22 మందికి ఉరిశిక్షలు.. జడ్జి బెంచ్ నుంచి 100కు పైగా హత్య కేసుల బదిలీ!
ఉత్తర ప్రదేశ్ లోని ఒక న్యాయమూర్తి 10 వేర్వేరు కేసుల్లో నాలుగు నెలల్లో ఏకంగా 22 మందికి ఉరి శిక్ష విధించారు.
By: Garuda Media | 20 Aug 2026 12:30 PM ISTఉత్తర ప్రదేశ్ లోని ఒక న్యాయమూర్తి 10 వేర్వేరు కేసుల్లో నాలుగు నెలల్లో ఏకంగా 22 మందికి ఉరి శిక్ష విధించారు. దీంతో మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్షలు విధించే అవకాశం ఉన్న కేసులు ఆ న్యాయమూర్తి ఉన్న బెంచ్ మీదకు వస్తే ఆయన ఉరి శిక్ష విధించడం ఖాయం అన్న ఆందోళనలు తలెత్తాయి. దీంతో అడ్మినిస్ట్రేషన్ కారణాలు, న్యాయవాదులు, లిటిగెంట్ల ఆందోళన నేపథ్యంలో దాదాపు 100కు పైగా హత్య కేసులు వివిధ కారణాలతో ఇతర కోర్టులకు బదిలీ చేసినట్లు తెలుస్తుంది.
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ గత నాలుగు నెలల్లో ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 10 కేసులలో 22 మందికి ఉరిశిక్ష విధించారు. వీటిలో న్యాయవాది హత్య, హోమ్ గార్డ్ హత్యతో పాటు హైవే మీద దోపిడీ హత్య కేసులతో పాటు వ్యాపారి కిడ్నాప్, హత్య, రైతు హత్య, తల్లి, కుమారుడి జంట హత్యలు, మాజీ సర్పంచ్ హత్యలు ఉన్నాయి. ఇంతకుముందు బరేలీలో న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో కూడా 13 మందికి ఉరిశిక్ష విధించినట్లు సమాచారం.
2009 డిసెంబర్ 17న జూనియర్ సివిల్ జడ్జిగా ఉత్తర ప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసులో చేరిన రవికుమార్ దివాకర్ 2017లో సీనియర్ డివిజన్ కు సివిల్ జడ్జ్ గా ప్రమోషన్ పొందారు. 2023 నవంబర్ లో హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసులో చేరారు. అజమ్‌గఢ్, సుల్తాన్‌పూర్, బుదావున్, వారణాసి, బరేలీ, చిత్రకూట్ లలో పనిచేశారు. వారణాసిలో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్)గా ఉన్నప్పుడు, హిందూ మహిళల పిటిషన్‌పై జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో వీడియోగ్రాఫిక్ సర్వేకు ఆదేశించారు. ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. తర్వాత సుప్రీం కోర్టు కేసును బదిలీ చేసింది. ఈ న్యాయమూర్తి మరో సోదరుడు కూడా సివిల్ జడ్జ్ కాగా, మరో సోదరుడు న్యాయవాది కావడం గమనార్హం.
