీని బజారున పడేసేలా వ్యవహరించడం పై ఆయన ఆగ్రహంతో ఉన్నారని.. జనసేన వర్గాలు చెబుతున్నారు. మరోవైపు త్వరలోనే పవన్ కల్యాణ్.. నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ముందుగా ఉప్పాడలోని నాయకులు, అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యేలతోనూ ఆయన భేటీ కానున్నట్టు తెలిసింది. ఉప్పాడలో మత్స్యకారులను రెచ్చగొట్టి.. వివాదాలను పెంచిన వారిపై చర్యలు తప్పవన్న సంకేతాలు కూడా వస్తున్నాయి.
