ఫోన్ పే.. జీ పే దెబ్బకు భీమ్ సైతం చేతులెత్తేసింది
డిజిటల్ పేమెంట్లకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థకు చెందిన భీమ్ యాప్ ఉండనే ఉంది.
By: Garuda Media | 31 Oct 2025 11:18 AM ISTడబ్బులు ఇవ్వాలన్నా.. తీసుకోవాలన్నా.. నోట్లతో పని లేకుండా కంటికి కనిపించని రీతిలో బ్యాంకు ఖాతాల్లో జమ కావటం అది కూడా క్షణాల వ్యవధిలో అయ్యే టెక్ మాయాజాలాన్ని కొన్నేళ్లుగా భారత ప్రజలకు అలవాటైంది. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా చివరకు భిక్షాటన చేసేటోళ్లు సైతం క్యూఆర్ కోడ్ పట్టుకొని.. తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయించుకుంటున్న పరిస్థితి.
డిజిటల్ పేమెంట్లకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థకు చెందిన భీమ్ యాప్ ఉండనే ఉంది. అయితే.. దీని ప్రభావం చాలా తక్కువ. ప్రైవేటు సంస్థలకు చెందిన గూగుల్ పే (జీ పే).. ఫోన్ పే ముందు మిగిలినవన్నీ దిగదుడుపే. వీటి తరహాలో మార్కెట్ లో ముప్ఫై వరకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు ఉండగా.. మొత్తం లావాదేవీల్లో 80 శాతం జీపే.. ఫోన్ పే సంస్థల ద్వారానే జరగటం చూస్తే.. ఈ రెండు అప్లికేషన్ల గుత్తాధిపత్యం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.
యూపీఐ లావాదేవాల్ని ఈ రెండు సంస్థలు నియంత్రిస్తున్న ఫిర్యాదులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ తీరుపై చర్యలు తీసుకోవాలని తాజాగా ఆర్థిక శాఖను.. ఆర్ బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా)ను ఇండియా ఫిన్ టెక్ ఫౌండేషన్ కోరింది. ఈ సంస్థ ఇలా ఎందుకు చెప్పింది? దీనికున్న ప్రాధాన్యత ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఫిన్ టెక్ పరిశ్రమలకు స్వీయ నియంత్రణ మండలిగా ఈ సంస్థ వ్యవహరిస్తోంది.
అంటే.. ఫిన్ టెక్ సంస్థల పని తీరు..వారి వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. ప్రభుత్వ సంస్థలకు సలహాలు.. సూచనలు చేస్తూ ఉంటుంది. జీపే.. ఫోన్ పే సంస్థలు భారీ తగ్గింపులు.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తూ తమ అధిపత్యాన్ని కాపాడుకుంటున్నాయని.. తమ మాదిరే సేవలు అందించే చిన్న సంస్థలు.. దేశీ పోటీదారులు తమతో పోటీ పడలేని రీతిలో చేస్తున్నట్లుగా పేర్కొంది. అదెంతలా అంటే.. భారత ప్రభుత్వానికి చెందిన భీమ్ ఫ్లాట్ ఫామ్ సైతం ఈ దెబ్బకు మార్కెట్ వాటాను కోల్పోయిన పరిస్థితి.
ఏదైనా సంస్థ గరిష్ఠంగా 30 శాతం లావాదేవీలకే సేవలు అందించాలన్న పరిమితిని ఉంది.అయితే.. ఆ రూల్ ను అమలు చేసే విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) చేస్తున్న ఆలస్యం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఈ సంస్థ 2008 డిసెంబరులో స్థాపించారు. దేశంలో డిజిటల్ పేమెంట్లకు సంబంధించి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటమే దీని లక్ష్యం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండయా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీనిని ప్రమోట్ చేశాయి. ఈ సంస్థ యూపీఐ ఫిర్యాదులను పరిశీలించి..చర్యలు తీసుకుంటుంది.
డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన గుత్తాధిపత్యాన్ని నిరోధించాలన్న అంశంపై చేస్తున్న జాప్యాన్ని ఎఫ్ఎఫ్ సైతం ప్రశ్నిస్తోంది. సంస్థ ఏదైనా 30 శాతం లావాదేవీలకే సేవలు అందించాలన్న పరిమితిని అమలు చేయని కారణంగా ఈ సంస్థలు మరింత పెద్దవిగా అవతరించేందుకు అనుమతిస్తున్నాయన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు రెండు బడా యూపీఐ సంస్థలతో పాటు మిగిలిన వాటికి యూపీఐ ప్రోత్సాహకాల్లో అధిక వాటా అందుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి.. ఈ సూచనలపై ఎన్ పీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.
