Begin typing your search above and press return to search.

యూపీఐకి దీపావళి వెలుగులు... ఎన్పీసీఐ ఆసక్తికర డేటా!

భారతదేశంలో ఇటీవల కాలంలో యూపీఐ పేమెంట్లు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   23 Oct 2025 12:00 AM IST
యూపీఐకి దీపావళి వెలుగులు... ఎన్పీసీఐ ఆసక్తికర డేటా!
X

భారతదేశంలో ఇటీవల కాలంలో యూపీఐ పేమెంట్లు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలో డిజిటల్ పేమెంట్స్ 85% యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దీపావళి పండగ సీజన్ లో భారీ స్థాయిలో, రికార్డ్స్ స్థాయిలో యూపీఐ పేమెంట్లు జరిగాయని ఎన్పీసీఐ డేటా వెల్లడించింది.

అవును... నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంపీసీఐ) డేటా ప్రకారం.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ ఫేస్ (యూపీఐ) పండుగ సీజన్‌ లో విజృంభణను చూస్తోంది. ఇందులో భాగంగా.. ఈ అక్టోబర్‌ నెలలో సగటున రోజువారీ లావాదేవీ విలువ రూ.94,000 కోట్లకు చేరుకుంది. ఇది గత నెల సెప్టెంబర్ తో పోలిస్తే 13 శాతం ఎక్కువని డేటా తెలిపింది.

పైగా ఈ నెలలో ఇంకా వారం రోజుల కంటే ఎక్కువ సమయం మిగిలి ఉండటంతో.. దీపావళి ఖర్చు, ఇటీవలి జీఎస్టీ రేటు కోతల కారణంగా యూపీఐ తన అత్యధిక నెలవారీ పనితీరును నమోదు చేసే దిశగా పయనిస్తోందని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలను పరిశీలిస్తే... ఈ అక్టోబర్ మిగిలిన వాటన్నింటికంటే గరిష్ట రోజువారీ పేమెంట్స్ ని చూసింది!

ఇక దీపావళి పండుగ సందర్భంగా.. యూపీఐ ఒకే రోజులో 740 మిలియన్ల లావాదేవీలతో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ నెలలో ఇప్పటివరకు సగటు రోజువారీ లావాదేవీలు 695 మిలియన్లు కాగా... ఇది సెప్టెంబర్ రికార్డు 654 మిలియన్ల నుండి 6 శాతం కంటే ఎక్కువ. గత సంవత్సరం కూడా అక్టోబర్‌ లో దసరా, దీపావళి డిజిటల్ చెల్లింపు కార్యకలాపాలను పెంచాయి.

అయితే... ఈ సంవత్సరం దసరా సెప్టెంబర్‌ లో ఉండగా, అక్టోబర్ 20న జరిగిన దీపావళి వేడుకలు మరో ఊపును తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో అక్టోబర్ 20 నాటికి యూపీఐ రోజువారీ లావాదేవీ విలువ ఈ నెలలో ఆరుసార్లు రూ.1 లక్ష కోట్ల మార్కును దాటగా.. సెప్టెంబర్‌ తో పోలిస్తే ఇవి రెట్టింపు రోజులని నివేదిక తెలిపింది.

సాధారణంగా చాలా చెల్లింపు ప్లాట్‌ ఫామ్‌ లు నెల ప్రారంభంలో జీతాలు మరియు ఈ.ఎం.ఐ చెల్లింపుల కారణంగా గరిష్ట కార్యకలాపాలను చూస్తాయి, ఆ తర్వాత ఖర్చు తగ్గుతుంది. నెల మధ్య నాటికి యూపీఐ లావాదేవీలు రోజువారీ విలువలో రూ.60,000 కోట్లకు పడిపోతాయి. ఆ పరంగా చూస్తే... అక్టోబర్ యూపీఐ పేమెంట్లు ఆల్ టైమ్ రికార్డును సృష్టించగలదని నిపుణులు భావిస్తున్నారు.

క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యం!:

దీనికి విరుద్ధంగా అక్టోబర్‌ లో క్రెడిట్ కార్డ్ లావాదేవీలు సెప్టెంబర్ కంటే తక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో ఈ-కామర్స్ ఆధారిత అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇందులో భాగంగా... ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆన్‌ లైన్ క్రెడిట్ కార్డ్ ఖర్చును సెప్టెంబర్‌ లో రికార్డు స్థాయిలో రూ. 1.18 లక్షల కోట్లకు పెంచాయి. సెప్టెంబర్ 22న పండుగ అమ్మకాలు ప్రారంభంతో పాటు రోజువారీ లావాదేవీలు మొదటిసారిగా రూ. 10,000 కోట్లను అధిగమించాయి.