అప్డేట్ అవాల్సిందే... మరో లైఫ్ లేదు
ఎవరు ఎన్ని చెప్పినా ఈ లోకం దాటి వెళ్ళి చూసింది లేదు. అక్కడ స్వర్గం ఉంటుందో నరకం ఉంటుందో అన్నీ అనుభవించి మళ్లీ పుడతారో లేదో కూడా ఎవరికీ తెలియదు.
By: Satya P | 23 Dec 2025 9:03 AM ISTఎవరు ఎన్ని చెప్పినా ఈ లోకం దాటి వెళ్ళి చూసింది లేదు. అక్కడ స్వర్గం ఉంటుందో నరకం ఉంటుందో అన్నీ అనుభవించి మళ్లీ పుడతారో లేదో కూడా ఎవరికీ తెలియదు. అందువల్ల ఉన్నది ఒక్కటే జిందగీ. మరి ఆ ఒకే ఒక్క లైఫ్ ని నాసిరకంగా నాణ్యత లేకుండా సాగదీస్తూ లాగదీస్తూ రొటీన్ గా గడిపేస్తారా. జీవితం ఎపుడూ అలా ఉండదు కదా నీకు ప్రతీ సెకనూ కొత్తది ఇస్తోంది. మరి నీవు మాత్రం పాతలోనే ఉండిపోతే ఎలా. ఇదే ఇపుడు అంతా చెప్పేది. మనిషి ఎదగాలి అంటే అప్డేట్ కావాల్సిందే అని ఎంతో మంది రోజూ చెబుతూనే ఉన్నారు.
ఆఫ్ట్రాల్ ఫోన్ కే ఉందిగా :
మనం సొమ్ము పెట్టి కొనే ఫోన్ అప్డేట్ అడుగుతుంది. ప్రతీ సమయంలో అది మారుతూ ఉంటుంది. కాలం మారింది అని చెబుతుంది. అలా కొన్న ఫోన్ కొన్నట్లుగా ఎవరూ వాడడం లేదు కదా ఎప్పటి కపుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాలంతో పాటు పరుగులు తీయిస్తున్నారు. అప్డేట్ అయిన ఫోన్ నుంచి ఎన్నో సదుపాయాలను అందుకుంటున్నారు. ఆ మార్పులో కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. మరి చేతిలో ఆపరేట్ చేసే స్మార్ట్ ఫోన్ సైతం అప్డేట్ అయితే దానిని పట్టుకున్న నిలువెత్తు మనిషి ఇంకెంతగా మారాలో కదా.
నిలిచి నీరు కారిపోకు :
నీటిని కూడా ఇక్కడ పోలిక తీసుకుని రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఎపుడూ స్వచ్చంగా ఉంటుంది. పాత నీరుని తోసేసి మరీ కొత్త నీటితో తేటగా స్వీటుగా మారి అందరికీ దాహార్తిని తీరుస్తుంది. అందరి అవసరాలను కూడా నెరవేరుస్తుంది. మరి మనిషి ఎందుకు నీరు కారిపోతున్నాడు, బుర్ర నిండా పాత రోత ఆలోచనలు నింపేసుకుని అప్డేట్ కాకుండా ఉంటే మైండ్ సైతం బూజు పట్టిపోతుంది కదా అని అంటున్నారు.
ఏ కెరీర్ లో అయినా :
జీవితంలో ఏ కెరీర్ లో అయినా అప్డేట్ అవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. నిన్న నిన్నే మరి నేడు రేపూ కొత్తగానే ఉండాల్సి ఉంటుంది. అలా ఉంటేనే టైం తో పాటు సాగుతున్నట్లుగా ఉంటుంది అందుకే కెరీర్ ఓరియెంటేషన్ మీద క్లాసులు తీసుకునే వారు కూడా అప్డేట్ కావాలి మిత్రమా అని సూచిస్తూ ఉంటారు. లేకపోతే ఎదగడం అన్నది బహు కష్టంగా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.
ఏఐ యుగంలో :
నిజం చెప్పాలంటే ప్రపంచం ఇపుడు ఏఐ యుగంలో నడుస్తోంది. రానున్న పాతికేళ్ళు చాలా కీలకంగా మారుతుందని అంటున్నారు. మనిషి పాత్ర ప్రమేయం క్రమంగా తగ్గి డిజిటల్ యుగంలో టెక్నాలజీ పాత్ర మూడింతలు పెరుగుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో మనిషి తాను కనుక అప్డేట్ కాకపోతే ఆ మిగిలిన పావు వంతు కూడా అసలు ఏమీ కాకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నిన్న కంటే వయసులో పెద్ద ఆలోచనలలో చిన్నగా ఉండరాదు, పెరిగే వయసుతో పాటు ఆలోచనలు జ్ఞానం కూడా పెంచుకోవాలి.
ఒక తారకమంత్రంగా :
చుట్టు పక్కన చూడాలి, పోటీ ప్రపంచంలో ఏమి జరుగుతోంది అన్నది గమనిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అలా కాలానికి కంటే అడుగు ముందు ఉన్న వారు విజేతలుగా ఉంటారు, కాలంతో పాటు నడిచేవారు జీవితాలలో రాణిస్తారు, వెనకబడిన వారు మాత్రం ఫెయిల్యూర్స్ ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు అని అంటారు. మరి అప్డేట్ అన్న మాట ఒక తారకమంత్రంగా సదా మననం చేసుకుంటే కనుక ప్రతీ వారూ ఎంతో కొంత సాధిస్తారు అన్నది మాత్రం అక్షర సత్యమే సుమా.
