మరో 4 మాసాల్లో ఎన్నికలు.. పార్టీలకు 'బీటలు'
దేశంలో ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. హమ్మయ్య అని అనుకునేలోగానో.. మరో 4 మాసా ల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.
By: Garuda Media | 18 Jun 2026 2:09 PM ISTదేశంలో ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. హమ్మయ్య అని అనుకునేలోగానో.. మరో 4 మాసా ల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అది కూడా.. అత్యంత కీలకమైన.. రాష్ట్రాల్లోనే కావడం గమనార్హం. ఈ జాబితాలో మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్(పెద్ద రాష్ట్రం), గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలి. మార్చిలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడాలి.
కానీ.. ఆయా రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. దీనికి కారణం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జన గణన ప్రారంభం కానుంది. దీంతో సిబ్బంది సమస్య వచ్చే అవకాశం ఉంటుం దని భావిస్తున్న కేంద్రం.. ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనిలో ఎలాంటి తప్పులేదు. కానీ, ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో జరుగుతున్నచర్యలు.. ప్రాంతీయ పార్టీలను మరోసారి చీలికల దిశగా నడిపిస్తున్న తీరు వంటివి ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.
ఉత్తరాఖండ్: ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలను ఈ ఏడాది నవంబరులోనే నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. తాజాగా 12 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్: ఇక్కడ కూడా బీజేపీనే అధికారంలో ఉంది. అతి పెద్ద రాష్ట్రం. పైగా 2029లో తిరిగి మోడీ అధికారంలోకి రావాలంటే.. ఖచ్చితంగా ఇక్కడ విజయం దక్కించుకోవాలి. ఈ నేపథ్యంలో చిన్న చితకా పార్టీలపై ఒత్తిడి పెరుగుతోంది. విలీనం అయినా చేయండి.. లేదా.. పార్టీలనైనా మూసేయండి.. అంటూ తెరచాటు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం.. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక, 9 మంది ఎంపీలు.. బీజేపీకి ఇప్పటికే జై కొట్టారు.
గోవా: చిన్నరాష్ట్రమే అయినా.. బీజేపీ కి కీలకం. దీంతో ఇక్కడ కూడా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు రిసార్టు రాజకీయాలు ప్రారంభమయ్యాయిని అంటున్నారు. వారికి సంబంధించిన వ్యాపారాలకు.. ప్రభుత్వం అనుమతి ఇవ్వడం రాజకీయంగా విమర్శలకు తావిచ్చింది.
పంజాబ్: ఇక్కడ ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) అధికారంలో ఉంది. అయితే.. పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటను తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. అదేసమయంలో ముక్యమంత్రి భగవంత్ సింగ్ మాన్.. పచ్చి తాగుబోతని.. ప్రచారం చేస్తున్నారు.
మణిపూర్: గత రెండు సంవత్సరాలుగా జాతుల మధ్య సంఘర్షణతో అట్టుడుకుతున్న ఈ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. అయితే.. తమకు అనుకూలంగా పరిస్థితిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతుల మధ్య ఘర్షణలకు.. కాంగ్రెస్ కారణమంటూ.. తాజాగా ప్రచారం మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురిని తమలో కలపుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి.
